Prince Review: 'ప్రిన్స్' మూవీ రివ్యూ &రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : శివకార్తికేయన్, మరియా, సత్య రాజ్ తదితరులు
దర్శకత్వం :  కెవి అనుదీప్
నిర్మాత‌లు : సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుష్కర్ రామ్మోహన్ రావు 
సంగీతం : థమన్
సినిమాటోగ్రఫర్ : మనోజ్ పరమహంస 
ఎడిటర్: ప్రవీణ్ కె ఎల్


రేటింగ్: 2.5/5


'జాతిరత్నాలు'తో అందరినీ నవ్వించాడు దర్శకుడు అనుదీప్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో పాటు అనుదీప్ కి మంచి పేరు తీసుకొచ్చింది. తమిళ హీరో శివకార్తికేయన్ కామెడీ సినిమాలు పెట్టింది పేరు.  వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు  వీరిద్దరూ కలసి తెలుగు- తమిళ్ ద్విభాషా చిత్రంగా 'ప్రిన్స్' చేశారు. ట్రైలర్ లో జాతిరత్నాలు మార్క్ వినోదం కనిపించింది. నవ్వించడానికి మరో సినిమా తీసినట్లనిపించింది. మరా వినోదం ఎలా సాగింది ? అనుదీప్ మరోసారి నవ్వించాడా ?


కథ:


విశ్వనాధ్ (సత్య రాజ్) ఆదర్శవాది. అందరి రక్తం ఎరుపు రంగులోనే వుంటుంది. అందుకే అందరూ సమానమే. కులాలు మతాలు లేవు. భారతీయులంతా ఒక్కటే అనేది ఆయన సిద్ధాంతం. విశ్వనాథ్ కొడుకు ఆనంద్ (శివ కార్తికేయన్ ) స్కూల్ లో సోషల్ టీచర్. ఆదర్శవాది అయిన విశ్వనాథ్ ''సొంత కులం, మతం కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి'' అని కొడుకు ఆనంద్ కు చెబుతాడు. చెప్పడమే కాదు.. కొడుకు చేత హామీ పత్రం తీసుకుంటాడు.


ఆనంద్ పని చేసే స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా చేరుతుంది జెస్సికా (మరియా). తను బ్రిటిష్ అమ్మాయి. జెస్సికా చూసిన తొలి చూపులోనే లవ్ లో పడిపోతాడు ఆనంద్. జెస్సికా కూడా ఆనంద్ లవ్ లో పడుతుంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. తండ్రి మాట ప్రకారం కులం మతం కాదు ఏకంగా దేశం దాటి అమ్మాయిని ప్రేమించాననే సంబరపడిపోతూ తండ్రి దగ్గరకి వచ్చి తన ప్రేమ సంగతి చెబుతాడు ఆనంద్.  అయితే ఆదర్శవాది అయినా విశ్వనాధ్, ఆనంద్ జెస్సికాల ప్రేమకి అడ్డం తిరుగుతాడు? బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించిన ఆనంద్ కి ఊర్లో వాళ్ళ నుండి కూడా సమస్యలు వస్తాయి. మరి ఈ సమస్యలని ఎలా దాటాడు ? తండ్రిని ఎలా ఒప్పించాడు ? అనేది మిగతా కథ.


విశ్లేషణ:

 

బేసిగ్గా సినిమా ఇండస్ట్రీలో ఒక కథ  హిట్ అయితే అదే మూసలో వుండే కథలు కొన్ని వరుసగా రెడీ అవుతాయి. అనుదీప్ కూడా ప్రిన్స్ కి అదే సూత్రం ఫాలో అయ్యాడు. జాతిరత్నాలు టైపు పాత్రలు, టెంప్లెట్ తో ఒక కథ తయారుచేసి దానికి 'ప్రిన్స్' అని పేరు పెట్టాడు. ఇది తమిళ ప్రేక్షకులకు ఫ్రెష్ గా వుంటుందోమో కానీ తెలుగు ఆడియన్స్ కి ఇదివరకే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. హీరో, హీరో,  తండ్రి సత్య రాజ్ పాత్రల పరిచయ సన్నివేశాలు, స్కూల్ లో జరిగే కామెడీ సీన్స్, సొరకాయ, లస్క్ టపా కామెడీ, బింబిలిక్కి, జెస్సికా పాటలతో ఫస్ట్ హాఫ్ సాఫీగానే జరిగిపోతుంది.


సెకండ్ హాఫ్ లో అసలు సమస్య మొదలైయింది. దర్శకుడు ఎంచుకున్న 'ప్రపంచశాంతి' పాయింట్ ఈ నవ్వులాట ట్రీట్మెంట్ నప్పలేదు. యుద్ధం, దేశమని ఏవేవో మాట్లాడిన అంతా కుత్రిమంగానే వుంటుంది. దీంతో సెకండ్ హాఫ్ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కుదిరిన కామెడీ సెకండ్ హాఫ్ లో అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఇక క్లైమాక్స్ అయితే జాతిరత్నాలు కోర్టు సీన్ ని ఫాలో అయిపోయాడు. ఎదో పిచ్చిపిచ్చిగా మాట్లాడి చివర్లో అందరితో 'హ్యుమానిటీ' అనిపించి శుభం కార్డ్ వేశాడు. జాతిరత్నాలు చూసిన వారికి ఇది పరమ రొటీన్ క్లైమాక్స్ అనిపిస్తుంది.


నటీనటులు:


శివకార్తికేయన్ కి ఇది అలవాటైన పాత్రే. తన ఇమేజ్ కి సరిగ్గా సరిపోయింది. శివ కామెడీ టైమింగ్, డ్యాన్సులు అభిమానులని మెప్పిస్తాయి.

 

సత్యరాజ్ పాత్రలో కూడా నవ్వులు వున్నాయి. ఆయన కూడా సరదాగా చేశారు. జెస్సికాగా  చేసిన మరియా పాత్రకు తగ్గట్టు నటించింది. భూపతిగా ప్రేమ్ జీ ఓకే. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి


సాంకేతిక వర్గం:


తమన్ పాటల్లో జెస్సికా, బింబిలిక్కి పాటలు బావున్నాయి. ఆ పాటల్లో శివ చేసిన డ్యాన్సులు కూడా ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతం ఓకే. మనోజ్ పరమహంస కెమరాపని తనం రిచ్ గా వుంది.


అనుదీప్ డైలాగులు కొన్ని నవ్విస్తాయి, కథకు తగ్గ నిర్మాణ విలువలు వున్నాయి. ద్విభాష చిత్రం అన్నారు కానీ రెండు మూడు తెలుగు బోర్డులు పెట్టి కేవలండబ్బింగ్ మాత్రమే తెలుగులో చెప్పించారు.


ప్లస్ పాయింట్స్


ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్
తమన్ పాటలు


మైనస్ పాయింట్స్


పాత కామెడీ
సంఘర్షణ లేని కథ
పాత్రల్లో బలం లేకపోవడం
 
చివరిగా.. తమిళ జాతిరత్నం!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS