కన్నడ సీమలో విడుదలై, దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన చిత్రం కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటింటిచన చిత్రమిది. తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. ఈ సినిమాతో గీతా ఆర్ట్స్ జాక్ పాట్ కొట్టిందనే చెప్పాలి. తొలి షోకే హిట్ టాక్ రావడంతో.. వసూళ్లు దండిగా వచ్చాయి. తొలి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కనీసం రూపాయికి మూడు రూపాయల లాభం రాబోతోందన్నది ట్రేడ్ వర్గాల అంచనా.
అయితే.. కాంతార క్లైమాక్స్ చూస్తే.. పార్ట్ 2కి బీజం వేసినట్టు కనిపించింది. హీరోయిన్ గర్భవతిగా ఉండడం, హీరో.. అడవిలోకి వెళ్లి మాయమైపోవడంతో కథ ముగిసింది. దాంతో పార్ట్ 2 ఉంటుందనే అంచనాకు వచ్చారంతా. కాంతార సూపర్ హిట్టవ్వడంతో పార్ట్ 2 తీస్తే కచ్చితంగా ఆదరణ ఉంటుంది. మార్కెట్ పరంగా, బిజినెస్ పరంగా ప్లస్ అవుతుంది. కానీ.. రిషబ్ శెట్టి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. కాంతార పార్ట్ 2ని రిషబ్ పక్కన పెట్టేశాడట.
''కాంతార 2 గురించి ఇప్పుడేం ఆలోచించడం లేదు. ఎందుకంటే.. ఇలాంటి కథల్ని కొనసాగించడం చాలా కష్టం. కాంతార ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైంది. ఇప్పుడు పార్ట్ 2 అంటే అంచనాలు ఎక్కువైపోతాయి.. వాటిని తట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు. దానికంటే... కొత్త కథ రాసుకోవడం నయం'' అని రిషబ్ చెప్పుకొచ్చాడు. సో.. కాంతార 2 లేనట్టే అనుకోవాలి.