నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, తేజస్, ఆమని, ముమైత్ ఖాన్ తదితరులు
దర్శకత్వం: శంకర్ భాను
నిర్మాణం: సి కళ్యాణ్
సంగీతం: రాధన్
సినిమాటోగ్రఫర్: సి రామ్ ప్రసాద్
విడుదల తేదీ: అక్టోబర్ 10, 2019
రేటింగ్: 2/5
ఒక్క సినిమా... ఒకే ఒక్క సినిమాతో కొండంత క్రేజ్ సంపాదించుకుంది పాయల్ రాజ్‌పుత్. ఆర్.ఎక్స్ 100తో... టాలీవుడ్‌ని షేక్ చేసిన పాయల్‌కు.. ఆ తరవాత చాలా పెద్ద ఆఫర్లే వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు వరస కట్టాయి. అయితే.. అనూహ్యంగా `ఆర్‌డిఎక్స్ లవ్` అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని ఎంచుకుంది. కెరియర్‌లో స్థిరపడాల్సిన తరవాత చేయాల్సిన కథని.. ఇంత తొందరగా చేస్తోందేంటి? అని అంతా ఆశ్చర్యపోయారు.
కథలో విషయం ఉందేమో అని - సమాధాన పరచుకున్నారు. టీజర్ వస్తే అదో బోల్డ్ సినిమా అని అర్థమైపోయింది. ఆర్.ఎక్స్ 100ని మించిన బోల్డ్ నెస్ ఈ సినిమాలో చూపిస్తుందని ముందే ఫిక్సయ్యారు ఆడియన్స్. మరి ఆర్.డి.ఎక్స్ కూడా అదే రేంజులో ఉందా? పాయల్‌కి రెండో సినిమా కలిసొచ్చిందా? లేదా?
* కథ
అలివేలు (పాయల్ రాజ్‌పుత్) పల్లెటూరు నుంచి పట్నం వచ్చిన అమ్మాయి. ఇక్కడ కొంతమంది అమ్మాయిలతో కలిసి సంఘ సేవ చేస్తుంటుంది. సిద్దూ (తేజస్) తొలి చూపులోనే అలివేలుని ఇష్టపడతాడు. ఆమె వెంట పడతాడు. అలివేలు లక్ష్యం ఒక్కటే... సంఘసేవ చేస్తూ - సీఎం దృష్టిలో పడడం. తద్వారా తన ఊర్లో ఉన్న ఓ ప్రధానమైన సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.
ఈ విషయం తెలుసుకుని, సీఎమ్‌తో అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేశాడు. అయితే ఆ తరవాతి నుంచే అలివేలు అనేక సమస్యలలో పడుతుంది. అవేంటి? ఇంతకీ అలివేలు ఎవరు? తన ఊరికి ఉన్న సమస్యేంటి? అనేవి తెలియాలంటే `ఆర్.డి.ఎక్స్ లవ్` సినిమా చూడాల్సిందే.
* నటీనటులు
ఆర్ఎక్స్ 100లానే ఆర్‌డిఎక్స్‌లోనూ.. గ్లామర్‌తో బండి నడిపించేసింది పాయల్. ఈ సినిమాకి తనే ప్రధాన ఆకర్షణ. బోల్డ్ సన్నివేశాల్లో బాగానే నటించింది. తేజస్ పాత్ర హీరోకి తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్టుకి ఎక్కువ అన్నట్టు సాగే పాత్ర.
ఆదిత్యమీనన్ నటన ఆకట్టుకుంటుంది. స్టైలీష్ విలన్‌గా తను మెప్పిస్తాడు. నరేష్ తన అనుభవాన్ని మరోసారి చూపించారు. చాలారోజుల తరవాత ముమైత్ ఖాన్ తెరపై కనిపించింది.
* సాంకేతిక వర్గం
రాధన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అయితే పాటలు ఆకట్టుకోవు. కెమెరా వర్క్ నచ్చుతుంది. పాటల్ని మరీ లో బడ్జెట్‌లో తీసినట్టు తెలుసిపోతుంటుంది. దర్శకుడు అనుకున్న పాయింట్ మంచిదే. కానీ చూపించాల్సిన పద్ధతి ఇది కాదనిపిస్తుంది. తొలి సగంలో చాలా వరకూ.. కండోమ్, హెచ్ ఐ వీ లాంటి పదాలే వినిపిస్తాయి.
* విశ్లేషణ
ముందుగా టైటిల్ నుంచే.. విశ్లేషణ మొదలెడదాం. ఈ టైటిల్ కీ, కథకీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం అందరి అటెన్షన్ ఈ సినిమాపైకి తీసుకురావడానికే ఈ టైటిల్‌ని ఎంచుకున్నాడు దర్శకుడు. ఈ రోజుల్లో సినిమాలకు వచ్చేది యువతరమే కాబట్టి, ఆ ప్రయత్నాన్ని తప్పుపట్టకూడదు. అయితే అడుగడుగునా సినిమాని, కథనీ ఇలానే తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడు. కండోమ్ ప్యాకెట్స్ పంచుతూ కథానాయికని పరిచయం చేయడం దగ్గరి నుంచి, హీరోని వాడుకుంటూ విలన్‌ని బుద్ధి చెప్పే సన్నివేశం వరకూ - ప్రతీదీ రాంగ్‌రూట్‌లో వెళ్లి డిజైన్ చేసిన సీన్లే. ముఖ్యమంత్రి దృష్టిలో పడడానికి - కథానాయిక రోడ్డెక్కి సేవ చేయడం వరకూ ఓకే.
కానీ.. ఆయా సన్నివేశాలు హెచ్ఐవీ నిరోధక ప్రచార కార్యక్రమంలా సాగగడం వల్లే ఇబ్బంది ఎదురవుతుంది. ఓ ఊరిలో ఆడాళ్లంతా.. పిల్లలు పుట్టక గిలగిలలాడిపోతుంటే, మొగుళ్లని వసపరచుకోవడానికి ఇంటింటికి మల్లెపూలు పంచుతుంది హీరోయిన్. వాత్స్యాయన కామసూత్ర పాఠాలు చెబుతుంది. దాంతో మగాళ్లు రెచ్చిపోయి - మంచాలు ఇరగ్గొడతారు. పిదప ఆడవాళ్లంతా మూకుమ్మడిగా మామిడికాయలు కొరుకుతారు. ఇలాంటి సన్నివేశాలతో.. దర్శకుడు ఏం చెప్పదలచుకున్నట్టు..? కథలోని ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ.. దాన్ని చెప్పే విధానం కూడా పద్ధతిగానే ఉండాలి. ఇలాంటి సన్నివేశాలు.. ఆర్‌డిఎక్స్‌లో చాలా కనిపిస్తాయి.
ద్వితీయార్థంలోనైనా కథ పట్టాలెక్కుతుందా అంటే అదీ ఉండదు. హీరోని బకరా చేసుకుని, హీరోయిన్ విలన్‌కి బుద్ధి చెప్పాలనుకుంటుంది. అక్కడ కూడా... శృంగారపరమైన కార్యకలాపాలే జరుగుతుంటాయి. పతాక సన్నివేశాలకు గానీ, హీరోయిన్ ఇదంతా ఎందుకు చేస్తుందో తెలీదు. అప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుడు ఓ అభిప్రాయానికి వచ్చేస్తాడు. ఆతరవాత.. ఎంత ధీరోదాత్తమైన పాత్రని పరిచయం చేసినా ఉపయోగం ఉండదు. పతాక సన్నివేశాలు కూడా ఏదో హడావుడిగా ముగించేయాలన్న తపనలో తీసేసినట్టు అనిపిస్తుంది. దాంతో.. అవి కూడా ప్రేక్షకుడి మనసులో ముద్రించుకోలేకోపోయాయి.
* ప్లస్ పాయింట్స్
పాయల్ రాజ్‌పుత్
* మైనస్ పాయింట్స్
మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్: త్రిబుల్ ఎక్స్ సినిమా
- రివ్యూ రాసింది శ్రీ