'రిపబ్లిక్' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ తదితరులు
దర్శకత్వం : దేవ కట్ట
నిర్మాత‌లు : భగవాన్, పుల్లారావు
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫర్ : ఎమ్. సుకుమార్
ఎడిటర్ : కె.ఎల్. ప్రవీణ్

 

రేటింగ్: 2.75/5

 

ప్రస్థానం సినిమాతో తనదైన ముద్ర వేశాడు దర్శకుడు దేవాకట్టా. ఆయన సినిమా అంటే విషయం ఉంటుందనే నమ్మకం సంపాదించుకున్నాడు. ఆటోనగర్ సూర్య సరిగ్గా ఆడకపోయినా పాయింట్ చాలా సీరియస్ అనే ప్రశంస దక్కింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన రిపబ్లిక్ ని తెరక్కించాడు. మెగా హీరో సాయి ధరమ్ హీరో కావడం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. సాయి  ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాలే చేశాడు. మొదటిసారి దేవాకట్టా లాంటి దర్శకుడితో జతకట్టాడు సినిమాని ఆసక్తిని పెంచాయి. ట్రైలర్,  టీజర్ ఆసక్తిని ఇంకా పెంచాయి. రిపబ్లిక్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రాకతో సినిమాకి వేరే లెవల్ ప్రమోషన్ దక్కింది. ఇన్ని అంచనాల మధ్య వచ్చిన సినిమా ఎలా వుందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.


కథ


అభిరామ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌) చిన్నప్పటి నుంచే మోస్ట్ ఇంటలిజెంట్. పుస్తకాల్లోనే కాదు, జీవితంలో ఎదురైన ప్రతి ప్రశ్నకూ స‌మాధానాలు వెదుకుతూ ఉంటాడు. అభి తండ్రి ( జగపతి బాబు) ఒక ప్రభుత్వ ఉద్యోగి. లంచాలు తీసుకుంటుంటాడు. అభికి ఇది నచ్చదు. బాగా చ‌దువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి అమెరికాలో సెటిలైపోవాలని అనుకుంటాడు. ఇంతలో ఒక ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్తాడు. అక్కడ  క‌లెక్టర్ (సుబ్బరాజు)తో చిన్న గొడవ జగుగుతుంది. ఆ గొడవ అభి ప్రయాణాన్ని మార్చేస్తుంది. బాగా చ‌దివి, జిల్లా క‌లెక్టర్ అవుతాడు.


క‌లెక్టర్ అయ్యే ప్రోసెస్‌లో వ్యవ‌స్థలో డొల్లతనం కనిపిస్తుంది. ఐఎఎస్ ఇంట‌ర్వ్యూలో కూడా తాను గమనించిన లోపాలు చెబుతాడు. దాంతో యూపీఎస్‌సీ.. అభిరామ్ ని క‌లెక్టర్ గా నియ‌మిస్తూ కొన్ని స్పెషల్ పవర్స్ ఇస్తుంది. ఆ పవర్స్ తో వ్యవ‌స్థని మార్చాల‌నుకుంటాడు. త‌న ప‌రిధిలో ఉన్న తెన్నేరు మంచి నీటి స‌ర‌స్సు చుట్టూ ఉన్న సమస్యలని పరిస్కారించాలని భావిస్తాడు. తెన్నేరుపై పెత్తనం చలాయిస్తూ అక్రమాల‌కు పాల్పడుతున్న రాజ‌కీయ నాయ‌కురాలు విశాఖ‌వాణి (ర‌మ్యకృష్ణ)తో అభిరామ్‌కి వార్ మొద‌ల‌వుతుంది.  చివరికి గెలుపెవ‌రిది? వ్యవ‌స్థ మార‌డం కోసం అభిరామ్ చేసిన పోరాటం ఎలా సాగింది? అనేది మిలిగిన కధ.


విశ్లేషణ


సందేశాత్మక కధలని వెండితెరపైకి ఎక్కించడం అంత సులభం కాదు. మెసేజ్ ఇస్తూనే ప్రేక్షకులని మెస్మైరైజ్ చేయడం ఒక ఆర్ట్. దర్శకుడు శంకర్, రాజ్ కుమార్ హిరాణీ లాంటి దర్శకులు ఈ టెక్నిక్ అద్భుతంగా పట్టుకున్నారు. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, త్రీ ఇడియట్స్, పీకే.. ఇలా బోలెడు అద్భుతాలు వున్నాయి. దర్శకుడు దేవాకట్టా కూడా ఒక సోషల్ ఇష్యూని వెండితెరపై చూపించాలని అనుకున్నారు. ఆయన అనుకున్న పాయింట్ బాగానే వుంది. అయితే ఆ పాయింట్ ని చూపించడంలో తడబాటు స్పష్టంగా కనిపించింది.


సందేశాత్మక సినిమాలని తీయడానికి రెండు పద్దతులు వున్నాయి. శంకర్ టైపులో కమర్షియల్ గా వెళ్లిపోవాలి. లేదా దర్శకుడు బాల నేచురల్ రూటు ఫాలో అయిపోవాలి. కానీ దేవాకట్టా మాత్రం అటు ఇటు కాక మధ్యస్థంగా నడిపారు. దీంతో రిపబ్లిక్ రెండికి చెడ్డ రేవడి అనే భావన కలిగిస్తుంది. దర్శకుడు నిజాయితీ గల ఒక పాయింట్ ని తీసుకున్నారు. దేవాక‌ట్టాకు ఈ వ్యవ‌స్థపై కొంత అవ‌గాహ‌న ఉంది. వ్యవస్థలోని డొల్లతనం తెలుసు. అదే తెర‌పై చూపించాన్న ప్రయ‌త్నం చేశారు. కానీ దాన్ని సినిమాగా మార్చడంలో మాత్రం తడబడ్డారు.  


సినిమాలో మొదటి సగం అంతా పాత్రలు పరిచయం చేస్తూ ఒక సీరియస్ మూడ్ క్రియేట్ అవ్వడానికే తీసుకున్నాడు దర్శకుడు. హీరో తో పాటు ప్రధాన పాత్రన్నిటికీ ఒక బ్యాక్ స్టొరీ వుంటుంది. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్‌..ఇలా ప్రతీ పాత్రకూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వెబ్ సిరిస్ లకు ఈ బ్యాక్ స్టొరీ ఫార్ముల బావుంటుందేమో కానీ సినిమా వరకూ మాత్రం అంత అవసరం లేదు.  ప్రతిదీ డీటెయిల్ గా చెప్పాలనే దర్శకుడి తపన బావుంది కానీ ప్రేక్షకుడి సహనానికి కూడా ఓ హద్దు వుంటుందనే సంగతి కూడా గుర్తు పెట్టుకోవాలి.


ద్వితీయార్ధం నుంచి కొత్త సీరియస్ డ్రామా మొద‌ల‌వుతుంది. వ్యవ‌స్థల‌న్నింటినీ త‌న చెప్పు చేతల్లో పెట్టుకున్న విశాఖ‌వాణికీ, అభిరామ్‌కీ వార్ మూడ్ క్రియేట్ అవుతుంది. అయితే ఇది నేరుగా కాకుండా వ్యవస్థతో పోరాటం అన్నట్టు చిత్రీకరించారు. దేవాకట్ట తీసుకున్న పాయింట్ కూడా వ్యవస్థతో పోరాటమే. అయితే వ్యవస్థ పోరాటం చేసే క్రమంలో అసలు విలన్ ఎవరో అర్ధం కానీ పరిస్థితి సామాన్య ప్రేక్షకుడిలో కలుగుతుంది.  దీంతో విశాఖ‌వాణి, అభిరామ్‌ మధ్య జరిగే ఘర్షణ కనెక్టింగ్ గా వుండదు. దినితోడు ఒకే కధలో చాలా పాయింట్లు చెప్పయాలనే తాపత్రయం కనిపించింది. దీంతో ఏ పాయింట్ కి కనెక్ట్ అవ్వాలో ప్రేక్షకుడికి ప్రశ్నగ మారిపోయింది. దేవాకట్టా లో మంచి రచయిత వున్నాడు. చాల మంచి డైలాగ్స్ వున్నాయి ఇందులో. అయితే ఇదే మైనస్ కూడా మారింది. సినిమా అంటే విజువల్ ట్రీట్ . ఎక్కువ మాటలు వినిపించేసరికి మంచి డైలాగ్స్ కూడా లైట్ అయిపోయాయి.


నటీ నటులు


సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా మొత్తాన్ని భుజానికెత్తుకొని మోసాడు. చాల సెటిల్ గా కనిపించాడు. ఐతే కొంచెం లావుగా కనిపించడం. ఫిజిక్ విషయంలో సాయి జాగ్రత్త పడాలి. ఐశ్వర్య రాజేశ్ నటన ఓకే . ర‌మ్యకృష్ణది బ‌ల‌మైన పాత్రే కానీ..ఇంకా బలంగా రాసుకోవాల్సింది. ఆమె హుందాగా కనిపించింది.  శ్రీకాంత్ అయ్యర్‌‌, రాహుల్ రామ‌కృష్ణ‌, సుబ్బరాజు ..  ప‌రిధి మేర‌కు న‌టించారు.


సాంకేతిక వర్గం


మ‌ణిశ‌ర్మ నేపధ్య సంగీతం బావుంది. సుకుమార్ కెమెరా ఆకట్టుకుంది. విజువల్ కొన్ని బావున్నాయి. నిర్మాణ విలువలు ఓకే. డైలాగులు ఆకట్టు కుంటాయి.


ప్లస్ పాయింట్స్


 సాయిధ‌ర‌మ్ తేజ్ న‌ట‌న‌
డైలాగ్స్
 

మైనస్ పాయింట్స్


నెమ్మదించిన క‌థ‌నం
సాదాసీదా క్లై మాక్స్


ఫైనల్ వెర్డిక్ట్: సీరియస్ గా సాగే సోషల్ పాఠం


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS