బిగ్ బాస్ 5 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ వారం ఎలిమినేషన్ ఘట్టం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ప్రతీ సీజన్‌లోనూ... వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త కంటెస్టెంట్లని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతుంటారు. ఈసారి.. అలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందనే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆశ. ఆ జాబితాలో విష్ణు ప్రియ పేరు గట్టిగా వినిపించింది. విష్ణు ప్రియ ఈమధ్య సోషల్ మీడియాలో .. హాట్ హాట్ ఫోజులో వేడి పుట్టిస్తోంది.
బిగ్ బాస్ పిలుపు కోసమే... తాను ఇలా రెచ్చిపోతోందన్న కామెంట్లు గట్టిగా వినిపించయాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపుతారని అందరూ ఎదురు చూశారు. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదన్నది ఇన్‌సైడ్ వర్గాల టాక్. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లే సరిపోతారని, కొత్తగా ఎవరూ అవసరం లేదని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోందట. పైగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లడానికి ఎవరూ ఉత్సాహం చూపించడం లేదు. అలా చేయాలంటే ముందు 14 రోజుల పాటు క్వారెంటైన్ లో గడపాలి. అలాంటి ఏర్పాట్లేం ఇప్పటి వరకూ చేయలేదు.
వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినవాళ్లెవరూ టైటిల్ గెలవలేదు. అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ఎందుకన్నది ప్రశ్న. పైగా విష్ణు ప్రియకు బిగ్ బాస్ అంటే పడదట. అసలు అలాంటి షోలో అవకాశం ఇచ్చినా, పాల్గొనను... అని ఇది వరకే కుండబద్దలు కొట్టింది. అలాంటప్పుడు విష్ణు ప్రియ పేరు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. మొత్తానికి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదన్నది అందరి మాట.