' రొమాంటిక్' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణ, ఉత్తేజ్ తదితరులు
దర్శకత్వం :  అనీల్ పాదురి
నిర్మాత‌లు : పూరి జగన్నాథ్, ఛార్మి
సంగీతం : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫర్ : నరేష్ రానా
ఎడిటర్ : జునైద్ సిద్దికి


రేటింగ్: 2.75/5

 
ఇండస్ట్రీ నేపధ్యం లేకుండా ఇండస్ట్రీలో టాప్ దర్శకుడిగా నిలబడ్డాడు పూరి జ‌గ‌న్నాథ్. కానీ ఆకాష్ పూరి విషయానికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారింది. ఆకాష్ అంటే పూరి జ‌గ‌న్నాథ్ కొడుకు. ఆ ఇమేజ్ తగ్గట్టు రాణించడం అంటే మామూలు మాటలు కాదు. బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి వచ్చేశాడు ఆకాష్. కానీ ఎప్పుడైతే హీరోగా టర్న్ తీసుకున్నాడో అప్పుడే సమస్య మొదలైయింది.

 

ఆకాష్ కి ఇప్పటివరకూ హీరోగా విజయం దక్కలేదు. స్వయంగా పూరి దర్శకత్వం వహించిన 'మెహబూబా' సినిమా కూడ నిరాశ పరిచింది. ఐతే మళ్ళీ పూరి రాసిన క‌థ‌తోనే 'రొమాంటిక్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆకాష్. ప్రభాస్, విజయ్ దేవర కొండ లాంటి స్టార్లు సినిమాని ప్రమోట్ చేశారు. వారి ప్రమోషన్ సినిమాపై అంచనాలు పెంచింది. మరి ఆ అంచనాలు ఆకాష్ అందుకున్నాడా ? హీరోగా ఆతడికి విజయం దక్కిందా ? ఒక్కసారి రివ్యూలోకి వెళదాం.

 

క‌థ‌


వాస్కోడి గామా (ఆకాష్ పూరి) గోవాలో ఓ జులాయి. నాన్న నిజాయ‌తీ గల పోలీస్ ఆఫీస‌ర్‌. తన నిజాయ‌తీ వల్లే ప్రాణాలు కోల్పోతాడు. దాంతో వాస్కోడి గామా అనాథ గా మార‌తాడు. ఆ త‌ర‌వాత‌.. డ‌బ్బులు సంపాదించ‌డం కోసం అడ్డదారులు తొక్కుతాడు. అయితే అతడికి ఒక లక్ష్యం వుంది. కట్ చేస్తే.. గోవాలో  డ్రగ్స్ దందా విచ్చల విడిగా కొన‌సాగుతుంటుంది. వాస్కోడిగామా ఓ గ్యాంగ్ లో చేరతాడు. ఆ గ్యాంగ్ కి లీడ‌ర్ అవుతాడు. ఇదే సమయంలో మోనిక (కేతిక శ‌ర్మ)ని చూసి కామిస్తాడు.

 

రోమాన్స్..  వైలెన్స్ గా సాగుతుంది వాస్కోడి గామా లైఫ్. కట్ చేస్తే .. వాస్కోడిగామా గ్యాంగ్ ని ఖతం చేయడానికి  గోవాలో అడుగుపెడుతుంది ఏసీపీ రమ్య గోవార్కర్ (ర‌మ్యకృష్ణ). అప్పుడు ఏం జరిగింది.?  మోనిక‌ వాస్కోడి గామాలది కామమా, ప్రేమా? వాస్కోడి గామా కి వున్న లక్ష్యం ఏమిటి ? ఏసీపీ రమ్య, వాస్కోడిగామా గ్యాంగ్ ని ఏం చేసింది ? అనేది వెండితెరపై చూడాలి.


విశ్లేషణ

 

ఈ సినిమాకి అనిల్ పాడూరి దర్శకుడు. కధ స్క్రీన్ ప్లే మాటలు..  పూరి. అయితే ఈ సినిమాకి దర్శకుడు కూడా పూరినే అన్నట్టుగా వుంది రొమాంటిక్. పూరి హీరో అనగానే ఒక అనాధ, సమాజం అంటే లెక్కలేనితనం, గ్యాంగ్ స్టార్.. ఇలాంటి సెటప్ వుంటుంది. రొమాంటిక్ లో కూడా అదే సెటప్ లో వెళ్ళిపోయారు. జులాయిగా తిరిగేకుర్రాడు స‌డ‌న్ గా గ్యాంగ్ స్టర్ గా మారిపోవడం, అప్పటి వరకూ వున్న గ్యాంగ్స్ ని పక్కకు జరిపి లీడర్ అయిపోవడం, హీరోయిన్ ని చూసిన వెంటనే ప్రేమలో పడిపోవడం .. ఇలా కామన్ గా జరిగిపోతుంది. అయితే రొమాంటిక్ లో ప్రేమ కాస్త లస్ట్ లోకి వెళ్ళింది.


హీరోయిన్ ని చూసిన వెంటనే కసిగా కామించేశాడు హీరో. ఇంక అక్కడి నుంచి విచ్ఛలవిడిగా రోమాన్స్ వుంటుంది. ఒక యాక్షన్ సీన్ తర్వాత మరో రోమాన్స్ సీన్.. ఇలా సాగిపోతుంది రొమాంటిక్ ప్రయాణం. పూరి మార్క్ సీన్లు, డైలాగులతో మరీ సాగాదీత లేకుండా నడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్ కాస్త ఆటు ఇటుగా సాగిన రొమాంటిక్..  రెండో సగానికి వచ్చేసరికి కాస్త ఎమోషనల్ గా మారిపోతుంది. అయితే  క్లైమాక్స్ ని మాత్రం మళ్ళీ సగటు సినిమాగా మార్చాడు పూరి. పాముని పెంచిన వాడు పాము కాటుకే పోతాడనే టైపులో  ఒక రౌడీ కధకు ఇలాంటి ముగింపు వుంటుదనే నీతి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ముగింపు మరోలా వున్న సినిమా ఫలితంలో పెద్ద తేడా వుండదు. పైగా అప్పటి వరకూ వాస్కోడిగామా పాత్ర కనెక్ట్ అయిన వారికి ఇలాంటి ముగింపు కాస్త చప్పగానే వుంటుంది.


నటీనటులు


వాస్కోడిగా పాత్రలో ఒదిగిపొవాడానికి ఆకాష్ చాలా కష్టపడ్డాడు. కాస్త  కండ కూడా పట్టాడు. ఆకాష్ లుక్స్ వాయిస్ బావున్నాయి. అయితే వాస్కోడిగామా పాత్ర ఆకాష్ కి హెవీ అయిపోయిందనే బావన కలుగుతుంది. నటన పరంగా ఆకాష్ కి మంచి మార్కులే పడ్డా .. వాస్కోడిగామా పాత్ర ఆకాష్  వయసుకు మించి వుందనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్  కేతిక శ‌ర్మ గ్లామర్ యాడ్ చేసింది. ఆమె లుక్స్ బావున్నాయి. రమ్యకృష్ణ ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. నటనలో ఆమె అనుభవం ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది. ఆమె పాత్రలో చాలా హుందాగా కనిపించింది. ముకుంద్ దేశ్ పాండే , ఉత్తేజ్.. మిగిలిన వాళ్లంతా పరిధిమేర చేశారు.


సాంకేతిక వర్గం


పూరి సినిమా ఇది. కధకు ఏం కావాలో అన్నీ సమకూర్చారు. ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు. పాటలు బావున్నాయి. పీనేకే బాద్‌.. పాటకు థియేటర్ లో విజల్స్ పడతాయి. పాటలో రామ్, పూరి క‌నిపించ‌డం మరో స్పెషల్ ఎట్రాక్షన్. కెమరా పనితనం బావుంది.  గోవా నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని చాలా క‌ల‌ర్‌ఫుల్ గా చూపించారు. పూరి రాసుకున్న డైలాగులు కొన్ని కురాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి  


ప్లస్ పాయింట్స్


ఆకాష్ నటన, కేతిక శ‌ర్మ గ్లామర్
పూరి మార్క్ డైలాగ్స్
రొమాంటిక్ పాటలు

 
మైనస్ పాయింట్స్


కధలో కొత్తదనం లేకపోవడం
మలపులు లేని స్క్రీన్ ప్లేయ్
 

ఫైనల్ వర్డిక్ట్ : కుర్రాళ్ళకు నచ్చే రొమాంటిక్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS