రోటీ కపడా రొమాన్స్ మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: రోటీ కపడా రొమాన్స్
దర్శకత్వం: విక్రమ్ రెడ్డి
కథ - రచన: విక్రమ్ రెడ్డి

నటీనటులు: హర్ష నర్రా, తరుణ్ పొనుగంటి, సందీప్ సరోజ్, సుప్రజ్ రంగ, సోనియా ఠాకూర్, ఖుష్బూ చౌదరి, మేఘ లేఖ, నువేక్ష.

నిర్మాతలు: బెక్కం వేణు గోపాల్, సృజన్ కుమార్

సంగీతం: సన్నీ ఎం ఆర్,ఆర్ ఆర్ ధృవన్,వసంత్.జి
సినిమాటోగ్రఫీ: సంతోష్ రెడ్డి
ఎడిటర్: విజయ్ వర్థన్

బ్యానర్: లక్కీ మీడియా,మేరకి ఫిలిమ్స్
విడుదల తేదీ: 28 నవంబర్ 2024

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5

తెలుగులో చిన్న సినిమాలు జోరు ఎక్కువే ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమాల్ని కూడా ఆదరిస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు ఏవి ఆకట్టుకోలేకపోయాయి. ప్రతివారం కొన్ని చిన్నసినిమాలు వస్తున్నాయి, చడీ చప్పుడు లేకుండా వెళ్ళిపోతున్నాయి. కొన్ని సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియటం లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి మంచి పాజిటీవ్ టాక్ తో వస్తోంది 'రోటి కపడా రొమాన్స్‌'. ఈ రొమాంటిక్ మూవీ ఎలా ఉందో, హిట్ అందుకుందో లేదో చూద్దాం.

కథ:

హైదరాబాద్ లో ఓ నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్‌ రాహుల్‌(సందీప్‌ సరోజ్‌), ఆర్జే సూర్య(తరుణ్‌), విక్కీ(సుప్రజ్‌) ఈ నలుగురు చిన్నప్పటి నుంచి ఓకే హాస్టల్ ఉంటూ ప్రాణ స్నేహితులుగా మారుతారు. విక్కీ మాత్రం ఏ ఉద్యోగం చేయకుండా ఫ్రెండ్స్ సంపాదిస్తుంటే జల్సాలు చేస్తుంటాడు. ఓ రోజు సూర్య,హర్ష,రాహుల్ లకి అనానిమస్ గా ఓ ఫ్లైట్ టికెట్ వస్తుంది. దానిని విక్కీ పంపాడు అనుకోని అంతా గోవా వెళ్తారు. గోవాలో వారి జీవితం అనుకోని మ‌లుపులు తిరుగుతుంది. ప్రాణ స్నేహితుల లవ్ స్టోరీలు అక్కడే బయట పడతాయి. ఫ్యాన్‌ అంటూ ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష),వన్ డే బాయ్‌ప్రెండ్‌గా ఉండమని హర్షతో సోనియా(కుష్బూ చౌదరి),ఉద్యోగం ఇప్పించండి అంటూ విక్కీకి శ్వేత(మేఘలేఖ) పరిచయం అవుతారు. రాహుల్‌ ఆఫీస్‌లో పని చేసే ప్రియ(ఠాకూర్‌)ని ఇష్టపడతాడు. కానీ పెళ్లి అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. వీరి జీవితాల్లోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు వలన హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తూ,ఎంజాయ్ చేస్తున్న వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది?ఆ నలుగురి అమ్మాయిలు వలన వీళ్ళు ఎలా డిస్టబ్ అయ్యారు?గోవా ట్రిప్ ఏమయ్యింది?ప్రేమలో పడి మళ్లీ ఎందుకు బ్రేకప్  చెప్పుకున్నారు?లవ్‌ బ్రేకప్‌ తరువాత వాళ్ల రియలైజేషన్‌ ఏంటి?చివరికి విక్కీలో వచ్చిన మార్పు ఏంటి?  తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

స్నేహం, ప్రేమ అన్న కాన్సెప్ట్ ఎప్పటికీ బోర్ కొట్టదు. ఈ కాన్సెప్ట్ తో ఏ భాషలో సినిమాలు వచ్చినా అవి గ్యారంటీగా యూత్ ని ఆకట్టు కుంటాయి. ఎందుకంటే ఇలాంటి కథల్లో యూత్ వారిని వారు చూసుకుంటారు. అది తమ కథ అన్నట్టు ఓన్ చేసుకుంటారు. రోటి కపడా  రొమాన్స్ కూడా  ఇలాంటి కాన్సెప్టే. ల‌వ్‌,ఫ్రెండ్‌షిప్ లాంటి అంశాలను నేటి జనరేషన్ ఎలా ట్రీట్ చేస్తోంది,వారి నడవడిక, ఆలోచ‌న‌లు,తీరు తెన్నులని మెచ్యూరిటీ లేని  తొందరపాటు నిర్ణయాలు,వాటి వలన ఎదురైన సమస్యలు,రిలేష‌న్‌షిప్స్‌లో వచ్చే చిన్న చిన్న అభిప్రాయ‌భేదాలు కారణంగా బ్రేకప్ చెప్పేసుకోవటం ఇలా నలుగురి జీవితాలని,నాలుగు కథలని తెరకెక్కించారు విక్ర‌మ్ రెడ్డి. యూత్ కి అతర్లీనంగా మెసేజ్ ఇస్తూ కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా ఇచ్చారు.

యూత్ కి నచ్చే విధంగా ఆద్యంతం జాగ్రత్త పడ్డారు. ఈ మూవీ మెయిన్ టార్గెట్ నేటి యువతరం అని చెప్పొచ్చు. ఫ‌స్ట్ హాఫ్ ల‌వ్ స్టోరీస్‌ను రివీల్ చేస్తూ,సెకండాఫ్ బ్రేక‌ప్ కి కారణాలు వివరించారు. ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ టచ్ చేసారు. రొమాన్స్‌,స‌స్పెన్స్‌,ఎంట‌ర్‌ టైన్‌మెంట్‌,అన్ని ఉండటం మెచ్చు కోవాల్సిన విషయం. విక్కీ,శ్వేత  కాంబో సీన్స్ మంచి కామెడీని పండించాయి. హ‌ర్ష, సోనియా ల‌వ్‌స్టోరీలో రొమాన్స్ ఎక్కువయ్యింది. బ్రేక‌ప్ విష‌యంలో అమ్మాయిల మనస్తత్వం,ఆలోచ‌నలు తీరు సూర్య,దివ్య ట్రాక్‌లో కనిపిస్తుంది. తెలిసిన కథ,తెలిసిన జోనర్ అయినా ఆడియన్స్ కి విసుగు రాకుండా మెప్పించగలిగాడు దర్శకుడు. చివరి వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగాడు. ఎంటర్ టైన్ మెంట్ కి కొదవ లేకపోయినా కొంచెం ఎమోషనల్ పాళ్ళు తగ్గింది. సెకండాఫ్ బ్రేక‌ప్ స్టోరీస్ రోటీన్ గా ఉన్నాయి.

నటీ నటులు:

ఈ సినిమాలో నటించినవారంతా కొత్తవారే. కానీ ఆ ఫీల్ ప్రేక్షుకుడికి లేకుండా చేశారు. కొత్తవారైనా  మంచి ఫెర్పార్మెన్స్‌ ఇచ్చేలా వారిని గైడ్ చేయటంలో దర్శకుడు విజయం సాధించాడు. వారు కూడా తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. హర్ష నర్రా,సందీప్‌ సరోజ్‌, తరుణ్‌,సుప్రజ్‌ రంగ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. హర్ష కామెడీ టైమింగ్‌ సూపర్. విక్కీ పాత్ర చేసిన సుప్రజ్ ప్రేక్షుకుడికి బాగా గుర్తుండిపోతాడు. హీరోయిన్లు కూడా  తమ పాత్రల పరిధి మేరకు  చక్కగా నటించారు. మోడ్ర‌న్ గ‌ర్ల్‌గా నువేక్ష బోల్డ్ రోల్‌లో  మెప్పించింది. నెగెటివ్ షేడ్స్‌ ఉన్న పాత్ర‌లో మేఘ‌లేఖ ఆకట్టుకుంది. ఖుష్బూ చౌద‌రి,సోనియా ఠాకూర్ పర్వాలేదనిపించారు.

టెక్నికల్ :

రొటీన్ జోనర్ తీసుకున్న దర్శకుడు ప్రేక్షకుల్ని మెప్పించటంలో సక్సెస్ అయ్యాడు. లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ రెండూ మంచి ఎమోషన్స్. ఈ రెండు అందరికీ కనక్ట్ అవుతాయి. కామెడీకి పెద్ద పీఠ వేస్తూ దర్శకుడు ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేయగలిగాడు. మూవీలో కొన్ని పాత్రలు మిడిల్ క్లాస్ హార్ట్ కి టచ్ అవుతాయి. ప్రతి లవ్‌స్టోరీని కన్విన్సింగ్‌గా చెప్తూ,యూత్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్‌కి క్లారిటీ ఇచ్చారు. మెచ్యూరిటీ లేకుండా తీసుకున్న నిర్ణయాల వలన జరిగే  నష్టం, అపార్థాలు, పెళ్లి విషయంలో నేటి జనరేషన్ ఆలోచనలు అన్నీ నాలుగు కథల్లో విపులంగా చెప్పేసారు. ట్రెండ్‌కు తగ్గ కథను ఎంచుకుని, అంతే ట్రెండీగా కథనాన్ని కూడా నడిపించాడు దర్శకుడు విక్రమ్ రెడ్డి. ఈ సినిమాకి ముగ్గురు సంగీతం అందించారు. వీరు అందించిన నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అయ్యింది. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తున్నట్టు ఉంటాయి. కథకి ఏ మాత్రం అడ్డు తగలవు. సినిమాటోగ్రఫీ బాగుంది. చిన్న సినిమా అయినా చాలా శ్రద్దగా తెర కెక్కించినట్లు,సినిమాపై పెట్టిన శ్రద్ద తెలుస్తోంది. నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. సినిమాటో గ్రఫీ సూపర్, ఎడిటింగ్ పరవాలేదనిపిస్తుంది. డైలాగ్స్ అయితే యూత్ లోకి బాగా వెళ్తాయి.

ప్లస్ పాయింట్స్

నటీ నటులు 
కథ,కథనం 
కామెడీ

మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే 
మితిమీరిన రొమాన్స్ 
సెకండ్ హాఫ్ స్లో నేరేషన్

ఫైనల్ వర్దిక్ట్ : టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్ 'రోటి కపడా రొమాన్స్'


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS