'సవారీ' మూవీ రివ్యూ & రేటింగ్.!

By iQlikMovies - February 07, 2020 - 17:36 PM IST

మరిన్ని వార్తలు

నటీనటులు : నందు, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ రెడ్డి,శివకుమార్ తదితరులు 
దర్శకత్వం :  సాహిత్ మోత్కూరి
నిర్మాత‌లు : సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుదితి
సంగీతం : శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫర్ : మొనీష్ భూపతిరాజు
ఎడిటర్: సంతోష్ మేనం

రేటింగ్‌: 2.25/5

చిన్న సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌బడాలంటే ఏదో ఓ మ్యాజిక్ జ‌ర‌గాలి. షాకింగ్ కంటెంట్‌తో రావాలి. లేదంటే న‌టీన‌టులు విజృంభించేలా చేయాలి. అంతా కాదంటే - ఇంకేదో బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లైపోయే విష‌యం క‌నిపించాలి. ఇవేం లేక‌పోతే - చిన్న సినిమావైపు క‌న్నెత్తి కూడా చూడ‌రు జ‌నాలు. కొంత‌మంది యువ ద‌ర్శ‌కులు కొత్త పాయింట్‌తోనే వ‌స్తున్నారు. ఇంకొంత మంది రొటీన్ ఫార్ములాతో వ‌చ్చి విసుగెత్తిస్తున్నారు. వాటి ఫ‌లితాలు కూడా అలానే ఉంటున్నాయి.

అయితే కొంత‌మంది కొత్త పాయింటు ప‌ట్టుకుని దాన్ని ఎలా డీల్ చేయాలో తెలీక క‌న్‌ఫ్యూజ్‌కి గుర‌వుతున్నారు. మ‌రి ఇప్పుడొచ్చిన స‌వారీ... ఇందులో ఏ కేట‌రిరీ?? ఇందులో బ‌ల‌మైన అంశాలేమున్నాయి? వాటిని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దిన విధానం ఏమిటి?

* క‌థ‌

రాజు (నందు) ఓ బ‌స్తీ కుర్రాడు. త‌న‌కు బాద్ షా అనే గుర్రం అంటే ప్రాణం. ఆ గుర్రంపై స‌వారీకి తిప్పుతూ డ‌బ్బులు సంపాదిస్తుంటాడు. అయితే ఆ గుర్రానికి గుండె జ‌బ్బు. ఆపరేష‌న్ చేయాల్సివ‌స్తుంది. అందుకోస‌మే డ‌బ్బు సంపాదిస్తుంటాడు. మ‌రోవైపు భాగీ (ప్రియాంకా శ‌ర్మ‌) అనే గొప్పింటి అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే స‌డ‌న్‌గా ఓరోజు బాద్ షా మాయం అయిపోతుంది. ఆ గుర్రం కోసం పిచ్చోడిలా తిరుగుతుంటాడు. ఆ గుర్రం ఏమైంది? భాగీతో ప్రేమాయ‌ణం ఎన్ని మ‌లుపులు తిరిగింది? అనేది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

* విశ్లేష‌ణ‌

ఇది వ‌ర‌కు చూడ‌ని నేప‌థ్యం ఈ సినిమా. ఓ బ‌స్తీ కుర్రాడు, గుర్రాన్ని న‌డుపుకుంటూ డ‌బ్బులు సంపాదించ‌డం, గుర్రానికి కో జ‌బ్బు.. ఇలా - అన్నీ కొత్త ఫ్లేవ‌ర్‌తోనే సాగే విష‌యాలే. కాబ‌ట్టి క‌థానాయ‌కుడి నేప‌థ్యం, అత‌ని క‌థ‌, వ్య‌ధ‌.. ఇవ‌న్నీ కొత్త‌గానే అనిపిస్తాయి. ఈ క‌థ‌ని వీలైనంత `రా`గా చూపించే ప్ర‌యత్నం చేశాడు ద‌ర్శుడు. బ‌స్తీ జీవితాలు, అక్క‌డ వ్య‌క్తులు, జీవన స‌ర‌ళి... వీటిని బాగానే ప‌ట్టాడ‌నిపిస్తుంది. ఆ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు బాగానే న‌డిచాయి. అక్క‌డ‌క్క‌డ కాస్త ఫ‌న్‌, ఎమోష‌న్‌, ల‌వ్ ట్రాక్‌.. ఇలా తొలి భాగం బాగానే న‌డిచిపోయింది. ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టుతో ఇంట్ర‌వెల్ కార్డు వేశాడు.

ద‌ర్శ‌కుడు ప్ర‌తి పాత్ర‌కూ ఓ నేప‌థ్యాన్ని, కాస్త మేన‌రిజాన్ని జోడించ‌డంతో - ఇంకాస్త ఆస‌క్తి క‌లుగుతుంటుంది. అయితే ద్వితీయార్థంలో లేని పోని స‌న్నివేశాల‌తో సినిమాని సాగ‌దీశాడు. కొన్నిసార్లు సినిమాని ఇంత స‌హజంగా తీస్తూ, లాజిక్కు మ‌ర్చిపోయాడేంటి? అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ఫ‌న్ పండ‌లేదు. ఎమోష‌న్లు కూడా బ‌లంగా నాటుకోలేక‌పోయింది. అన్నీ పైపై పూత‌లే అన్న‌ట్టు క‌నిపిస్తాయి. బాగా చెప్పాల్సిన చోట ద‌ర్శ‌కుడు అశ్ర‌ద్ధ చేశాడు. అన‌వ‌స‌రం లేని చోట మాత్రం సాగ‌దీశాడు. దాంతో తొలిస‌గంలో ఉన్న ఫీల్ మిస్స‌వుతుంది.

క‌థ‌లో బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ లేదు. ఉన్నా - దాన్ని ప్రేక్ష‌కుడు ఫీల్ అయ్యేలా తీర్చిదిద్ద‌లేదు. విల‌న్ పాత్ర, దాని నేప‌థ్యం బాగానే ఉన్నా - క‌థ‌లో దాన్ని అతికించిన‌ట్టు అనిపిస్తుంది. దాంతో క్లైమాక్స్‌తో స‌హా ద్వితీయార్థం మొత్తం ట్రాక్ త‌ప్పిన‌ట్టు అనిపిస్తుంది. అయితే ద‌ర్శ‌కుడిలో విష‌యం ఉంది. త‌న మేకింగ్‌, స్టైల్ ఇవ‌న్నీ అర్థ‌మ‌య్యాయి. క‌థ విష‌యంలో ఇంకాస్త శ్ర‌ద్ధ చూపిస్తే త‌ప్ప‌కుండా మంచి సినిమాలు తీయ‌గ‌ల‌డు.

* న‌టీన‌టులు

నందుని ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా సినిమాల్లో చూశాం. రెండో హీరోగా, హీరో కోసం త్యాగం చేసే పాత్ర‌ల్లో చాలాసార్లు మెరిశాడు. అయితే ఈసారి నందు కొత్త‌గా క‌నిపిస్తాడు. చాలా స‌హ‌జంగా న‌టించాడు. సినిమా కోసం తాను ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో తెర‌పై చూస్తే అర్థ‌మ‌వుతుంది. త‌న గెడ్డం, మాస్ లుక్స్‌... అన్నీ బాగున్నాయి. ప్రియాంక శ‌ర్మ ఓకే అనిపిస్తుంది. విల‌న్ పాత్ర‌ధారి శ్రీ‌కాంత్ రెడ్డి విల‌నిజాన్నీ, కామెడీని మిక్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కొన్ని చోట్ల మెప్పిస్తే, కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తాడు.

* సాంకేతిక వ‌ర్గం

రెండు పాటలు, వాటిని తెర‌కెక్కించిన విధానం బాగున్నాయి. త‌క్కువ బ‌డ్జెట్‌తో తీసిన సినిమా ఇది. అయినా ఆ ఫీలింగ్ రాదు. ప‌రిమిత వ‌న‌రుల్ని ద‌ర్శ‌కుడు బాగా వాడుకున్నాడు. బ‌స్తీ వాతావ‌ర‌ణాన్ని బాగా క్యాప్చ‌ర్ చేయ‌గ‌లిగారు. ద‌ర్శ‌కుడిలో నైపుణ్యం ఉంది. అయితే అది స‌రైన దిశ‌లో వాడాలి.

* ప్ల‌స్ పాయింట్స్‌

క‌థా నేప‌థ్యం
నందు న‌ట‌న‌
మాస్ అంశాలు

* మైన‌స్ పాయింట్స్‌ 

ద్వితీయార్థం
ఎమోష‌న్ వ‌ర్క‌వుట్ అవ్వ‌క‌పోవ‌డం

* ఫైన‌ల్ వెర్డిక్ట్‌:  ఎగుడుదిగుడుల స‌వారీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS