తారాగణం: షకలక శంకర్, కారుణ్య చౌదరి, అజయ్ గోష్ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాతలు: సురేష్ కొండేటి & రమణారెడ్డి
రచన-దర్శకత్వం: శ్రీధర్
రేటింగ్: 1/5
కమెడియన్లు హీరో కావడం సులభమే. ఎందుకంటే వాళ్లకంటూ ఓ గుర్తింపు ఉంటుంది. మార్కెట్ ఉంటుంది. జనాలు నమ్మి థియేటర్లకు వస్తారు. కానీ అలా హీరోలైనవాళ్లంతా నిలదొక్కుకోవడమే కష్టం. అలీ నుంచి సునీల్ వరకూ - ఏవీఎస్ నుంచి వేణుమాధవ్ వరకూ... చాలా మంది కథలు... కథలు కథలుగా చెప్పుకుంటుంటారు ఇప్పటికీ. అయినా సరే - ఏదో ధైర్యం చేసి - మరో కమెడియన్ షకలక శంకర్ రంగంలోకి దిగిపోయాడు. `శంభో శంకర` అంటూ బాక్సాఫీసు దగ్గర శివతాండవం ఆడడానికి రెడీ అయ్యాడు. మరి శంకరుడైనా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడా? హీరోగా షకలక పరిస్థితేంటి?
* కథ
ఆంకాలమ్మ పల్లె ఊరి కథ ఇది. అక్కడి ప్రెసిడెంటు (అజయ్ ఘోష్) పరమ దుర్మార్గుడు. పోలీసులకు ప్రసాదం పెట్టి.. అక్రమాలు అన్యాయాలు చేస్తుంటాడు. ఆ ఊరి కుర్రాడు శంకర్ (షకలక శంకర్). పోలీసు కావాలని కలలు కంటుంటాడు. తనకు కాస్త ఆవేశం ఎక్కువ. ప్రెసిడెంటుకి, పోలీసులకు ఎదురు తిరుగుతాడు. దాంతో రావాల్సిన పోలీసు ఉద్యోగం రాకుండా పోతుంది. తన ముద్దుల చెల్లెలు ప్రెసిడెంటు కొడుకు వల్లే అన్యాయంగా చనిపోతుంది. దానికి ప్రతీకారంగా ప్రెసిడెంటు కొడుకుని చంపేస్తాడు శంకర్. ఆ నేరంపై జైలుకి వెళ్తాడు. ఈ కేసు నుంచి శంకర్ ఎలా బయటపడ్డాడు? తిరిగి ఊరొచ్చాక ఆ ప్రజల కోసం ఏం చేశాడు? అనేదే కథ.
* నటీనటుల ప్రతిభ
హీరో అవ్వాలన్న ప్రయత్నం మంచిదే. అందుకోసం డాన్సులు, ఫైట్లు బాగా నేర్చుకునే వచ్చాడు శంకర్. అయితే తనకు సూటవ్వని ఓ కథ ఎంచుకున్నాడు. దాంతో ఆ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది. శంకర్ సినిమా అంటే కామెడీ ఆశిస్తారు. అది ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాడు. శంకర్ సీరియెస్‌గా చెప్పే డైలాగులే కామెడీ అనుకోవాలి.
హీరోయిన్ మహా బొద్దుగా ఉంది. ఆమె పాత్రకున్న ప్రాధాన్యం చాలా తక్కువ. అజయ్ ఘోష్ సెటిల్డ్‌గా చేస్తే బాగుంటుంది. కానీ ఓవరాక్షన్ చేస్తేనే చూళ్లేం. ఈ సినిమాలో రెండోదే జరిగింది. నాగినీడు లాంటి సీనియర్ ఉన్నా సరిగా వాడుకోలేదు.
* విశ్లేషణ
`నేనూ దర్శకుడు కలసి కష్టపడి ఈ కథ తయారు చేసుకున్నాం` అని ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తెగ స్పీచులు ఇస్తున్నాడు శంకర్. అసలు ఈ సినిమాలో కథ ఎక్కడ ఉందని, తయారు చేసుకోవడానికి...? ఆర్.నారాయణ మూర్తి సినిమాలు నాలుగైదు చూస్తే.. ఇలాంటి కథలు పది పదిహేను రాయొచ్చు. అసలు ఈ కథలో ఏముందని షకలక శంకర్ ధైర్యంగా హీరో అయిపోయాడా అనిపిస్తుంది.
బీసీ కాలం నాటి కథ, అరిగిపోయిన స్క్రీన్ ప్లే. ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా `ఆహా..` అనిపించదు. దీనికంటే... శంకర్ చేసిన జబర్ దస్త్ స్కిట్టులే నయం. వాటిలో నవ్వు రాకపోయినా... ఏదో ఒక పాయింటో, ఒక పంచో.. బాగుండేది. ఈ సినిమాలో ఆ ఛాన్స్ కూడా లేదు. అజయ్ ఘోష్ దౌర్జన్యాలు, వాటిని శంకర్ ఎదిరించడం, చెల్లాయి హత్య.. దానికి ప్రతీకారం.. ఇలా ఎక్కడ చూసినా, ఏ సీను చూసినా ప్రేక్షకుల్లో రియాక్షన్ ఉండదు. అవసరం లేకుండా వచ్చిపోయే పాటలు సహనాన్ని మరింత పరీక్షిస్తాయి.
`నిన్ను నేను లవ్ చేస్తున్నా` అని ప్రెడిడెంట్‌కి చెప్పి.. ఇంట్రవెల్ కార్డు వేయించారు. ఆ లవ్వేమిటో.. ఆ ప్రతీకారమేమిటో అర్థం కాదు. చివర్లో అజయ్ ఘోష్‌లాంటివాడ్ని కూడా జోకర్‌ని చేసేశారు. మరో విలన్ ని బయటకు రప్పించి - ఇదే అసలైన ట్విస్టు అనుకోమన్నారు. కానీ అప్పటికే సినిమా బజ్జుంది. మధ్యమధ్యలో పవన్ కల్యాణ్ రిఫరెన్సులుగా వచ్చిన సన్నివేశాలతో ఊపు తెప్పిద్దామని చూసినా లాభం లేకుండా పోయింది. బీసీ నాటి కథ.. అప్పటి డైలాగులు, ఆ కాలం నాటి తీతతో... విసుగు తెప్పించేశాడు దర్శకుడు.
* సాంకేతికంగా
సాయికార్తీక్ పాటలేం వినసొంపుగా లేవు. అవొచ్చే టైమింగ్ కూడా అంతగా నప్పలేదు. కథ, కథనాలు పేలవంగా ఉన్నాయి. శంకర్ కి సూటయ్యే కథ, పాత్ర కాదు. ఈ విషయంలో దర్శకుడు చేసిన హోం వర్క్ ఏమాత్రం సరిపోలేదు. పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో తీసిన సినిమా ఇది. బడ్జెట్ పరిమితులు కూడా కనిపిస్తాయి.
* ప్లస్ పాయింట్స్
+ చెప్పడం కష్టం
* మైనస్ పాయింట్స్
- రాయడం కష్టం
* ఫైనల్ వర్డిక్ట్: శంకరా.. మా వల్ల కాదురా..
రివ్యూ రాసింది శ్రీ