తారాగణం: అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల, నందిని రాయి, ఝాన్సీ, హేమ తదితరులు
సంగీతం: శ్రీ వసంత్
ఎడిటర్: గౌతమ్ రాజు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి & భరత్ చౌదరి
దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్
రేటింగ్: 2.25/5
చాలా రోజుల నుంచి కమర్షియల్ విజయం కోసం తపిస్తున్నారు అల్లరి నరేష్. సినిమాలపరంగా రాశి పెరుగుతుందే కానీ వాసి మాత్రం బాగుండటం లేదని ఆయనపై విమర్శలొస్తున్నాయి. దాదాపు సంవత్సరం విరామం తర్వాత అల్లరి నరేష్ సిల్లీఫేలోస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో సునీల్ తిరిగి హాస్యనటుడిగా పునరాగమనం చేశారు.
ప్రచార కార్యక్రమాల్లో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు చిత్ర విజయంపై ఎంతో విశ్వాసాన్ని కనబరిచారు. తనకు, నరేష్ కెరీర్‌కు ఈ సినిమా కీలకమని..తామిద్దరం మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. తమిళ చిత్రం "వేలైను వందుట్ట వేళ్లైకారన్" ఆధారంగా తెరకెక్కిన సిల్లీఫెలోస్ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించిందంటే...
* కథ
వీరబాబు (అల్లరి నరేష్) ఎమ్మెల్యే జాకెట్ జానకీరాం (జయప్రకాష్‌రెడ్డి)కు విధేయుడు. టైలరింగ్ పనిచేసే వీరబాబుకు తన గురువులాగే రాజకీయాల్లో రాణించాలని కోరిక. ఊరిలో సామూహిక వివాహాలు జరిపించి తన గురువు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు . అది బెడిసికొట్టడంతో సర్దుబాటు ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో తన మిత్రుడు సూరిబాబు (సునీల్)కు పుష్ప (నందినిరాయ్) అనే అమ్మాయితో పెళ్లి జరిపిస్తాడు.
మరోవైపు పోలీసాఫీసర్ కావాలని కలలు కంటున్న డేరింగ్ లేడీ వాసంతి (చిత్రా శుక్లా) ప్రేమలో పడతాడు వీరబాబు. తన గురువు జాకెట్ జానకీరామ్‌తో చెప్పించి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని పదిలక్షలు తీసుకుంటాడు. ఈలోగా జాకెట్ జానకీరామ్‌కు సన్నిహితుడైన మంత్రి అనారోగ్యం పాలవుతాడు. చనిపోయే ముందు ప్రజాసేవకై దాచిపెట్టిన ఐదొందల కోట్ల రహస్యాన్ని జాకెట్ జానకీరామ్‌కు చెబుతాడాయన. జాకెట్ జానకీరామ్ ప్రమాదం బారిన పడి కోమాలోకి వెళ్లిపోతాడు. ఉద్యోగం కోసం తానిచ్చిన పదిలక్షల గురించి వీరబాబును ఆరాతీస్తుంటుంది వాసంతి. ఐదొందల కోట్లను చేజిక్కించుకోవడానికి మంత్రి అనుచరులు ప్రయత్నాలు చేస్తుంటారు. జానకీరామ్ స్పృహలోకి వస్తే తానిచ్చిన పదిలక్షలు ఏమయ్యాయో తెలుసుకోవాలనుకుంటాడు వీరబాబు. ఈ క్రమంలో ఏం జరిగింది? జానకీరామ్ స్పృహలోకి వచ్చాడా? ఐదొందల కోట్ల రహస్యం ఎవరికి తెలిసింది? అన్నదే మిగతా సినిమా కథ..
* నటీనటుల పనితీరు..
అల్లరి నరేష్ తనకు బాగా అలవాటైన పాత్రలో బాగానే నటించారు. ఇక హీరోగా సినిమాలు చేస్తూ కమెడియన్‌గా బ్రేక్ తీసుకున్న సునీల్ తిరిగి ఈ సినిమాతో హాస్యనటుడిగా అరంగేట్రం చేశాడు. తనదైన కామెడీ టైమింగ్, పర్‌ఫార్మెన్స్‌తో మంచి వినోదాన్ని పండించాడు. మునుపటి సునీల్‌ను చూస్తున్నామనే భావన కలిగింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో సునీల్‌కిది శుభారంభంగా భావించవొచ్చు. ఆయన బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తే మరింత బాగుంటుంది.
జాకెట్ జానకీరామ్ పాత్రలో జయప్రకాష్ రెడ్డి , భూతం పాత్రలో పోసాని కృష్ణమురళి ఈ సినిమాలో వినోదానికి కీలకంగా నిలిచారు. ముఖ్యంగా పోసాని పాత్ర చిత్రీకరణలో వైవిధ్యం కనిపించింది. బ్రహ్మానందం కనిపించింది కొద్ది సేపైనా నవ్వించారు. రఘు కారుమంచికి మంచి పాత్ర దక్కింది.
ఇక కథానాయికల్లో చిత్రా శుక్లా ఫర్వాలేదనిపించింది. ఆమె పై ఓ పోరాటఘట్టాన్ని చేయడం ఏమంతగా ఆకట్టుకోలేదు. నందినిరాయ్ పాత్రకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు.
* విశ్లేషణ...
కథాపరంగా ఇందులో కొత్తదనమేమి లేదు. గతంలో వచ్చిన ఎన్నో హాస్య చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. ఎక్కడో దాచిపెట్టిన డబ్బును దక్కించుకోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించడం, ఈ క్రమంలో చోటుచేసుకునే కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ను పండించడం పాత ఫార్ములానే. సిల్లీఫెలోస్ కథ కూడా అదే దారిలో సాగుతుంది. ఎలాంటి లాజిక్‌లతో సంబంధం లేకుండా ప్రతి సన్నివేశంలో వినోదాన్ని పండించడమే లక్ష్యంగా ఈ కథ రాసుకున్నారనిపిస్తుంది.
ప్రథమార్థంలో ఐదొందల కోట్ల రహస్యాన్ని తెలుసుకోవడానికి వీరబాబు, సూరిబాబు ప్రయత్నాలతో కథ ఊపందుకుంటుంది. కోమాలోకి వెళ్లిపోయిన జాకెట్ జానకీరామ్‌ను ఆసుప్రతి నుంచి కిడ్నాప్ చేయడానికి భూతం (పోసాని కృష్ణమురళి), రాజా రవీంద్ర బృందం చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. బార్‌లో పనిచేసే బ్రహ్మానందం పోలీసాఫీసర్‌గా హాస్పిటల్‌లో హంగామా చేయడం, సూరిబాబు, వీరబాబు మోసాన్ని కనిపెట్టిన వాసంతి పోలీస్‌స్టేషన్‌లో వారిని దండించే సన్నివేశాల్లో మంచి హాస్యం పండింది.
ద్వితీయార్థంలో కథ మరింతగా ఊపందుకుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఘట్టాల్లో పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. తాను మాట్లాడుతున్నప్పుడు ఆ ఫ్లోను మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మళ్లీ మొదటి నుంచి చెప్పడం జయప్రకాష్‌రెడ్డి అలవాటు. ఐదొందల కోట్ల రహస్యాన్ని ఆయన్ని ద్వారా తెలుసుకోవడానికి పోసాని ప్రయత్నించడం..ప్రతి సందర్భంలో ఎవరో అడ్డుతగలడం..తిరిగి జయప్రకాష్‌రెడ్డి తన సంభాషణను పునరావృతం చేయడం...ఈ ఎపిసోడ్ అంతా చక్కటి హాస్యాన్ని పండించింది.
భూతం (పోసాని కృష్ణమురళి) అనుచరుడిగా రఘు కారుమంచి చక్కటి టైమింగ్‌తో కూడిని కామెడీతో ఆకట్టుకున్నాడు. కథ మొత్తం కిడ్నాప్ డ్రామా చుట్టు తిరగడం..సినిమాలోని పాత్రధారులందరిని ఆ డ్రామాతో కనెక్ట్ చేయడం బాగుంది. క్లైమాక్స్ ఘట్టాలు రొటీన్‌గానే సాగినా మంచి హాస్యాన్ని పండిచాయి. అయితే సంభాషణల్లో పంచ్‌లు అంతగా పేలలేదు. సినిమాలో వీరబాబు ప్రేమకథకు కూడా అంతగా ప్రాధాన్యతనివ్వలేదు. ప్రథమార్థం అంతగా ఆకట్టుకోలేకపోయినా ద్వితీయార్థంలో మంచి వినోదాన్ని పండించి ఆలోటును భర్తీ చేశారు.
* సాంకేతిక వర్గం పనితీరు
రెండే రెండు పాటలు ఉన్నాయి. అవి ఓకే అనిపించాయి. కెమెరాపనితనం బాగానే ఉంది. కథకు అనుగుణంగా నిర్మాణ విలువలు బాగా కుదిరాయి. మాటలు బాగానే పేలాయి. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. సిల్లీఫెలోస్ రొటీన్ కామెడీ కథనే. ఎలాంటి కొత్తదనం లేదు. అయితే నరేష్, సునీల్ కాంబినేషన్..పోసాని, జయప్రకాష్‌రెడ్డి కామెడీ కొంత రిలీఫ్ నిచ్చాయి. టైమ్‌పాస్ వినోదం కోసం సిల్లీఫేలోస్ ను ఒక్కసారి పలకరించవొచ్చు.
* ప్లస్ పాయింట్స్
+ వినోదం
+ పాటలు
* మైనస్ పాయింట్స్
- సెకండాఫ్
- రొటీన్ కథ
* ఫైనల్ వర్డిక్ట్: సిల్లీ.. సిల్లీగా
రివ్యూ రాసింది శ్రీ