Sita Ramam Review: సీతారామం మూవీ రివ్యూ & రేటింగ్‌!

మరిన్ని వార్తలు

నటీనటులు: దుల్కర్ సల్మాన్‌, దుల్కర్ సల్మాన్‌, రష్మిక, సుమంత్‌, తరుణ్ భాస్కర్ తదితరులు 
దర్శకత్వం : హను రాఘవపూడి
నిర్మాణం : స్వప్న సినిమా
సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్ 
సినిమాటోగ్రఫీ: పి. ఎస్. 
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్ రావు


రేటింగ్‌: 3.25/5


అందాల రాక్ష‌సితో హ‌ను రాఘ‌వ‌పూడి త‌న మార్క్ చూపించేశాడు. ఈసినిమా చూసి, అంద‌రూ `మ‌ణిర‌త్నం రేంజ్‌లో ల‌వ్ స్టోరీ తీశాడు` అన్నారు. హ‌ను తీసిన `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌` హిట్ట‌య్యింది. అయితే ఆ త‌ర‌వాతే.. ఫ్లాపులు వ‌చ్చాయి. `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` సైతం డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే.. త‌న ఫ్లాపు సినిమాల్లో ల‌వ్ స్టోరీల్ని మాత్రం హ‌ను రాఘ‌వ‌పూడి బాగా డీల్ చేశాడు.


ఈసారి హ‌ను పూర్తి స్థాయి ప్రేమ‌క‌థ‌ని ఎంచుకొన్నాడు. అదే.. `సీతారామం`. వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన సినిమా ఇది. దుల్క‌ర్ స‌ల్మాన్‌, ర‌ష్మిక‌, మృణాల్ ఠాకూర్‌, గౌత‌మ్ మీన‌న్‌, త‌రుణ్ భాస్క‌ర్ - ఇలా స్టార్ కాస్టింగ్ విష‌యంలో ఏలోటూ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల - పోస్ట‌ర్‌పై ఆస‌క్తిక‌రంగా క‌నిపించిన కాంబో ఇది. మ‌రి.. `సీతారామం` ఎలా ఉంది?  యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌లో - యుద్ధం ఎంత‌?  ప్రేమ క‌థ ఎంత‌?


* క‌థ‌


రామ్ (దుల్క‌ర్ స‌ల్మాన్‌) ఇండియ‌న్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా ప‌నిచేస్తుంటాడు. త‌ను ఓ అనాథ‌. అగ‌డ్త‌లో హిందూ - ముస్లింల మ‌ధ్య వైరం పెంచాల‌ని చూసిన పాకీస్థానీ తీవ్ర‌వాదుల ప్ర‌య‌త్నాన్ని తిప్పి కొట్టి... ఒక్క‌సారిగా హీరోగా మార‌తాడు. దాంతో.. దేశ వ్యాప్తంగా త‌న‌కు ఉత్త‌రాలు రావ‌డం మొద‌ల‌వుతుంది. అందులో సీతామ‌హాల‌క్ష్మి రాసిన ఉత్తరం త‌న‌ని ప్రేమ‌లో ప‌డేస్తుంది. సీత ఎవ‌రో తెలీదు. ఎక్క‌డ ఉంటుందో తెలీదు. కానీ.. ఓ భార్య భ‌ర్త‌కు రాసిన‌ట్టు రామ్ కి ఉత్త‌రాలు రాస్తుంటుంది.


ఆఖ‌రికి ఫ్ర‌మ్ అడ్ర‌స్ కూడా ఉండ‌దు. అయితే ఓ లేఖలో ఇచ్చిన క్లూ ఆధారంగా, సీతామాహాల‌క్ష్మిని వెదికి ప‌ట్టుకొంటాడు రామ్‌. ఆ త‌ర‌వాత‌.. ఇద్ద‌రూ మ‌రింత ద‌గ్గ‌ర‌వుతారు. ఓ మిల‌ట‌రీ మిష‌న్ కోసం.. రామ్ బోర్డ‌ర్ దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లాల్సివ‌స్తుంది. అలా వెళ్లిన రామ్ ఎంత‌కీ తిరిగి రాడు. త‌ను పాకిస్థాన్‌లో సీత కోసం ఓ ఉత్త‌రం రాస్తాడు. అది.. ఇండియాలోని సీత‌కు చేరాలి. అదెలా చేరింది?  ఆ ఉత్త‌రాన్ని తీసుకొచ్చే బాధ్య‌త ఇర‌వై ఏళ్ల త‌ర‌వాత‌.. అప్రిన్ (ర‌ష్మిక‌) ఎందుకు త‌న నెత్తిమీద వేసుకొంది?  రామ్ - సీత ఇద్ద‌రూ క‌లిశారా లేదా? ఇంత‌కీ ఆ ఉత్త‌రంలో ఏముంది?  అనేదే సీతారామం స్టోరీ.


* విశ్లేష‌ణ‌


యుద్ధంతో రాసిన ప్రేమ క‌థ అంటూ ఈ సినిమాకి ట్యాగ్ లైన్ పెట్టారు. దానికి త‌గ్గ‌ట్టుగానే యుద్ధాన్ని, ప్రేమ‌నీ ముడి వేసిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ఓ అనాథ అయిన సైనికుడికి, ఎవ‌రో అమ్మాయి ఉత్త‌రాలు రాయ‌డం, ఆ ఉత్త‌రాల‌తో ఓ బంధాన్ని ఏర్ప‌ర‌చుకోవ‌డం, ఆ అమ్మాయిని వెదుక్కొంటూ ఆ అబ్బాయి వెళ్ల‌డం.... ఇవ‌న్నీ హృద్యంగా సాగాయి. ఈ క‌థ‌లో దేశ‌భ‌క్తిని మిళితం చేసిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. ఇండియా - పాకిస్థాన్ గొడ‌వ‌లు, క‌శ్మీరీ స‌మ‌స్య‌, తీవ్ర‌వాదం... వీటిని క‌థ‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. వాటి మ‌ధ్యే ఓ ప్రేమ‌క‌థ‌ని చెప్పాడు. తొలి స‌గం సీత  - రామంల ప‌రిచ‌యం, వాళ్ల ప్ర‌యాణం.. ఇవ‌న్నీ ఆస‌క్తి క‌లిగిస్తాయి.


అఫ్రిన్ ఓ ఉత్త‌రం ప‌ట్టుకొని, సీత కోసం రామ్ కోసం అన్వేషించే క్ర‌మంలో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. 1985లో జ‌రుగుతున్న క‌థ‌నీ, 1965లో జ‌రిగిపోయిన క‌థ‌నీ స‌మాంత‌రంగా చెబుతూ స్క్రీన్ ప్లే ప‌రంగా ఆస‌క్తిని పెంచాడు. రామ్‌, సీత‌ల గురించి తెలుసుకొనే క్ర‌మంలో ఒక్కో ఎపిసోడ్ ఓపెన్ చేసేకొద్దీ ఆ పాత్ర‌ల‌పై ప్రేమ పెరుగుతూ పోతుంది. సీత ఎవ‌రు? అనే అస‌లైన ట్విస్ట్ తో ఇంట్ర‌వెల్ కార్డు ప‌డుతుంది. అక్క‌డి వ‌ర‌కూ కేవ‌లం దీన్ని సీతారామంల ప్రేమ‌క‌థ‌గానే చూస్తారు. ఆ త‌ర‌వాత‌.. ఈ క‌థ‌ని చూడ‌బోయే కోణం మారుతుంది.


ద్వితీయార్థంలోనే అస‌లు క‌థ మొత్తం ఉంది. సీత - రామ్ క‌లిసిపోయారు అనుకొన్న సంద‌ర్భంలోనే అస‌లైన మెలిక పెట్టాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ దేశ భ‌క్తిని రంగంలోకి దింపాడు. దేశం కోసం ప్రేమ‌నీ, ప్రేమించిచాల్సిన అమ్మాయినీ త్యాగం చేయాల్సివ‌చ్చిన‌ప్పుడు రామ్ పై ప్రేమ మ‌రింత పెరుగుతుంది. ఆ స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా ఆవిష్క‌రించాడు.


ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ ఈ క‌థ‌కు ప్రాణం పోశాయి. చాలా క్లిష్ట‌మైన‌, ఉద్వేగ భ‌రిత‌మైన స‌న్నివేశాల్ని సైతం చాలా నేర్పుగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. అఫ్రిన్ పాత్ర‌కు ఇచ్చిన ట్విస్ట్ కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచేదే. సుమంత్ పాత్ర‌నీ చాలా చ‌క్క‌గా వాడుకొన్నాడు. సినిమా అంతా చూశాక‌.. ఓ అంద‌మైన దృశ్య‌కావ్యం చూసిన అనుభూతికి లోన‌వుతారు ప్రేక్ష‌కులు.


* న‌టీన‌టులు


ఏ పాత్ర‌కు త‌గిన న‌టుల్ని ఆ పాత్ర‌కు ఎంచుకోవ‌డంలో చిత్ర‌బృందం స‌క్సెస్ అయ్యింది. చిన్న పాత్ర‌లో సైతం పేరున్న న‌టీన‌టులే క‌నిపించారు. దాంతో ఆయా స‌న్నివేశాలు పండాయి. దుల్క‌ర్ స‌ల్మాన్ కి ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అన్ని ర‌కాల ఎమోష‌న్స్‌నీ దుల్క‌ర్ అద్భుతంగా ఆవిష్క‌రించాడు. సీత కోసం ఆరాట ప‌డే అబ్బాయిగా ఎంత రొమాంటిక్ గా, ప‌క్కింటి అబ్బాయిగా క‌నిపిస్తాడో, ఈ దేశం కోసం ప్రేమ‌నే త్యాగం చేయాల్సివ‌చ్చిన‌ప్పుడు ఆ పాత్ర మ‌రింత ఉదాత్తంగా క‌నిపిస్తుంది.


ఈ సినిమా త‌ర‌వాత‌.. దుల్క‌ర్ తెలుగులో బిజీ అయిపోవ‌డం ఖాయం. మృణాల్ కి ఇదే తొలి తెలుగు చిత్రం. ఆమె కూడా చాలా అవ‌కాశాల్ని ద‌క్కించుకొంటుంది. చాలా స‌న్నివేశాల్లో త‌న ప‌రిణితి చూపించింది. ఆమె పాత్ర‌కు ఎంచుకొన్న కాస్ట్యూమ్స్ వ‌ల్ల‌... మ‌రింత హుందాత‌నం వ‌చ్చింది. 


స్టార్ హీరోయిన్ గా చ‌లామ‌ణీ అవుతున్న ర‌ష్మిక ఈ పాత్ర‌ని ఎందుకు ఎంచుకొందో సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. వెన్నెల కిషోర్,సునీల్, ప్ర‌కాష్ రాజ్‌... ఇలా అంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో రాణించారు.


* సాంకేతిక వ‌ర్గం


టెక్నిక‌ల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న సినిమా ఇది. ఫొటోగ్ర‌ఫీ, నేప‌థ్య సంగీతం అదిరిపోయాయి. పాట‌లు ఇది  వ‌ర‌కే హిట్టు. తెర‌పై ఇంకా అందంగా ఉన్నాయి. ఫ‌స్టాఫ్ ని కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్ లో అలాంటి కంప్లైంట్ కూడా లేదు.


హిందూ - ముస్లిం కాన్సెప్ట్ ఎప్పుడు ప‌ట్టుకొన్నా, ఎవ‌రు ప‌ట్టుకొన్నా అది చాలా సెన్సిటీవ్ మేట‌ర్‌. దాన్ని సైతం ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా డీల్ చేశాడు. ఎవ‌రి మ‌నోభావాలూ దెబ్బ తిన‌కుండా ఈ క‌థ‌ని చెప్పాడు. హ‌ను ల‌వ్ స్టోరీలు చెప్ప‌డంలో ఎందుకు ప‌ర్‌ఫెక్టో..ఈ సినిమా మ‌రోసారి నిరూపిస్తుంది.


* ప్ల‌స్ పాయింట్స్‌


దుల్క‌ర్ స‌ల్మాన్‌
టెక్నిక‌ల్ టీమ్
క్లైమాక్స్
పాట‌లు
లొకేష‌న్లు


* మైన‌స్ పాయింట్స్‌


ఫ‌స్టాఫ్‌లో కాస్త లాగ్‌


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  మ‌న‌సుల్ని గెలిచే ప్రేమ కావ్యం


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS