ఏ సినిమాకైనా ప్రచారం చాలా అవసరం. సినిమా చూడాలన్న ఉత్సుకత ప్రేక్షకుల్లో కలిగించడానికి ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే.. పబ్లిసిటీతో జనాల్ని థియేటర్లకు రప్పించడం మినహా మరో మార్గం లేదు. ఈ విషయంలో `సీతారామం` టీమ్ నూటికి నూరుపాళ్లూ సక్సెస్ అయ్యింది. సీతారామం నెలరోజుల ముందు నుంచే ప్రమోషన్లు స్టార్ట్ చేసింది.చివర్లో ప్రభాస్ ని తీసుకొచ్చి ఫినిషింగ్ టచ్ గట్టిగా ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రభాస్ రావడం, ఈ సినిమా గురించి పాజిటీవ్ గా మాట్లాడడం సీతారామంకి హెల్ప్ అయ్యింది. అంతే కాదు.. థియేటర్ ని గుడితో పోల్చడం, సినిమాని థియేటర్లలోనే చూడండని ప్రభాస్ పిలుపు ఇవ్వడం - ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత అవసరమైన విషయంగా మారింది. దాంతో ప్రభాస్ స్పీచ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
ఈ సినిమా ట్రైలర్ చూసి ప్రభాస్ మెస్మరైజ్ అయిపోయాడట. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా చెప్పాడు. ట్రైలర్ బాగా నచ్చిందని, దుల్కర్ చాలా అందంగా ఉన్నాడని, ఓ ప్రేమకథని ఇంత భారీగా ఖర్చు పెట్టి తెరకెక్కించడం అశ్వనీదత్ కే సాధ్యమని ప్రభాస్ కితాబు ఇచ్చాడు. ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించిన సుమంత్ గురించి కూడాప్రత్యేకంగా ప్రస్తావించాడు. సుమంత్ అంటే తనకు ఇష్టమని, ఆయన ఓ పాత్ర ఒప్పుకొన్నాడంటే తప్పకుండా విషయం ఉంటుందని, దర్శకుడు ప్రేమకథల్ని బాగా డీల్ చేస్తాడని, ఇవన్నీ కలిపి, సినిమా చూడాలన్న ఉత్సాహం ముంచుకొస్తోందని ప్రభాస్ కామెంట్లు చేశాడు. మొత్తానికి ప్రభాస్ స్పీచ్ సీతారామం టీమ్ కే కాదు.. రాబోతున్న కొత్త సినిమాలకూ కొండంత బూస్టప్ ఇచ్చినట్టైంది.