తారాగణం: హరీష్, అవంతికా మిశ్రా
సంగీతం: DJ వసంత్
ఛాయాగ్రహణం: వెంకట సుబ్బారావు
నిర్మాణ సంస్థ: RJ సినిమాస్
నిర్మాత: BA రాజు
రచన-దర్శకత్వం: B జయ
యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5
మనకున్న మహిళా దర్శకుల సంఖ్య చాలా తక్కువ. ఉన్నవాళ్లు కూడా.. అప్పుడప్పుడూనే సినిమా తీస్తున్నారు. బి.జయ మాత్రం... సదా తెలుగు ప్రేక్షకులకు టచ్‌లోనే ఉంటున్నారు. లవ్ లీ తరవాత ఆమె కొంత గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం వైశాఖం. అచ్చమైన తెలుగు టైటిల్ ఇది. ఇంత మంచి టైటిల్‌తో వచ్చిన ఈ వైశాఖం ఎలా ఉంది? బి.జయ ఈసారి ఏ పాయింట్‌ని టచ్ చేశారు?? ఈ సినిమా వైనమేంటి??
* కథ...
ఓ అపార్ట్‌మెంట్ చుట్టూ నడిచే కథ ఇది. శివ (హరీష్) అల్లరి కుర్రాడు. ఆ అపార్ట్‌మెంట్‌వాళ్లనందరినీ ఓ ఆట ఆడుకొంటుంటాడు. శివ టార్చర్ భరించలేక.. తాను చెప్పిన ప్రతి దానికీ ఊ కొడుతుంటారు వాళ్లు. `శివ నా బోయ్ ఫ్రెండ్` అంటూ అదే అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొంటుంది భాను (అవంతిక). నిజానికి శివ, భానులకు పరిచయమే ఉండదు. ఒకరి గురించి ఒకరికి తెలిసిన తరవాత.. గొడవలు మొదలవుతాయి. కేవలం అపార్ట్మెంట్‌లో మిగిలిన వాళ్ల ముందు తన పరువు పోకూడదన్న ఉద్దేశంతో భానుని తన లవర్ అని చెప్పి అబద్దం ఆడతాడు. అయితే.. క్రమంగా భాను ప్రేమలో పడిపోతాడు శివ. కానీ భాను మాత్రం ఛీ కొడుతుంది. దాంతో శివ భాను పై కోపం పెంచుకొంటాడు. తెల్లారేసరికి అపార్ట్‌మెంట్‌లో లేకుండా చేస్తా అంటూ... సవాల్ విసురుతాడు. మరి.. భానుని ఆ అపార్ట్‌మెంట్ నుంచి తరిమేశాడా?? అసలింతకీ ఆ అపార్ట్‌మెంట్‌లోకి భాను ఎందుకొచ్చింది?? వీరిద్దరి మధ్య ఏం జరిగింది?? అనేదే కథ.
* నటీనటులు...
హరీష్, అవంతిక ఇద్దరూ కొత్తవారే. అయితే.. ఆ ఫీలింగ్ రాదు. చాలా సినిమాలు చేసినంత అనుభవంతో నటించారు. హరీష్ చూడ్డానికి ఎలా ఉన్నా.. నటన బాగుంది. డాన్సుల్లో రాణించాడు. అవంతిక కూడా అంతే. సాయికుమార్‌ది చిన్న పాత్రే అయినా.. ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్. రమాప్రభ, కాశీవిశ్వనాథ్... వీళ్లంతా తమ పాత్రల పరిధి మేర రాణించారు. ఫృద్వీని సరిగా వాడుకోలేదనిపిస్తోంది.
* విశ్లేషణ..
అపార్ట్‌మెంట్ అంటే ఉమ్మడి కుటుంబం కంటే ఎక్కువ - అదో చిన్న భారతదేశం.. అనే ఓ మంచి మాట చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. నాది నాది అనుకొంటే దూరం పెరుగుంది - మనం అనుకొంటే అందరం ఒక్కటే అనే పాయింట్ చుట్టూ నడిచిన కథ. అయితే.. చెప్పాలనుకొన్న పాయింట్ చాలా చిన్నది. చివర్లో సాయికుమార్ చెప్పే డైలాగ్‌తో కథలో సారం అర్థమైపోతుంది. దాని కోసం రెండు గంటల సినిమా తీయాలనుకోవడం సాహసం. టామ్ అండ్ జెర్రీ లాంటి జంట.. వాళ్ల మధ్య గొడవలు, అపార్ట్‌మెంట్ లోని రకరకాల వ్యక్తిత్వాలు, హీరో క్యారెక్టరైజేషన్... వీటిని బేస్ చేసుకొంటూ ఫస్ట్ ఆఫ్ నడిపేశారు. హీరో హీరోయిన్ల మధ్య సాగే గొడవలు సరదాగా ఉంటాయి. దాంతో కాలక్షేపం అయిపోతుంది. ఎటొచ్చీ.. సెకండాఫ్‌ని నడిపించడం కాస్త కష్టమైంది. అక్కడా హీరో, హీరోయిన్ల గొడవే ప్రధాన వస్తువు అయ్యింది. మదర్ సెంటిమెంట్ పండి ఉంటే, సాయికుమార్ పాత్రని మరింత ఉదాత్తంగా తీర్చిదిద్దితే బాగుండేది. పాయింట్ చాలా మంచిది. అయితే.. అది సినిమాకి పనికివస్తుందా, రాదా? అని చూసుకొంటే బాగుండేది. మొత్తానికి... లవ్ స్టోరీ అనిపించే ఫీడ్ గుడ్ స్టోరీని జయ తనదైన శైలిలో.. తెరకెక్కించే ప్రయత్నం చేశారు.
* సాంకేతిక వర్గం...
వసంత్ బాణీలు బాగున్నాయి. రెండు పాటలు మాస్‌కి నచ్చుతాయి. వైశాఖం థీమ్ సాంగ్ బాగుంది. కంట్రీ చిలక పాటలో చూపించిన లొకేషన్లు ఆకట్టుకొంటాయి. దర్శకురాలు అల్లుకొన్న పాయింట్ చాలా చిన్నది. దానికంటే బలమైన కథాంశాన్ని ఎంచుకొంటే బాగుండేది.
* ప్లస్ పాయింట్స్
+ పాటలు
+ హీరో, హీరోయిన్
+ కథాంశం
* మైనస్
- మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్:
వైశాఖం.. కాస్త బోర్ కాస్త ఫన్
రివ్యూ బై శ్రీ