తారాగణం: విజయ్, సమంత, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్
నిర్మాణ సంస్థ: నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: GK విష్ణు
ఎడిటర్: రూబెన్
రచన-దర్శకత్వం: అట్లీ
యావరేజ్ యూజర్ రేటింగ్:3/5
తమిళనాట మెర్శెల్ ఓ సంచలనం. అక్కడి సినిమా రంగాన్నీ, రాజకీయాల్నీ ఓ కుదుపు కుదిపింది. గొప్ప వసూళ్లు సాధించింది. విజయ్ కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచింది. అప్పటి నుంచీ మెర్శెల్ సినిమా చూడాలన్న కోరిక తెలుగు ప్రేక్షకులకూ ఎక్కువైంది. విజయ్‌కి ఇక్కడున్న ఆదరణ అంతంత మాత్రమే. కాకపోతే... కథాబలం ఉన్న సినిమా కావడం, సామాజిక అంశాలు మేళవించడం, తమిళంలో పెద్ద హిట్ అవ్వడం వంటి అంశాల నేపథ్యంలో 'అదిరింది' పై హైప్ పెరిగింది. మరి... 'మెర్శెల్'లో అదిరిపోయిన ఆ అంశాలేమున్నాయి? తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకూ ఈ సినిమా నచ్చుతుంది??
* కథ..
భార్గవ్ (విజయ్) ఓ డాక్టర్. కేవలం 5 రూపాయలకే వైద్యం చేస్తుంటాడు. పేద ప్రజలకు కావల్సిన వైద్యం... దేశమంతటా ఉచితంగా అందించాలన్నది అతని లక్ష్యం. అయితే కార్పొరేట్ విష సంస్క్రృతితో కుళ్లిపోయిన ఈ వ్యవస్థకు భార్గవ్ ఓ అడ్డుగా కనిపిస్తుంటాడు. దాంతో భార్గవ్‌కి బెదిరింపులు, సమస్యలు వస్తుంటాయి. ఇదే సమయంలో... నలుగురు వ్యక్తులు కిడ్నాప్ అవుతారు. వీళ్లంతా ఓ కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన వ్యక్తులే. ఆ నలుగురి కిడ్నాప్ వెనుక భార్గవ్ ఉన్నాడన్నది పోలీసుల అనుమానం. దాంతోనే అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇంతకీ ఈ కిడ్నాప్‌లను చేసింది భార్గవేనా, ఇంకెవరైనా ఉన్నారా? అచ్చం భార్గవ్‌లా ఉన్న విజయ్ ఎవరు?? భార్గవ్ కల నెరవేరడానికి విజయ్ ఎంత వరకూ సహకరించాడు?? అనేదే 'అదిరింది' కథ.
* నటీనటుల ప్రతిభ..
మూడు పాత్రల్లో కనిపించాడు విజయ్. భార్గవ్ - విజయ్ పాత్రల్లో వైవిధ్యం ఏం లేదు. ఇద్దరూ ఒకేలా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు. దళపతి గెటప్ మాత్రం కాస్త కొత్తగాఅనిపిస్తుంది. మాస్‌కి బాగా నచ్చే పాత్ర అది. తనదైన స్టైల్‌లో విజయ్ రెచ్చిపోయాడు.
నిత్యా మీనన్ కూడా ఆకట్టుకొంటుంది. సమంత, కాజల్‌లకు అంత స్కోప్ లేదు. విలన్‌గా సూర్య మెప్పించాడు. తన డబ్బింగ్ కూడా బాగా సెట్టయ్యింది. చాలాకాలం తరవాత వడివేలు తెరపై కనిపిస్తాడు. అయితే తన నుంచి కామెడీ ఆశించలేం.
* విశ్లేషణ..
అట్లీ శంకర్ శిష్యుడు. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే ఈ కథ రాసుకొన్నాడు. వైద్యరంగంపై అట్లీ విసిరిన బాణం... ఈ సినిమా. అయితే ఈ కథని కమర్షియల్ కొలతల ప్రకారం తెరకెక్కించడంలో నూటికి నూరుపాళ్లు సఫలం అయ్యాడు. విజయ్ కంటూ ఓ ఇమేజ్ ఉంది. ఆయన్నుంచి అభిమానులు మాస్, మసాలా అంశాలు కోరుకొంటారు. ఇటు ఓ సోషల్ పాయింట్, హీరోయిజంతో పాటు, విజయ్ నుంచి కోరుకొనే అంశాలూ మేళవించి పూర్తిగా ఓ కమర్షియల్ ప్యాకేజీ అందించాడు అట్లీ. కథ.. కిడ్నాపులతో ప్రారంభం అవుతుంది. విజయ్‌ని రివీల్ చేసే సన్నివేశం, విజయ్ - సత్యరాజ్‌ల మధ్య ఇంటరాగేషన్... ఇవన్నీ మాస్‌ని మెప్పిస్తాయి. విశ్రాంతి ఘట్టంలో ఇచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. ద్వితీయార్థంలో దళపతి (విజయ్) పాత్ర ప్రవేశిస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌ని కూడా గుండెను హత్తుకొనేట్టు తీర్చిదిద్దాడు. కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపారంపై సంధించిన డైలాగులు ఆకట్టుకొంటాయి. నార్మల్ డెలివరీని కేవలం డబ్బుల కోసం సిజేరియన్‌గా ఎలా మారుస్తున్నారో చెప్పిన సన్నివేశం.. కార్పొరేట్ దౌర్జన్యాన్ని కళ్లకు కడుతుంది. ఇలాంటి సన్నివేశాలు, సంభాషణలు ఈ సినిమాలో ఎన్నో కనిపిస్తాయి. సగటు జీవి.. కనెక్ట్ అయిపోయే కథ ఇది. అందుకే తమిళంలో అంతటి విజయాన్ని అందుకొంది. అయితే... తమిళ వాసనలు, అక్కడి పద్ధతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతాయన్నది కీలకం. ప్రధమార్థంలో స్క్రీన్ ప్లే కూడా గందరగోళ పరిచేదే. లెక్కకు మించిన పాత్రలు ఉన్నప్పుడు, పైగా కథానాయకుడు ద్విపాత్రాభినయం చేస్తున్నప్పుడు ఈమాత్రం కన్‌ఫ్యూజ్‌ని భరించాల్సిందే.
* సాంకేతిక వర్గం..
రెహమాన్ పాటలేమాత్రం మెప్పించలేదు. సౌండ్స్‌లో పదాలు కొట్టుకెళ్లిపోయాయి. నేపథ్య సంగీతం బాగుంది. కెమెరావర్క్, ఎడిటింగ్ సూపర్బ్ అని చెప్పాలి. ఇలాంటి సినిమాల్ని కట్ చేయడం ఆషామాషీ కాదు. యాక్షన్ ఘట్టాలూ అలరిస్తాయి. దర్శకుడిగా, కథకుడిగా అట్లీ విజయవంతమయ్యాడు. ఓసామాజిక అంశాన్ని తీసుకొని, దానికి విజయ్ తాలూకూ ఇమేజ్‌ని జోడించి అందరికీ నచ్చేలా ఓ కమర్షియల్ సినిమా తీయగలిగాడు. సంభాషణలు ఆకట్టుకొన్నా.. ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. చాలా డైలాగులు సెన్సార్ కొత్తెరకు బలయ్యాయి.
* ప్లస్ పాయింట్స్
+ విజయ్
+ కథ, కథనం
+ సాంకేతిక అంశాలు
* మైనస్ పాయింట్స్
- పాటలు
* ఫైనల్ వర్డిక్ట్: అదిరింది... ఇది శంకర్ మార్క్ సినిమా!
రివ్యూ బై శ్రీ