`విక్ర‌మార్కుడు` రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు : విజయ్ సేతుపతి, సయేశా, మడోన్నా సెబాస్టియన్ తదితరులు
దర్శకత్వం : గోకుల్
నిర్మాత‌లు : విజయ్ సేతుపతి, అరుణ్ పాండియన్, రాజేష్ కుమార్ 
సంగీతం : సిద్ధర్థ్ విపిన్ 
సినిమాటోగ్రఫర్ : డూడ్లె 

ఎడిటర్: వి.జె. సాబు జోసెఫ్


రేటింగ్: 2.75/5


విజ‌య్ సేతుప‌తి తిరుగులేని స్టార్‌. ఏ పాత్ర‌లో అయినా అవ‌లీల‌గా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేస్తాడు. త‌న చుట్టూ ఉన్న ఛ‌ట్రాన్ని తానే ఛేదించుకుని.. కొత్త పాత్ర‌ల‌తో రాణిస్తున్నాడు. హీరో, విల‌న్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్... ఇలా ఏర‌క‌మైన పాత్రైనా చేసేస్తాడు. ఇంత వైవిధ్య‌మైన కెరీర్‌.. ఈత‌రం న‌టులెవ‌ర‌కీ లేదేమో..?!  త‌మిళంలో తాను హీరోగా చేసిన సినిమా `జుంగా`. ఇప్పుడు తెలుగులో `విక్ర‌మార్కుడు`గా డ‌బ్ అయ్యింది. ఆహాలో.. ఈరోజు (శుక్ర‌వారం) నుంచీ... ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. మ‌రి `విక్ర‌మార్కుడు` క‌థేంటి?  ప్రేక్ష‌కుల్ని ఏమేర‌కు అల‌రిస్తాడు?


* క‌థ‌


జుంగా (విజ‌య్‌సేతుప‌తి) బ‌స్ కండక్ట‌ర్‌. త‌న కుటుంబానికి బాషాకి ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. త‌న తాత‌య్య‌, నాన్న‌.. ఇద్ద‌రూ డాన్‌లే. కాక‌పోతే.. ఆడంబ‌రాల‌కు పోయి, ఆస్తులన్నీ అరాయించేశారు. ఇష్ట‌ప‌డి, క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న థియేట‌ర్ ని సైతం అప్పుల పాలై అమ్ముకోవాల్సివ‌స్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న జుంగా.. ఎలాగైనా స‌రే, డాన్ గా మారి, బాగా డ‌బ్బులు సంపాదించి.. తాత‌ల‌నాటి థియేట‌ర్ ని సొంతం చేసుకోవాల‌నుకుంటాడు. అందుకోసం చిన్న చిన్న దందాలు చేసి, డ‌బ్బులు సంపాదిస్తాడు. 


ఆ డ‌బ్బుల‌తో థియేట‌ర్ కొన‌డానికి వెళ్తే... ఆ థియేట‌ర్ య‌జ‌మాని రెడ్డి (సురేష్ చంద్ర‌మీన‌న్‌) అవ‌మానించి పంపిస్తాడు. రెడ్డి పై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి రెడ్డి కూతురు యాళిని (సాయేషా సైగల్‌)ని కిడ్నాప్ చేయాల‌నుకుంటాడు జుంగా. యాళిని పారిస్ లో ఉంటుంది. అందుకోసం పారిస్ వెళ్తాడు. మరి అక్క‌డ‌కు వెళ్లి.. యాళినికి కిడ్నాప్ చేశాడా, లేదా? త‌న థియేట‌ర్ ని సొంతం చేసుకున్నాడా?  అనే విష‌యాలు తెలియాలంటే `విక్ర‌మార్కుడు` చూడాలి.


* విశ్లేష‌ణ‌


2018లో త‌మిళంలో `జుంగా` పేరుతో విడుద‌లైన సినిమా ఇది. ఇన్నాళ్ల‌కు డ‌బ్ అయ్యింది. కాబ‌ట్టి.. కాస్త లేట్ అయిన‌ట్టే లెక్క‌. డాన్ క‌థ‌లు, ఆ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలు చాలా చూశాం. కాక‌పోతే.. `విక్ర‌మార్కుడు`లోని వెరైటీ ఏమిటంటే...ఇది ప‌ర‌మ పిసినారి డాన్ క‌థ‌. ఆ పిసినారి త‌నం బాగా న‌వ్విస్తుంది. ఓర‌కంగా.. ఇది డాన్ సినిమాల‌పై సెటైర్ అనుకోవొచ్చు. జుంగా ని పోలీసులు  ఎన్‌కౌంట‌ర్ చేయాల‌నుకున్న ద‌గ్గ‌ర్నుంచి.. ఈ క‌థ మొద‌ల‌వుతుంది. అక్క‌డి నుంచి ప్ర‌తీ స‌న్నివేశాన్నీ కామెడీ కోస‌మే అన్న‌ట్టు తీశారు. కాక‌పోతే.. అక్క‌డ‌క్క‌డ త‌మిళ అతి విసిగిస్తుంది.


స‌న్నివేశాల్లోనూ సాగ‌దీత కనిపిస్తుంది. జుంగా చేసే పిసినారి చేష్ట‌లు, దానికి యోయో (యోగిబాబు) ప‌డే క‌ష్టాలు న‌వ్వు తెప్పిస్తాయి. పారిస్‌లోనూ.. త‌న పిసినారి త‌నం పోగొట్టుకోలేని జుంగాని చూస్తే న‌వ్వొస్తుంది. అక్క‌డ కిడ్నాప్ డ్రామా చాలా పేల‌వంగా సాగుతుంది. అస‌లు ఆ కిడ్నాప్ ఎపిసోడ్స్ ఏమాత్రం పండ‌లేద‌నే చెప్పాలి. రెడ్డి ఇంట్లో... జుంగా అమ్మ‌, బామ్మ‌లు చేసే కామెడీ సీన్లు బాగున్నాయి. ఓర‌కంగా... ఈ సినిమాలో యోగిబాబుని మించిన కామెడీ ఆ బామ్మ పాత్ర పండించింది.  మ‌డోనా స‌బాస్టియ‌న్ తో ల‌వ్ ట్రాక్ శుద్ధ వేస్ట్ వ్య‌వ‌హారం. ఆ ఎపిసోడ్ తో.. క‌లిసొచ్చిందేం లేదు. బ‌ల‌మైన విల‌న్ లేక‌పోవ‌డం మ‌రో పెద్ద మైన‌స్‌.


* న‌టీన‌టులు


విజ‌య్‌సేతుప‌తిలో కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చూడొచ్చు. అయితే త‌న ఆకారం వికారాన్ని తెప్పిస్తుంది. ఆ గెట‌ప్‌, కాస్ట్యూమ్స్ ఏమాత్రం సూట‌వ్వ‌లేదు. యోగిబాబు త‌నకు అల‌వాటైన ప‌ద్ధ‌తిలోనే న‌వ్విస్తాడు. హీరో త‌ర‌వాత అంత‌టి ప్రాధాన్యం ఉన్న పాత్ర త‌న‌దే. సాయేషా సైగ‌ల్ అందంగా క‌నిపించింది. అయితే ఆ పాత్ర‌ని స‌రిగా తీర్చిదిద్ద‌లేదు. హీరో బామ్మ‌గా ఎవ‌రు చేశారో గానీ, త‌న న‌ట‌న హైలెట్.


* సాంకేతిక వ‌ర్గం


పాట‌లు స్పీడ్ బ్రేక‌ర్లుగా మారాయి. ఆ పాట‌ల్లోని సాహిత్యం ఏమాత్రం విన‌సొంపుగా లేదు. డ‌బ్బింగ్ క్వాలిటీ అధ‌మ స్థాయిలో ఉంది. టేకింగ్ ప‌రంగా ఓకే. ద‌ర్శ‌కుడిలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. భారీ హంగులేం లేకుండా.. ఈసినిమాని చాలా సింపుల్ గా తీసేశారు. విజ‌య్ సేతుప‌తి లోని సీరియ‌స్ కోణాన్ని మాత్ర‌మే చూసిన వాళ్ల‌కు... ఈ పాత్ర‌, ఈ సినిమా కొత్త‌గా అనిపిస్తాయి.


* ప్ల‌స్ పాయింట్స్


కామెడీ
పంచ్‌లు
యోగిబాబు


* మైన‌స్ పాయింట్స్‌


డ‌బ్బింగ్ క్వాలిటీ
పాట‌లు
అర‌వ అతి


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  టైమ్ పాస్ కోసం చూడొచ్చు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS