నటీనటులు: శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్, రవిరాజ్, పవన్‌రమేష్, సన్ని, రోషన్ తదితరులు.
దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ళ
నిర్మాత: లక్ష్మణ్ క్యాదారి
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్: రవి.వి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
విడుదల తేదీ: మార్చి 22, 2019
రేటింగ్: 2/5
ప్రేమలో విఫలమై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ల కథల్ని పత్రికలలో చదువుతున్నాం. టీవీలలో చూస్తున్నాం. ప్రేమ కోసం ప్రాణం తీసుకుంటే.. ప్రేమికుడిగా చరిత్రలో నిలిచిపోతారేమో.., కానీ ఓ కొడుకుగా, కూతురుగా, అన్నింటికంటే మనిషిగా మాత్రం ఫెయిల్ అవుతున్నారన్న మంచి కాన్సెప్ట్‌తో ఓ సినిమా వచ్చింది. అదే.. `వినరా సోదర వీర కుమారా`. అయితే ఈ కాన్సెప్ట్‌ని దర్శకుడు అనుకున్న విధంగా తెరపై తీసుకురాగలిగాడా? ఈ సినిమాలోని ప్లస్‌లేంటి? మైనస్సులేంటి?
* కథ
రమణ (శ్రీనివాస్ సాయి) ఓ అల్లరి కుర్రాడు. ఆటో నడుపుతుంటాడు. తల్లిదండ్రుల ఆకాంక్షలు, ఆశలు.. ఇవేం పట్టించుకోడు. తన జీవితం తనదే. సులోచన (ప్రియాంక జైన్) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమెకు దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. చివరికి తన ప్రేమ ఫలించినప్పటికీ... సులోచన ఇతర కారణాల వల్ల తన బావని పెళ్లి చేసుకుంటుంది. ప్రేమలో విఫలమైన రమణ.. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఈ దశలో రమణ ఆత్మహత్యని ఓ దెయ్యం అడ్డుకుంటుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? ఆ దెయ్యానికీ రమణకీ ఉన్న సంబంధం ఏమిటి? ఆత్మహత్య అనే ఆలోచన నుంచి రమణ బయటపడ్డాడా, లేదా? అనేదే కథ.
* నటీనటుల పనితీరు..
శ్రీనివాస్ సాయికి బాలనటుడిగా చేసిన అనుభవం ఉంది. ఊపిరి లాంటి చిత్రాల్లో నటించాడు. ఆ అనుభవంతో తన పాత్రని రక్తికట్టించాడు. డైలాగ్ డెలివరీ విషయంలో కాస్త శ్రద్ద తీసుకుంటే, మంచి నటుడిగా నిలదొక్కుకుంటాడు. ప్రియాంక నటన కూడా బాగుంది. ఉత్తేజ్ నటన గుర్తిండిపోతుంది. సగటు మధ్యతరగతి తండ్రి ఆవేదన తన నటన ద్వారా ఆవిష్కరించారు. ఝూన్సీ కూడా తన పరిధి మేర నటించింది.
* విశ్లేషణ
ప్రేమ విఫలమైందనో, పరీక్ష తప్పిందనో, నాన్న తిట్టాడనో, అమ్మ అలిగిందనో యువత ఆత్మహత్యకు పాల్పడుతున్న రోజులు ఇవి. ప్రాణం విలువ తెలుసుకోలేక, చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతమంది జీవితాలు ప్రభావితం అవుతాయి? వాళ్ల కుటుంబాలు ఎలాంటి మానసిక వేదన అనుభవిస్తాయి? అనే పాయింట్ చుట్టూ తిరిగిన కథ ఇది. నిజానికి కథలో బలమైన కంటెంట్ ఉంది. ఈనాటి సొసైటీకి కావల్సిన సందేశం ఉంది. ఇలాంటి కథల్ని వాస్తవిక కోణంలో తెరకెక్కిస్తే, బలమైన భావోద్వేగాలు జోడించి చెప్పగలిగితే... కచ్చితంగా ఆకట్టుకుంటాయి. చరిత్రలో నిలిచిపోతాయి. ఆ అవకాశం వినరా సోదర వీర కుమారాకి దక్కింది కూడా.
అయితే ఇంత మంచి పాయింట్ ని సమర్థవంతంగా, ప్రభావవంతంగా చెప్పగలిగే తెలివితేటలు దర్శకుడికి లేకపోవడం దురదృష్టం. బలమైన సన్నివేశాలు, పాత్రల మధ్య సంఘర్షణ ఇవన్నీ సన్నివేశాలుగా మార్చడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కథ ప్రారంభం, నడవడిక ఓకే అనిపిస్తాయి. రమణ ఆత్మహత్యని ఓ దెయ్యం ఆపాలనుకోవడం ఓ ట్విస్ట్. అయితే ఈ క్రమంలో దర్శకుడు లాజిక్‌లను మర్చిపోయి అడుగులు వేశాడు. అలాగని సినిమా మరీ చూడని విధంగా రూపొందించబడిందని చెప్పలేం. అక్కడక్కడ కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి.
రచయిత (లక్ష్మీ భూపాల) కలం బలం వల్ల కొన్ని సీన్లు రాణించాయి. నటీనటుల (ఝాన్సీ, ఉత్తేజ్) వల్ల కొన్ని సన్నివేశాలు నిలబడగలిగాయి. పతాక సన్నివేశాలకు ముందు దర్శకుడు చెప్పదలచుకున్ననది సూటిగా, సుత్తిలేకుండా చెప్పాడు. కాకపోతే.. ఆమధ్య కథ, పాత్రలు పట్టు తప్పుతాయి. ఎన్నో చెప్పాలనుకుని, దేనికీ న్యాయం చేయలేకపోయాడు దర్శకుడు. ఆ క్రమంలో సాగదీత విసిగిస్తుంది. స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలూ కనిపిస్తాయి. మొత్తానికి ఓమంచి పాయింట్‌ని ఎంచుకున్నా - దాన్ని అనుకున్న స్థాయిలో చెప్పలేకపోవడం వల్ల ఈ చిత్రం అరకొర మార్కులతో సర్దుకుపోవాల్సివచ్చింది.
* సాంకేతిక వర్గం
లక్ష్మీభూపాల్ సంభాషణలు అక్కడక్కడ మెరిశాయి. సన్నివేశాల్లో డెప్త్ పెరగడానికి ఆయన మాటలు దోహదం చేశాయి. పాటలు ఓకే అనిపిస్తాయి. టెక్నికల్‌గా ఈ సినిమా బాగుంది. చిన్న సినిమాలకు బడ్జెట్ పరిధులు ఉంటాయి కాబట్టి.. ఆ మేరకు మంచి క్వాలిటీతో సినిమా వచ్చినట్టే అనుకోవాలి. దర్శకుడు రాసుకున్న కథ బాగున్నా - దాన్ని నడత సరిగా లేకపోవడంతో పట్టు తప్పింది.
* ప్లస్ పాయింట్స్
+ కథ
+ నటీనటులు
+ సంభాషణలు
* మైనస్ పాయింట్స్
- బలహీనమైన కథనం
- లాజిక్కులు లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: ట్రీట్‌మెంట్ తేలిపోయింది
- రివ్యూ రాసింది శ్రీ.