తారాగణం: మమ్ముట్టి, జగపతిబాబు, సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ తదితరులు
సంగీతం: కృష్ణ కుమార్
ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి
దర్శకత్వం: మహి.వి.రాఘవ్
విడుదల: ఫిబ్రవరి 08, 2019
రేటింగ్: 3/5
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన ఘట్టం... పాద యాత్ర
అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని గద్దె దించి - అవకాశాల్లేని కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు వచ్చేలా చేసిన చరిత్ర.. పాద యాత్ర..
వైఎస్ఆర్ అనే నాయకుడ్ని... జనంలోకి తీసుకెళ్లిన వాహనం... పాద యాత్ర
వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే ఈ పాద యాత్ర ఘట్టాన్నే దర్శకుడు మహి వి రాఘవ తన కథకు ముడిసరుకుగా చేసుకున్నాడు. బయోపిక్‌ల పరంపర కొనసాగుతున్న ఈ దశలో... ఆ జాబితాలో చేరడానికి `యాత్ర` వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? వైఎస్ఆర్‌లోని కోణాల్ని పూర్తిగా బయటపెట్టిందా? లేదంటే ఓ పార్శ్వానికే పరిమితం అయ్యిందా?
కథ
2003 సమయంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ ముందస్తు ఎన్నికల్ని ప్రకటిస్తుంది. ప్రజల మనసుల్ని గెలుచుకోవడానికి, ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికీ అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) పాద యాత్రకు సంకల్పిస్తాడు. ఆ యాత్రలో వైఎస్ఆర్‌కి ఎదురైన అనుభవాల పరంపరే.. ఈ యాత్ర.
నటీనటుల పనితీరు..
తెరపై ఎంతమంది నటులున్నా దృష్టంతా ముమ్ముట్టివైపే వెళ్తుంది. వైఎస్ పాత్రకు మమ్ముట్టి నూటికి నూరుపాళ్లూ న్యాయం చేశాడు. ఆ పాత్రలో మమ్ముట్టిని తప్ప మరొకర్ని ఊహించుకోలేం. కొన్ని చోట్ల వైఎస్‌లా చూపించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. సుహాసిని, రావు రమేష్, జగపతిబాబు, వినోద్ కుమార్, పోసాని.. వీళ్లవి చిన్న చిన్న పాత్రలే. ఏ సన్నివేశం చూసినా వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తుంటారు. అంత మందిని పోగు చేసి సినిమా తీయడం మామూలు విషయం కాదు.
విశ్లేషణ...
సాధారణంగా బయోపిక్ అంటే వ్యక్తి జీవితం సమస్థం ఉంటుంది. పుట్టుక నుంచి మరణం వరకూ ప్రతీ దశలో ఉన్న కీలకమైన ఘట్టాల్ని ఆవిష్కరిస్తారు. ఆ లెక్కన చూస్తే `యాత్ర` బయోపిక్ కాదు. ఓ వ్యక్తి జీవితంలోని ఓ భాగం మాత్రమే. వైఎస్ ఆర్ పాద యాత్ర చేయడానికి కారణమేంటి? ఆ యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి? వివిధ పధకాల్ని ప్రవేశ పెట్టడానికి గల కారణమేంటి? అనేది చూపించడానికి `యాత్ర`ని తెరకెక్కించారనిపిస్తుంది.
వైఎస్ అనగానే గుర్తొచ్చేది.. మొండితనం. మడమ తిప్పని నైజం. దాన్ని గుర్తుకు తెచ్చేలా కొన్ని సన్నివేశాల్ని రాసుకున్నాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా... అధిష్టానంని ఎదురు తిరిగిన సందర్భాలు ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దల్ని కాదని, వైఎస్ఆర్ సొంత నిర్ణయాలు తీసుకోవడం, పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేసేటప్పుడు కూడా అధిష్టానం మాటల్ని పక్కన పెట్టడం, క్రమశిక్షణ కమిటీ వచ్చినప్పుడు.. వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పడం - ఇవన్నీ వైఎస్ఆర్‌లోని మొండితనం చూపిస్తుంటాయి.
వృద్ధాప్య పించన్లు, ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ... ఇవన్నీ వైఎస్ ప్రవేశ పెట్టిన పధకాలే. ఆ పధకాల ఆలోచనలు రావడానికి కారణమేంటో ఈ చిత్రంలో చూపించారు. రైతులు పడుతున్న ఆవేదనని కళ్లారా చూసిన వైఎస్ ఉచిత విద్యుత్తు ఇస్తానని ప్రమాణం చేయడం, గుండె ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేని ఓ తల్లి కన్నీరు చూసి చలించి ఆరోగ్య శ్రీ పధకాలు ప్రవేశ పెట్టినట్టు చూపించారు. ఇవన్నీ నిజంగా వైఎస్ జీవితంలో జరిగాయా? లేదా? అనే విషయాల్ని పక్కన పెడితే... ఎమోషన్ పండించడంలో ఆయా సన్నివేశాలు దోహదం చేశాయి.
వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేత. అయితే ఆ పార్టీ పేరు ఎక్కడా ఈ సినిమాలో ఉటంకించలేదు. చేతి గుర్తుని పిడికిలి గుర్తుగా మార్చేశారు. చంద్రబాబు నాయుడుని చూపించే సాహసం చేయలేదు. కాకపోతే ఆ పాత్రని ఫోన్ సంభాషణలకే పరిమితం చేశారు. ఆఖరికి జగన్‌ని కూడా చూపించలేదు. చివర్లో కొన్ని రియల్ షాట్స్‌లో మాత్రమే జగన్ కనిపిస్తాడు. రాజకీయాలపై సెటైర్లు వేసే అవకాశం ఉన్నా, ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీకి వ్యతిరేకంగా కొన్ని స్టేట్‌మెంట్లు ఇచ్చే అవకాశం ఉన్నా.. వాటి జోలికి పోదలచుకోలేదు దర్శకుడు.
సాంకేతిక వర్గం...
మహి వి రాఘవ కథకుడుగా విజయవంతమయ్యాడు. ఈ చిత్రాన్ని బయోపిక్‌లా కాకుండా ఓ కథగా తీసుకుంటే ఓ మొండి మనిషి తత్వాన్నీ, తన నిజాయతీని ఆవిష్కరించినట్టే. వైఎస్‌ని హీరో గా చూపించాలన్న ఉద్దేశంతో రాసుకున్న సన్నివేశాలు బాగున్నాయి. అక్కడక్కడ దర్శకుడు మరింత స్వేచ్ఛ తీసుకున్నాడనిపిస్తుంది. పాటలు సందర్భానికి తగ్గట్టుగా కుదిరాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
* ప్లస్ పాయింట్స్
+ మమ్ముట్టి నటన
+ తొలి సగం
* మైనస్ పాయింట్స్
- ద్వితీయార్థం
పైనల్ వర్డిక్ట్: ఎమోషనల్ యాత్ర
రివ్యూ రాసింది శ్రీ.