మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. పూజా కార్యక్రమాల్ని చిరంజీవి ఇంట్లోనే నిరాడంబరంగా నిర్వహించారట. అతి త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. తొలితరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి కథని అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక టీమ్‌ని ఏర్పాటు చేసి, చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్లుగా, చరిత్రకి ఏమాత్రం డ్యామేజ్ రాకుండా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న రెండో చిత్రమిది. కాగా ఈ చిత్రాన్ని రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసే యోచనలో ఉన్నాడు. అందుకే ఈ సినిమాకి యూనివర్సల్‌గా ఉండేలా 'మహావీర' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీనియర్ నటి హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయి. ఆ లిస్టులో నయనతార పేరు బాగా వినిపిస్తోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఫుల్‌గా మేకోవర్ అయ్యారు. డిఫరెంట్ గెడ్డంతో కనిపిస్తున్నారు. 2018 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.