కెఎస్ రామారావు నిర్మాతగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై రూపొందుతోన్న 45వ సినిమా ఇది. సీనియర్ నిర్మాత కెఎస్ రామారావుకి తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే దర్శకుడు కరుణాకర్ పేరు చెప్పగానే 'తొలిప్రేమ' సినిమా గుర్తుకొస్తుంది. అప్పట్లో ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి కరుణాకర్ దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మాతగా, సాయిధరమ్ తేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమయ్యింది. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందట. ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారు. తొలిసారిగా లక్కీ బ్యూటీ అనుపమ మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టనుంది ఈ సినిమాతో. విభిన్నమైన లవ్ స్టోరీగా తెరక్కెనుందట ఈ చిత్రం. మరో పక్క సాయి ధరమ్ తేజ్ 'జవాన్' సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' ఫేం మెహరీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 'విన్నర్'గా ఆకట్టుకున్న తేజు ఈ సారి 'జవాన్'గా ఎన్ని మార్కులు వేయించుకుంటాడో చూడాలి మరి. ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. బి.వి.యస్. రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.