చిత్రసీమకు ఇది గడ్డుకాలం. చాలా ఏళ్లుగా థియేటర్ల పరిస్థితి అస్త వ్యస్థంగా ఉంది. సరైన సినిమాలు లేక, రాబడి తగ్గిపోయి... థియేట్ వ్యవస్థ విలవిలలాడుతోంది. ఇప్పుడు కరోనా మరో పెద్ద దెబ్బ కొట్టింది. ఏడు నెలలుగా సినిమా థియేటర్‌కి తాళాలు వేసి ఉంచారు. మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయో చెప్పలేని పరిస్థితి. థియేటర్ నిర్వహణ వ్యయం భరించలేక.. గ్రేటర్ హైదరాబాద్‌లో 5 థియేటర్లు మూతబడ్డాయని ప్రచారం మొదలైంది. గెలాక్సీ థియేటర్(టోలిచౌకి), శ్రీ రామ థియేటర్(బహదూర్‌పుర), అంబ థియేటర్(మెహదీపట్నం), శ్రీమయూరి థియేటర్(ఆర్టీసీ క్రాస్ రోడ్), శాంతి థియేటర్(నారాయణగూడ) ... థియేటర్లు చరిత్రలో కలిసిపోతున్నాయనిచెప్పుకున్నారు.
అయితే ఇప్పుడు మరోషాక్. ఈ 5 థియేటర్లతో పాటు, మరో 10 థియేటర్లు సైతం... గొడౌన్‌లుగా మారిపోబోతున్నాయట. హైదరాబాద్ లో సినీ ప్రియులు మల్టీప్లెక్స్‌కి అలవాటు పడుతున్నారు. పాత కాలం నాటి థియేటర్లు రెన్నోవేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఆ థియేటర్లకు పెట్టుబడి పెట్టేందుకు థియేటర్ యజమానులు మొగ్గు చూపించడం లేదు. పైగా కరోనా కాలంలో వాటిని నడపడమే కష్టమైపోయింది. అందుకే.... ఇప్పుడు ఆ థియేటర్లను శాశ్వతంగా మూసేయాలని నిర్ణయించుకున్నార్ట.
మూసాపేట లో సినీ ప్రియుల్ని అలరించిన ఓ పెద్ద థియేటర్ ని త్వరలో మూసేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో కొన్ని థియేటర్లు ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయట. వాటిని తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.