థియేటర్లు తెరచుకునే అవకాశం ఉన్నా, పెద్ద సినిమాలేవీ విడుదలకు రెడీ గా లేవు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల్ని నడిపించలేమన్నది వాళ్ల ఉద్దేశం. అయితే.. ఓటీటీ బేరాలు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి. విజయ్ సినిమా `మాస్టర్`ని నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తారని ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కి ఈ సినిమాని 100 కోట్లకు అమ్మేశారని, ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదల అవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
అయితే.. ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది. `మాస్టర్`ని ఎట్టిపరిస్థితుల్లోనూ... థియేటర్లలోనే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చింది. ఓటీటీలో వస్తుందన్న వార్తల్ని ఖండించింది. అయితే థియేటర్లలో ఎప్పుడు చూపిస్తారన్నది ఇంకా తేల్చలేదు. నిజానికి ఈసినిమా సంక్రాంతికి విడుదల అవ్వాలి. కానీ.. సంక్రాంతికి వచ్చే పరిస్థితి లేదు. దాంతో.. మాస్టర్ వేసవికి వాయిదా పడిపోయిందని చెబుతున్నారు. కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం చిత్రబృందం స్పష్టత ఇవ్వడం లేదు.