ఎన్టీఆర్ సినీ జీవితంలో ఓ భారీ మైలు రాయి రాజమౌళి స్టామినా అద్దం పట్టిన తొట్ట తొలి ఘట్టం.. - సింహాద్రి. ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించిన సినిమా ఇది. హీరోయిజాన్ని ఏ స్థాయిలో చూపించొచ్చో.. సాక్ష్యంగా నిలిచిన సినిమా ఇది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు, ఓ మాస్ హీరోని, అభిమానులకు నచ్చే విధంగా చూపిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తేల్చి చెప్పిన అపురూపం - సింహాద్రి. ఈసినిమా విడుదలై నేటికి 17 ఏళ్లు. స్టూడెండ్ నెంబర్ వన్ తో దర్శకుడయ్యాడు రాజమౌళి. ఆ సినిమా హిట్టు. ఎన్టీఆర్ కి తొలి విజయాన్ని అందించిన సినిమా ఇది. అలా రాజమౌళి - ఎన్టీఆర్‌లకు మంచి దోస్తీ కుదిరింది.
అయితే తొలి విజయంలో కె.రాఘవేంద్రరావు ముద్రే ఎక్కువ. ఆ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. దాంతో హిట్టులో సగ భాగం ఆయన కొట్టుకెళ్లిపోయారు. రాజమౌళికి తనదైన ముద్ర వేసే అవకాశం `సింహాద్రి`తో కుదిరింది. బాషా కథని కాస్త అటూ ఇటూ మార్చి, తనదైన స్టైల్, మేకింగ్ జోడించి వన్నె తీసుకొచ్చాడు రాజమౌళి. కేరళ ఎపిసోడ్, అక్కడ చూపించిన హీరోయిజం సినిమా తాలుకూ మూడ్‌ని మార్చేసింది. పాటలన్నీ సూపర్ హిట్టే. కీరవాణి ఆర్.ఆర్ అయితే మరో రేంజులో వినిపించింది. 8 కోట్లతో తీసిన సినిమా ఇది. దాదాపు 25 కోట్లు సంపాదించింది. అప్పటికి అదే రికార్డు.
250 థియేటర్లలో ఈ సినిమా విడుదలైతే ఏకంగా 166 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 141 సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది. 52 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడింది. ఇవన్నీ అప్పటికి సరికొత్త రికార్డులు. ఎన్టీఆర్ - రాజమౌళిల కాంబో అంటే హిట్టే అనే సెంటిమెంట్ ఈ సినిమాతో మరింత బలపడింది. ఈ హిట్టు హ్యాంగోవర్ నుంచి తేరుకోవడానికి ఎన్టీఆర్‌కి చాలా కాలం పట్టింది. అన్ని సినిమాల్నీ సింహాద్రితో పోల్చి చూసుకోవడం వల్ల ఎన్టీఆర్‌కి ఫ్లాపుల పరంపర తప్పలేదు. 2007 లో మళ్లీ రాజమౌళితో జత కట్టి 'యమదొంగ' తీసేంత వరకూ ఎన్టీఆర్ హిట్టు మొహం చూడలేకపోయాడు. అదీ.. ఈ సినిమా చూపించిన ప్రభావం.