'పవర్ స్టార్' హంగామా మొదలైపోయింది. ఈ సినిమాతో వర్మ ఏం ఉద్ధరిస్తాడో, ఎంత మందికి చేరువవుతుందో తెలీదు గానీ, టైటిల్, లోగో, ఫొటోలతో ఆసక్తిని రేకెత్తించడం మొదలెట్టేశాడు. `పవర్ స్టార్` టైటిల్ తోనే సగం అటెన్షన్ మొదలైపోయింది. మధ్యలో ఓ టీ గ్లాసుని తీసుకొచ్చి - జనసేనతో లింకు కట్టాడు వర్మ. `ఎన్నికలు అయిన తరవాత కథ` అంటూ ట్యాగ్ లైన్ చేర్చి - ఇదో పొలిటికల్ సెటైర్ అని తేల్చేశాడు. ఎన్నికలయ్యాక.. పవన్ జీవితాన్ని ఇప్పుడు కళ్లకు కట్టబోతున్నాడని అర్థమైంది.
విచిత్రంగా ఈ కథలోకి చిరంజీవిని లాక్కొచ్చాడు. ఫస్ట్ లుక్ వదలకుండానే ఈ సినిమాలోని కొన్ని స్టిల్స్ బయటకు తీసుకొచ్చాడు వర్మ. ఓ ఫొటోలో చిరు, పవన్‌లను పోలిన నటుల్ని కూర్చోబెట్టాడు. దాంతో ఈ కథలో చిరు ప్రమేయం కూడా ఉందన్న లీకును తనే ఇచ్చాడు. ఎన్నికలయ్యాక `జనసేన` పార్టీలోనూ, పవన్ జీవితంలోనూ చిరు ప్రమేయం ఏమిటన్నది ఈ సినిమలో వర్మ చూపిస్తున్నాడు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. మొత్తానికి టైటిల్, లోగో, పోస్టర్‌తో పవన్ అభిమానుల్లో గుబులు పుట్టించేశాడు వర్మ. ఓ రకంగా ఈ ప్రాజెక్టు సగం హిట్టయినట్టే.