సినిమాని తీయడం కాదు, దాన్ని అమ్ముకోవడంలోనే అసలైన 'మేకింగ్' స్ట్రాజజీ దాగుంది. చిన్నదో, పెద్దదో - స్టార్ హీరోనో, కొత్తవాడో - 'సినిమాని అమ్ముకోవడం' చాలా కీలకం! 'రోబో 2.0' తిప్పలు కూడా అందుకే. ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన సినిమా ఇది. విడుదల తేదీ ఎప్పుడంటే.. 'ఇదిగో.. అదుగో' అంటూ ఊరిస్తున్నారు. చాలాసార్లు విడుదల తేదీ చెప్పి - వాయిదా వేసేశారు.
దాంతో 'రోబో 2'పై ఆసక్తి తగ్గడం మొదలైంది. అంతేనా..?? రజనీకాంత్‌కి ఈమధ్య వీర ఫ్లాపులు తలులుతున్నాయి. 'కబాలి', 'కాలా' సినిమాలు చూసి స్వయంగా రజనీకాంత్ అభిమానులే నొచ్చుకున్నారు. ఆ ప్రభావం 'రోబో 2'పై పడింది. దాదాపుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిది. ఇది వరకు రజనీ సినిమాని రూ.10కి అమ్మితే ఇప్పుడు రూ.100 అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే... పెట్టుబడికి గిట్టుబాటు కాదు. కానీ రజనీ ఫ్లాపులు చూసి, రోబో 2 ఆలస్యం చూసి బయ్యర్లు భయపడుతున్నారు. పైగా ఇప్పటికీ అనుకున్న సమయానికి 'రోబో' వస్తుందో రాదో అన్న అనుమానాలు కూడా ఎక్కువవుతున్నాయి.
ఇటీవల విడుదల చేసిన `రోబో` టీజర్ కూడా అనుకున్నంత స్థాయిలో లేదు. అందుకే ఈ సినిమాపై మళ్లీ బయ్యర్ల దృష్టి పడడానికి శంకర్ తన వంతు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే మేకింగ్ వీడియోల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఏకంగా మూడు మేకింగ్ వీడియోలు విడుదలయ్యాయి. ఇప్పుడు నాలుగోదీ విడుదల చేశాడు. ఇదివరకెప్పుడూ లేనట్టుగా ఈ మేకింగ్ వీడియోలేంటి?? అంటూ రజనీ అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఈ మేకింగ్ వీడియోల వెనుక ఓ స్ట్రాజనీ ఉంది. 'మేం సినిమా కోసం ఎంత కష్టపడ్డామో చూడండి' అని చెప్పుకోవడానికి, 'అందుకే ఇంత ఆలస్యం అయ్యింది' అని సరిదిద్దుకోవడానికి మేకింగ్ వీడియోల్ని సాక్ష్యంగా చూపిస్తున్నట్టుంది శంకర్ పరిస్థితి. సాధారణంగా సినిమా విడుదలైన తరవాత మేకింగ్ వీడియోలు బయటపెడతారు. సీజీ వర్కులు ఎంత బాగా చేశారో తెలియడానికి. శంకర్ ఓ అడుగు ముందుకేసి.. ముందే వాటిని బయటకు తీసుకొచ్చాడు.
ఇవి చూసైనా.. ఈ సినిమాని భారీ రేట్లు పెట్టి కొనడానికి బయ్యర్లు వస్తారేమో అని. మరి శంకర్ ఆశలు ఫలిస్తాయా, లేదా?? వెయిట్ అండ్ సీ.