నిన్నటిరోజున దిల్‌రాజు ఓ మాట అన్నారు!
'ఈ రోజుల్లో ప్రేక్షకులు మంచీ చెడూ ఆలోచించడం లేదు. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలని కోరుకుంటున్నారు. లిప్‌లాక్స్ వుండాలని అంటున్నారు. ఇటువంటి సినిమాలను వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వీళ్ళే రైట్ ఏమో!! భవిష్యత్తులో వీళ్ళ దారిలోకి నేను రావాల్సి వస్తుందేమో’’ అని. ఆయనేదో ఆవేశం కొద్దో, చిన్న సినిమాలు సాధిస్తున్న విజయాల్ని చూసి కంగారు పడో చెప్పిన మాటలు కాదు.
అక్షరాలా నిజం.
ముద్దులు ముద్దుగా హద్దులు దాటేస్తున్నాయ్. తెలుగు సినిమాని ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతున్నాయ్. తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయిలో చూడాలి... చూడాలి.. అని గొంతులు చించుకునే సినీ ప్రేమికుల కలలు నిజం చేస్తున్నాయ్..
ఇదంతా అర్జున్ రెడ్డి పుణ్యమే. ముద్దుల్లో రకాలేంటి? ఎలా పెట్టుకోవొచ్చు? అనే విషయాన్ని అర్జున్ రెడ్డి కూలంకుశంగా చెప్పింది. 'ఛీ పాడు.. అవేం ముద్దులు..' అనుకుంటూనే దొంగ చాటుగా చూసేసింది యువతరం. అలా అనుకుంటాం గానీ.. పెద్ద వాళ్లకూ యమ హాటుగా నచ్చేశాయి. అందుకే... ఆ సినిమా గురించి అంతలా మాట్లాడుకున్నారు.
కట్ చేస్తే... 'ఆర్ ఎక్స్ 100' వచ్చింది. ఇదేం టైటిలు... తనేం హీరో..? అనుకున్నవాళ్లు సైతం ఈ సినిమా చూసి ముక్కున వేలేసుకున్నారు. 'అర్జున్ రెడ్డికి డాడీ'లా తయారైంది ఈ సినిమా. ముద్దుల విషయంలో. హీరోయిన్ రెచ్చిపోయి.. హీరోపై పడి పడి.. కవ్వించి, మురిపించి.. పెదవులు లాగేసుకుంది మురిపెంగా. అందుకే.. ముద్దుల విషయంలో... గత సినిమాల రికార్డులన్నీ 'ఆర్ ఎక్స్' దాటేసింది.
ఈ రెండు సినిమాలూ హిట్టే. అర్జున్ రెడ్డి కల్ట్ క్లాసిక్ అయితే... ఈ యేడాది చిన్న సినిమాల్లోకెల్లా ప్రభంజనంలా మారింది.. ఆర్. ఎక్స్ 100
ఇక వెండి తెర చిన్న ముద్దుల విషయంలో గేట్టేసింది. సినిమాల్లో ఐదు పాటలూ, నాలుగు ఫైటులు ఎంత 'కామన్' అయిపోయిందో.. ఆరేడు ముద్దులు కూడా అంతే 'కామమ్' అయిపోయింది. ముద్దుల సన్నివేశాల్ని ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చే వరకూ దాచేవారు ఇది వరకు. ఇప్పుడు అలా కాదు. ముద్దులు పెట్టుకునే దృశ్యాలే పోస్టర్లు అవుతున్నాయి. ట్రైలర్లలో అవే చూపిస్తున్నారు. ఇది వరకు టీజర్, ట్రైలర్ చివర్లో ఓ మాస్ డైలాగ్ పెట్టేవారు. ఇప్పుడు ముద్దు పెడుతున్నారు. అంత ఎదిగిపోయింది చిత్రసీమ.
మొన్నామధ్య రష్మీ సినిమా ఒకటొచ్చింది. అదే.. 'అంతకు మించి' అందులో కావల్సినన్ని ముద్దులున్నాయి. ఆర్జీవీ 'భైవర గీత' అనే ఓ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అందులోనూ ముద్దులతో మైకం తెప్పించే కార్యక్రమంలోకి దిగిపోయింది చిత్రబృందం. రాబోతున్న సినిమాల ట్రైలర్లు, టీజర్లు ఇలా ముద్దులతో నిండిపోయే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పటి వరకూ ముద్దులు పెట్టించాలన్న ఐడియా గానీ దర్శక నిర్మాతలకు లేకపోతే... ఇప్పుడు అర్జెంటుగా ముద్దు సీన్లు రీషూట్లు చేసి మరీ... జోడించాల్సిన ప్రమాదం, పరిస్థితి దాపురించేశాయి.
కామన్‌గా.. రొటీన్‌గా చెప్పే మాట ఒక్కటే.. 'ముద్దుల వల్ల సినిమాలు ఆడవు'. కానీ ఇప్పుడు ముద్దులు లేకపోతే.. సినిమాలు నడవడం లేదు. ముద్దుల్లో ఇంటెన్సిటీ ఎంత ఉంటే.. లవ్వు, రొమాన్సూ అంత ఉన్నట్టు దర్శకులు పీలైపోతున్నారు. ఇదో ట్రెండ్ అనుకోవాలంతే.
మరి ఇది ఎంత కాలం?? అంటే ఏం చెప్పగలం... ముద్దులపై మొహం మొత్తేసేవరకూ, లేదంటే నాలుగైదు సినిమాలు ఈడ్చి పెట్టి తన్నేంత వరకూ.. అదీ కాదంటే మరో కొత్త ట్రెండ్ మొదలైనంత వరకూ.
అప్పటి వరకూ ఈ ముద్దుల్ని ముద్దుగా భరించాల్సిందే.