తమిళ చిత్రసీమకే కాదు.. యావత్ భారతీయ చిత్రసీమకే ఇదో ఛాలెంజ్. 'రోబో 2.ఓ'ని విడుదలకు ముందే పైరసీ చేస్తామంటూ 'తమిళ రాక్స్' అనే వెబ్‌సైట్ హెచ్చరించింది. దాంతో... చిత్రసీమ మొత్తం అవాక్కయిపోయింది. ఈమేరకు ఈ సంస్థ ట్వీట్ కూడా చేసింది.
ఇదేం తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఈ వెబ్ సైట్‌లో 'సర్కార్', 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' పైరసీలు కనిపిస్తున్నాయి. విడుదల రోజునే ఈ రెండు సినిమాల పైరసీ ప్రింట్లని అప్ లోడ్ చేసేసింది తమిళ రాకర్స్. దాంతో 'రోబో 2.ఓ' కూడా పైరసీ చేసేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా విషయంలో ఓ అడుగు ముందుకేసి.. ముందే ఇలా ట్వీట్ రూపంలో హెచ్చరికలు పంపండం చిత్రసీమకు నిజంగా షాక్ కలిగించే విషయమే.
రూ.600 కోట్ల వ్యయంతో తీసిన భారీ బడ్జెట్ చిత్రమిది. పైరసీ దారుల కంట పడకుండా చిత్రబృందం సాంకేతిక పరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. అయినా సరే.... ఇలా హెచ్చరికలు రావడంతో దర్శక నిర్మాతలకు కునుకు లేకుండా పోయింది. ఈనెల 29న రోబో 2.ఓ వస్తోంది. ఈలోగా ఈ సినిమాని ఎలా కాపాడుకోవాలా? అంటూ చిత్రబృందం తలలు పట్టుకుంటోంది.
నిజంగానే ఇది చిత్రసీమకు ఓ సవాల్ లాంటిదే. పైరసీ కోరల్లో చిక్కుకున్న సూపర్ స్టార్ చిత్రం క్షేమంగా బయటపడాలని కోరుకుందాం.