ఎట్టకేలకు రజనీకాంత్ సినిమా '2.0' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా పట్ల టెన్షన్ రోజురోజుకీ పెరిగిపోతోంది మేకర్స్‌కి. హీరో రజనీకాంత్, దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా.. ఇలా ప్రతి ఒక్కరూ టెన్షన్ పడాల్సిన పరిస్థితి. వారందరి టెన్షన్ పక్కన పెడితే, రజనీకాంత్ అభిమానుల్లోనూ టెన్షన్ రెట్టింపు అయిపోతోంది.
కారణం, '2.0' సినిమాకి జరగాల్సిన రీతిలో ప్రమోషన్ జరగకపోవడమేనట. అభిమానుల ఆవేదన ఇది. సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు, లైకా ప్రొడక్షన్స్ ఈ '2.0' సినిమాకి ప్రమోషన్ సరిగా చేయడంలేదని ఆరోపిస్తున్నారు. 'ఇలా చెయ్యండి, అలా చెయ్యండి..' అంటూ అభిమానులు ఉచిత సలహా కూడా ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి '2.0' సినిమాకి జరిగిన, జరుగుతున్నంత బీభత్సమైన ప్రమోషన్ ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకీ జరగలేదు. దుబాయ్‌లో కనీ వినీ ఎరుగని రీతిలో సినిమా ఫంక్షన్ నిర్వహించారు. టీజర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్‌లకు సంబంధించిన ఈవెంట్స్‌ని ఏ స్థాయిలో నిర్వహించారో అందరం చూశాం.
అయితే సుమారు 600 కోట్ల రూపాయలతో సినిమా నిర్మించినందున, సినిమా వాస్తవ షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా విడుదలవుతున్నందున, హైప్ తగ్గిపోయిందన్నది అభిమానుల వాదన. ఇంతకుముందు రజనీకాంత్ సినిమాలకి ఇలాంటి టెన్షన్ లేదు. ఎప్పుడు వచ్చినా, ఆ అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోయేవి.
వరుసగా సినిమాలు పరాజయం పాలవుతుండడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా '2.0'పై ఈ స్థాయి టెన్షన్ వుండడం సహజమే.