నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మరో భారీ హిట్.. నరసింహనాయుడుతో దక్కింది. 105 కేంద్రాలలో వంద రోజులు ఆడిన ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఇరవై ఏళ్లు. ఫ్యాక్షన్ చిత్రాల పరంపరలో.. ఇదో మైలు రాయి. బాలయ్య నటన, పరుచూరి పదునైన డైలాగులు, మణిశర్మ పాటలు... ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయి. సిమ్రాన్ పూర్తి పద్ధతైన పాత్రలో నటించి, నటిగానూ మెప్పించింది. ఆశాషైనీ అందాలు మరింత గ్లామర్ తీసుకొచ్చాయి.
అప్పట్లో ఈ సినిమా రూ.20 కోట్ల వసూళ్లు అందుకొంది. అప్పటికి అదే అత్యధిక వసూళ్లు. అందుకే ఇండ్రస్ట్రీ హిట్ గా నిలిచింది. నరసింహనాయుడు తరవాత.. దాదాపు హీరోలంతా ఫ్యాక్షన్ కథలపై మొగ్గు చూపించారు. కానీ... ఒకరో ఇద్దరో హిట్లు కొట్టారంతే. కో కో కోమలి, లక్స్ పాపా లక్స్ పాపా లంచికొస్తావా,నాదిర దిన్నా నాదిర దిన్నా నడుమే నాజూకు, చిలక పచ్చ కోక, నిన్నా కుట్టేసినది ఇలా ప్రతీ పాటా.. సూపర్ హిట్టే. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ - బి.గోపాల్ ల కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021లోనే ఈ సినిమా పట్టాలెక్కవచ్చు.