ఆర్.ఆర్.ఆర్.. పాన్ ఇండియా సినిమానే. ఇందులో ఎలాంటి డౌటూ లేదు. కానీ... తెలుగులో తయారైన భారతీయ చిత్రం. కాబట్టి.. ఈ సినిమా ముమ్మాటికీ ముందుగా తెలుగు సినిమానే. ఆ తరవాతే పాన్ ఇండియా సినిమా అయ్యింది. విచిత్రం ఏమిటంటే.. టాలీవుడ్ లో మినహాయిస్తే అన్ని చోట్లా ప్రమోషన్లు కుమ్మేస్తున్నాడు రాజమౌళి. తెలుగులో జరిగింది ఒకట్రెండు ఈవెంట్లే. ఓసారి రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్‌లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ రోజున... తెలుగు సినీ జర్నలిస్టుల అతి వల్ల అది కాస్త హాస్యాస్పదంగా మారిపోయింది. ఆ తరవాత... చిత్రబృందం తెలుగు మీడియా ముందుకు వచ్చిందే లేదు.
ఈలోగా బాలీవుడ్ లో ప్రమోషన్లు జోరుగా సాగిపోతున్నాయి. అక్కడ చిన్నా చితకా పత్రికకూ, న్యూస్ ఛానల్ కీ.. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్‌లు ఇంటర్వ్యూలు ఇచ్చొచ్చారు. బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్నారు. కపిల్ టాక్ షోలో కనిపించారు. ఎక్కడ పడితే అక్కడ హంగామా చేశారు. ఆ తరవాత తమిళనాడు, కేరళ చుట్టొచ్చారు.ఇక మిగిలింది.. టాలీవుడ్ మాత్రమే.చివరి నాలుగు రోజుల్లో ఇక్కడ ప్రమోషన్లు చేసుకుంటే చాలన్నది ఆర్.ఆర్.ఆర్ చిత్రబృంద ఉద్దేశ్యం. అయితే తెలుగులో చివరి నాలుగు రోజుల ప్రమోషన్లూ సరిపోతాయా? అనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమాని తెలుగులో ప్రమోషన్లు చేసినా, చేసుకోకపోయినా... బజ్ అయితే తగ్గదు. ఆ మాటకొస్తే ఇంకాస్త పెరుగుతుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రమోషన్లు చేసుకోవడం వల్ల...కొత్తగా వచ్చే ఉపయోగాలు లేవు. అందుకే... మిగిలిన భాషల్లో దృష్టి పెట్టింది చిత్రబృందం. కాకపోతే.. ఎంత ఉపయోగం? ఏమిటి లాభం? అనేది పక్కన పెట్టి, ఇది తెలుగు సినిమా కాబట్టి, తెలుగు హీరోలు చేసిన పాన్ ఇండియా సినిమా కాబట్టి, తెలుగులోనూ ప్రమోషన్లు చేసుకుంటే గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది.