2021లో ఎన్నో సంగతులు. అందులో చాలా వివాదాలు. ఇండ్రస్ట్రీలో తుమ్మినా, దగ్గినా వార్తలే. దానికి తోడు.. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో... ప్రతీ చిన్న విషయం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ యేడాది ప్రజలు, మీడియా నోళ్లల్లో ఎక్కువగా నానిన విషయాలేంటన్నది ఆరా తీస్తే..
* నాగచైతన్య - సమంత ఈ యేడాదే విడిపోయారు. వాళ్ల విడాకుల వ్యవహారంపై మీడియాతో పాటుగా అభిమానులు కూడా చాలా రోజుల పాటు... ఆసక్తిగా చర్చించుకున్నారు. విడాకులకు కారణమేంటి? విడాకుల నిమిత్తం సమంత తీసుకున్న భరణమెంత? అనే విషయాలు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. విడాకులెందుకు? అనే విషయంపై ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. కానీ చిలవలు, పలవలుగా వండి వార్చిన వార్తలెన్నో..?!
* సాయిధరమ్ తేజ్ ఈ యేడాది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో.. పోరాటం చేశారు. చివరికి విజేతై తిరిగొచ్చారు. అయితే సాయిధరమ్ తేజ్ ఇప్పటి వరకూ అభిమానుల కంట కనిపించలేదు. సాయిధరమ్ ప్రమాదం పై మీడియా రకరకాల కథనాలు ప్రచురించింది. ఓ రకంగా చెప్పాలంటే చాలా అతి చేసింది. మీడియా ప్రవర్తించిన తీరు విమర్శల పాలైంది.
* రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ ఇచ్చిన స్పీచ్.. ఈ యేడాదికే హైలెట్. ఏపీ ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడిన విధానం.. అందరినీ విస్మయపరిచింది. పవన్ ఇండ్రస్ట్రీ తరుపునే మాట్లాడినా, పవన్‌కి ఇండ్రస్ట్రీలో ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. ఆ తరవాత పోసాని ప్రెస్ మీట్ పెట్టి పవన్‌నీ, చిరు కుటుంబాన్నీ తిట్టిన విధానం.. కూడా వార్తల్లోకి ఎక్కింది. ఆ తరవాత నుంచి పోసాని అడ్రస్స్ లేకుండా పోవడం మరో విచిత్రం.
* `టికెట్ రేట్ల` వ్యవహారంలో నాని పెదవి విప్పడం, థియేటర్లని కిరాణా షాపులతో పోల్చడం ఈ యేడాది వైరల్ అయిన మరో విషయం. నాని వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేచింది. ఏపీ నాయకులు నానిని తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టారు.
* మా ఎన్నికల వ్యవహారం, అవి సాగిన శైలి... చాలా కాలం గుర్తుండిపోతాయి. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపునుంచి గెలుపొందిన వాళ్లు సైతం రాజీనామా చేయడం - మరో హైలెట్. ఈ ఎన్నికలలో చేసుకున్న పరస్పర విమర్శలు పరిశ్రమలో పైపై కనిపించే ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది. విష్ణు నోరుజారి, నోరు తిరక్క అన్న మాటలు మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.