తెలుగులో ఎన్ని జోనర్‌లైనా ఉండొచ్చు. కొత్తగా ఎన్నయినా పుట్టుకురావొచ్చు. కానీ మాస్ సినిమా.... ఎప్పటికీ మాస్ సినిమానే. మాస్ ని ఓ సినిమా మెప్పించిందంటే.. ఇక దానికి తిరుగులేదు. రికార్డు వసూళ్లు ఆ సినిమాకి ధార బోసేయాల్సిందే. 2021లోనూ మాస్ సినిమాల జాతర కొనసాగింది. సంక్రాంతికి వచ్చిన క్రాక్ ఫుల్ మాస్ సినిమా. ఈ యేడాది డిసెంబరు 17న విడుదలైన పుష్ప కూడా మాస్ సినిమానే. అయితే.. అఖండ మాస్ కే మాస్.
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న సినిమా ఇది. డిసెంబరు 2న విడుదలైంది. తొలి రోజు నుంచే... థియేటర్లలో పూనకాలు మొదలైపోయాయి. హీరోల్ని అభిమానులకు నచ్చేలా చూపించడంలో దిట్ట... బోయపాటి శ్రీను. బాలకృష్ణతో భలే ట్యూన్ అయిపోయిన బోయపాటి.. ఈ సినిమాలో తన ఉగ్రరూపం చూపించాడు. బాలయ్య కోసం రెండు రకాల పాత్రలు సృష్టించినా, అఘోరా పాత్రకే తన ప్రేమాభిమానులు ఎక్కువ పంచాడు. అందుకే ఆ పాత్ర... మాస్ కి విపరీతంగా నచ్చింది. బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్లు, ఫైట్లూ కేక పెట్టించాయి. దానికి తోడు తమన్ ఇచ్చిన ఆర్. ఆర్ అదిరిపోయింది. మాస్‌కి విపరీతంగా నచ్చేయడంతో... థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. కుటుంబ ప్రేక్షకులు వస్తారా, రారా? అనే అనుమానాలూ తీరిపోవడంతో.... వారాలు గడుస్తున్నా, బాక్సాఫీసు దగ్గర హోరు తగ్గలేదు. కరోనా, థర్డ్ వేవ్ భయాల్ని సైతం పక్కన పెట్టి, ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఆ తరవాత వచ్చిన పుష్ప కీ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడంలోనూ.. అఖండ జోరు ప్రభావం చూపించింది.