2022కి శుభం కార్డు పడిపోయింది. ఇప్పుడు అందరి దృష్టీ కొత్త యేడాదిపై ఉంది. 2022లో చాలా హిట్లూ, చాలా ఫ్లాపులు వచ్చాయి. అయితే వీటిలో పరాజయాల వాటానే ఎక్కువ. ఆఖరికి.. 2022 చివరి వారం కూడా ఫ్లాపులతో ముగిసింది. ఈ వారం కూడా బాక్సాఫీసు దగ్గరకి చాలా సినిమాలే వచ్చాయి. టాప్ గేర్, రాజయోగం, లక్కీ లక్ష్మణ్... ఇలా శుక్రవారం ఐదారు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒక్కదానికీ... మంచి ఓపెనింగ్స్ రాలేదు. ఈరోజు `కొరమీను` రిలీజ్ అయ్యింది. దీనికి కూడా పెద్దగా ఓపెనింగ్స్ కనిపించడం లేదు. మొత్తానికి 2022లో చివరి వారం బాక్సాఫీసుకి చేదు అనుభవాలనే అందించినట్టైంది.
నిజానికి డిసెంబరులో పెద్దగా సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు ఇష్టపడరు. అందరి దృష్టీ సంక్రాంతి సీజన్‌పై ఉంటుంది. సంక్రాంతికి భారీ ఎత్తున కొత్త సినిమాలొస్తాయి. అందుకే...వాటి గురించే మాట్లాడుకొంటారు. సగటు ప్రేక్షకుడు కూడా బడ్జెట్ సంక్రాంతి సినిమాలకే కేటాయిస్తాడు. అందుకే డిసెంబరులో బాక్సాఫీసు దగ్గర పెద్దగా సందడి కనిపించదు. కొత్త సినిమాలూ రావు. కానీ ఈ డిసెంబరులో మాత్రం దాదాపు 30 సినిమాలొచ్చాయి. ఒక్క ధమాకాకి తప్ప.. దేనికీ సరైన వసూళ్లు రాలేదు. ఇక డబ్బింగ్ సినిమాల్లో అవతార్ 2 మెప్పించింది. మిగిలినన్నీ నామ్ కే వాస్తే రిలీజ్ అయ్యాయంతే!