ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 24 ముద్దులట.. అవును '24 కిస్సెస్'. ఆ ముద్దుల లెక్కనే సినిమా టైటిల్‌గా పెట్టేసుకున్నారు. 'కుమారి 21 ఎఫ్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హెబ్బా పటేల్ ఈ సినిమాలో హీరోయిన్. నిజానికి ఈ సినిమాకి ఆమె పేరే పబ్లిసిటీ పరంగా పెద్ద అస్త్రం.
ఈ మధ్య లిప్ టు లిప్ కిస్ సీన్స్ పెట్టేసి, హిట్టు కొట్టేయడం ఓ ట్రెండ్ అయిపోయింది. అఫ్కోర్స్, అలాంటి సినిమాలన్నీ విజయవంతమైపోవనుకోండి. అది వేరే సంగతి. ఈ '24 కిస్సెస్' మాత్రం చాలా కొత్తగా వుంటుందట. ఇదో సరికొత్త ప్రేమకథ అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. మరోపక్క, సామాజిక బాధ్యత అనేదే లేకుండా, సమాజం పట్ల కనీసపాటి గౌరవం లేకుండా 'ముద్దుల సీన్లతో' సినిమాని నింపేసి, యూత్‌ని చెడగొట్టేస్తున్నారంటూ పెద్ద రచ్చే జరుగుతోంది.
కానీ, చిత్ర దర్శక నిర్మాతల వెర్షన్ ఇంకోలా వుంది. సినిమా అనేది కమర్షియల్ అంశమనీ, అయినా 'ముద్దు సీన్లతో' సినిమాలు గతంలోనూ చాలా వచ్చాయనీ, చాలా వల్గర్ సినిమాల్నీ ప్రేక్షకులు చూస్తూ వస్తున్నారనీ, తమది వల్గర్ సినిమా కానే కాదనీ.. రొమాంటిక్ టచ్‌తో సాగే ఇంట్రెస్టింగ్ సినిమా అనీ అంటున్నారు. పైకి ఏం చెప్పినా, సినిమాలో ముద్దు సీన్లకు సంబంధించి ప్రచారం గట్టిగానే సాగుతోంది. ప్రోమోస్ ఆ స్థాయిలోనే రూపొందించి వదిలారు.
ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే అందులో '24 కిస్సెస్' ఫస్ట్ ప్లేస్‌లో వుండడం గమనార్హం. మరి, ఈ టైమ్‌ని '24 కిస్సెస్' సద్వినియోగం చేసుకుంటుందా.? వేచి చూడాల్సిందే.