వెండితెరపై అందాల తారల లిస్ట్ తీస్తే, అందులో టాప్ టెన్‌లో జయప్రద పేరు ఖచ్చితంగా వుంటుంది. ఓ దశలో ఆమె ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్. తెలుగు నేల నుంచి బాలీవుడ్ వరకూ ఆమె సినీ ప్రస్థానం కొనసాగింది. వెండితెరపైనే కాదు, రాజకీయాల్లోనూ సత్తా చాటారామె. లోక్‌సభ సభ్యురాలిగా పనిచేశారు గతంలో జయప్రద.
ఇప్పుడామె ఎక్కువగా సినిమాల్లో నటించడంలేదు. చాలా అరుదుగా మాత్రమే ఆమె తెరపై కన్పిస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ నటించిన సినిమాలో ఆమె కన్పించారు. అంతకు ముందు ఓ సినిమాలోనూ ఇలాగే కన్పించారు. లేటెస్ట్‌గా జయప్రద 'శరభ' అనే సినిమాలో నటించగా, ఆ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే షరామామూలుగానే ఈసారి కూడా జయప్రదకు పరాజయమే ఎదురయ్యింది. 'శరభ' సినిమాతో తన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యిందని జయప్రద సినిమా ప్రచారంలో చెబుతూ వచ్చారుగానీ, ఇది నిజానికి ఆమెకు సెకెండ్ ఇన్నింగ్స్ కాదు. సెకెండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్.. ఇలా చాలా ఇన్నింగ్స్ అయిపోయాయి.
సీనియర్ నటిగా తన అనుభవాన్ని రంగరించి 'శరభ' సినిమాలో నటించినా, సినిమాలో కంటెంట్ పెద్దగా లేకపోవడంతో జయప్రద, బౌన్స్ బ్యాక్ అవ్వాలన్న కోరిక నెరవేరలేదు. తరచూ సినిమాల్లో కన్పించడానికి జయప్రద సుముఖత వ్యక్తం చేస్తే, పెద్ద సినిమాల నుంచీ ఆమెకు అవకాశాలు వచ్చిపడ్తాయి. కానీ, ఎందుకో ఆమె సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ, చాలా అరుదుగా మాత్రమే తెరపై కన్పిస్తున్నారు.
అయితే ప్రతిసారీ ఆమె సెలక్షన్ ఫెయిలవుతోంది.