అసలే కరోనాతో.. టాలీవుడ్ బిక్క చచ్చిపోయింది. యేడాదికాలంగా చాలా నష్టపోయింది పరిశ్రమ. ఇప్పుడిప్పుడే కాస్త దారిలో పడుతోంది. పెద్ద సినిమాలు వస్తున్నాయి. జనాలు థియేటర్లకు రావడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో టాలీవుడ్ కి మరో ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. త్వరలోనే థియేటర్లని మళ్లీ మూసేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ఏపీలో థియేటర్ల రగడ గట్టిగా ఉంది. అక్కడ టికెట్ రేట్ల వ్యవహారంలో గొడవ జరుగుతూనే ఉంది. తాజాగా.. ప్రభుత్వ అధికారులు కొన్ని థియేటర్లను సీజ్ చేశారు. ఆ సంఖ్య దాదాపుగా 30 వరకూ ఉంది. రోజు రోజుకీ థియేటర్లపై దాడి, సీజులు ఎక్కువ అవుతున్నాయి. ఇదంతా ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అన్నది థియేటర్ యజమానుల మాట. అందుకే.. ఏపీలో థియేటర్ల బంద్ పాటించాలని భావిస్తున్నార్ట.
ఈరోజు విజయవాడలో ఓ కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో థియేటర్ యజమానులు కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో టికెట్ రేట్లు భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు టికెట్లని అమ్మితే.. థియేటర్ల మనుగడ చాలా కష్టం. అయినా కొన్ని థియేటర్లు ఈ నిబంధనల్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నాయి. ఇంకొన్ని థియేటర్లు రేట్లు సవరించడం లేదు. దాంతో ప్రభుత్వ అధికారులు ఆయా థియేటర్లపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇలా ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 20 థియేటర్లు సీజ్ చేశారు. అందుకే థియేటర్ యజమానులంతా ఓ నిర్ణయానికి వచ్చి, థియేటర్లను మూసివేయాలని భావిస్తున్నార్ట. అదే జరిగితే... శుక్రవారం విడుదల కానున్న, `శ్యామ్ సింగరాయ్`కి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది.