'ఏ1 ఎక్స్ ప్రెస్' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : సుందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, సత్య, రావు రమేష్ తదితరులు 
దర్శకత్వం : డెన్నిస్ జీవన్
నిర్మాత‌లు : టి జి విశ్వ ప్రసాద్, సుందీప్ కిషన్, అభిషేక్ అగర్వాల్, దయ పెన్నం
సంగీతం : హిపాప్ తమిళ 
సినిమాటోగ్రఫర్ : కెవిన్ రాజ్ 
ఎడిటర్: చోట కే ప్రసాద్ 


రేటింగ్: 2.75/5

 

క‌థాంశాల ఎంపిక‌లో  కొత్త‌ద‌నానికి పెద్ద‌పీట వేస్తాడు యువ క‌థానాయ‌కుడు సందీప్‌కిష‌న్‌. వాణిజ్య పంథాలోనే వినూత్న కాన్సెప్టుల‌ను ఎంచుకుంటాడు. ప్రస్థానం, రొటీన్ లవ్‌స్టోరీ, గుండెల్లోగోదారి, వెంక‌‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, టైగ‌ర్‌, నిను వీడ‌ని నీడ‌ను నేనే వంటి సినిమాలు ఆయ‌న అభిరుచిని తెలియ‌జెప్పాయి. గ‌త కొన్నేళ్లుగా తెలుగులో ఆశించిన విజ‌యాలు ద‌క్క‌ని ఆయ‌న తాజాగా త‌మిళ రీమేక్ క‌థ‌ను ఎంచుకొని ఎ1 ఎక్స్‌ప్రెస్ సినిమా చేశాడు.  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. హాకీ నేప‌థ్యంలో స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మ‌రి ఈ ఎక్స్‌ప్రెస్ వేగం ఎలా ఉంది?  విజ‌యాల వేట‌లో ఉన్న సందీప్ కిష‌న్‌ని కోరుకున్న గ‌మ్యం వైపు న‌డిపించిందా, లేదా?


* క‌థ‌:


యానాంలోని చిట్టిబాబు హాకీ స్టేడియంకు గొప్ప వార‌స‌త్వం ఉంటుంది. స్వాతంత్ర స‌మయంలోనే దేశానికి ప్రాతినిథ్యం వ‌హించిన హాకీ క్రీడాకారులకు ఆ స్టేడియం పుట్టిల్లు. ఆ స్టేడియాన్ని క్రీడామంత్రి రావు ర‌మేష్ స్వాధీనం చేసుకొని ఓ ఫార్మా కంపెనీకి లీజుకు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అత‌ని ప‌న్నాగం నెర‌వేర్చుకునే నెపంతో యానాం హాకీ క్ల‌బ్‌ను కుట్ర ప‌న్ని అండ‌ర్‌ప‌ర్‌ఫార్మ‌ర్ టీమ్‌గా ప్ర‌క‌టింప‌జేస్తాడు. ఈ ఎత్తుగ‌డ‌తో స్టేడియం స్థలాన్ని ద‌క్కించుకోవ‌చ్చ‌న్న‌ది అత‌ని ప్లాన్‌.

 

ఈ నేప‌థ్యంలో స్టేడియాన్ని రక్షించుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తాడు కోచ్ మురళీశ‌ర్మ‌. వైజాగ్ క్ల‌బ్ టీమ్‌తో జ‌రిగే క్వాలిఫ‌యింగ్  మ్యాచ్‌లో యానాం క్ల‌బ్ గెలిస్తే జాతీయ టోర్నీకి అర్హ‌త సాధిస్తుంది. దాంతో స్టేడియంను కాపాడుకోవ‌చ్చ‌ని ముర‌ళీశ‌ర్మ భావిస్తాడు. ఈ నేప‌థ్యంలో యానాంలోని మావ‌య్య ఇంటికి వ‌స్తాడు సంజు (సందీప్‌కిష‌న్‌). అక్క‌డ అతనికి హాకీ ప్లేయ‌ర్ లావ‌ణ్య (లావ‌ణ్య త్రిపాఠి) ప‌రిచ‌య‌మ‌వుతుంది. క‌ష్టాల్లో ఉన్న యానాం టీమ్‌ను సంజు ఎలా ఆదుకున్నాడు? అండ‌ర్ 21 జాతీయ‌స్థాయి హాకీ కెప్టెన్ అయిన అత‌ను హాకీ నుంచి ఎందుకు దూరం కావాల్సి వ‌చ్చింది? అత‌ని గ‌తం ఏమిటి? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా మిగ‌తా చిత్ర క‌థ న‌డుస్తుంది.


* విశ్లేష‌ణ‌


సాధార‌ణంగా క్రీడా నేప‌థ్య చిత్రాలంటే కావాల్సినంత భావోద్వేగాలతో స్ఫూర్తివంతంగా సాగుతాయి. కానీ ఈ సినిమాలో మాత్రం రాజ‌కీయాలు, వివ‌క్ష వ‌ల్ల ప్ర‌తిభావంతులైన క్రీడాకారులు ఎందుకు ఎద‌గ‌లేక‌పోతున్నార‌నే అంశాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీనికి ప్రేమ కథతో పాటు వాణిజ్య అంశాల్ని జోడించారు. హాకీ నేప‌థ్యానికి స్థానిక రాజ‌కీయాలు అద్ది కథ రాసుకున్నారు. ప్ర‌తిభ ఉండి ఆర్థి క స్టోమ‌త లేక‌, రాజ‌కీయాల‌కు బ‌లైపోతున్న టాలెంటెడ్ క్రీడాకారులు ఎలా అంత‌ర్మ‌థ‌నానికి గుర‌వుతున్నారో చ‌ర్చించే ప్రయ‌త్నం చేశారు. అయితే ఈ స్పోర్ట్్స డ్రామాను తీర్చిదిద్దే క్ర‌మంలో ద‌ర్శ‌కుడు ఏ విషయంలోనూ పూర్తిగా న్యాయం చేయ‌లేక‌పోయాడు. ప్ర‌థ‌మార్థ‌మంతా పేల‌వ‌మైన క‌థ‌, కథ‌నాల‌తో సాగింది. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య రొమాంటిక్ ఎపిసోడ్ ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది.


స‌త్య పండించిన వినోదం కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తోనే సంజు అంతర్జాతీయ హాకీ క్రీడా కారుడ‌నే విష‌యం రివీల్ అవుతుంది. దాంతో ద్వితీయార్థం నుంచే క‌థ‌లోని సంఘ‌ర్ష‌ణ మొద‌ల‌వుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో సంజు హాకీ నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించారు. రాజ‌కీయాల కార‌ణంగా  సంజు స్నేహితుడు ద‌ర్శి టోర్నీకి సెలెక్ట్ కాక‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. మ‌రో మిత్రుడు రాహుల్ రామ‌కృష్ణ కాలును కోల్పోతాడు. ఈ నేప‌థ్యంలో ఎపిసోడ్ సినిమాలో ఉద్వేగ‌భ‌రితంగా సాగింది. 

 

స్నేహితుల కోసం ఆట‌కు  దూర‌మైన సంజు  యానాంలో గ్రౌండ్‌ను కాపాడుకోవ‌డానికి తిరిగి హాకీలోకి ఎంట‌రై చేసిన పోరాటంలో ఎమోష‌న్ మిస్స‌యింద‌నే భావ‌న క‌లుగుతుంది.  ప‌తాక‌ఘ‌ట్టాల్ని భారీస్థాయిలో, నిజ‌మైన ఆట‌ను ప్ర‌తిబింబించేలా చిత్రీక‌రించిన‌ప్ప‌టికీ వాటిలో కావాల్సినంత ఉద్వేగాలు పండ‌లేద‌నే ఫీల్ క‌లుగుతుంది.  క‌థ‌లో సీరియ‌స్ అంశాలున్నా  వాటిని తెర‌పై ఆవిష్క‌రించే విధానం పూర్తిగా ప‌ట్టు త‌ప్పిన‌ట్లు క‌నిపించింది. అటు ఎమోషన్స్ ను, వాణిజ్య అంశాలను బాలన్స్ చేయలేక దర్శకుడు తడబడ్డాడు.


* న‌టీన‌టులు:  


ప‌నితీరుహాకీ ప్లేయ‌ర్‌గా  శారీర‌క ధారుఢ్యంతో కనిపించ‌డానికి సందీప్‌కిష‌న్ చ‌క్క‌టి క‌స‌ర‌త్తులు చేశాడు. త‌న పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోష‌న్ స‌న్నివేశాల్లో త‌న‌దైన న‌ట‌న‌లో మెప్పించాడు. లావ‌ణ్య త్రిపాఠి ఫ‌ర్వాలేద‌నిపించింది.  కేవ‌లం రొమాంటిక్ ఎపిసోడ్ కోస‌మే ఆమె పాత్ర‌ను తీర్చిదిద్దార‌నిపించింది. క‌‌థ‌లో ఆమె పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. కోచ్‌గా ముర‌ళీశ‌ర్మ అద్బుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. ఆయ‌న పాత్ర గుర్తుండి పోతుంది.  ఇక రావుర‌మేష్ త‌న‌దైన విల‌నీతో మెప్పించాడు. రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి త‌మ శైలికి భిన్నంగా సీరియ‌స్ పాత్ర‌ల్లో మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు.


* సాంకేతిక వ‌ర్గం


ద‌ర్శ‌కుడు డెన్నిస్ జీవ‌న్ రీమేక్‌ను స‌రిగ్గా డీల్ చేయ‌లేద‌నిపించింది.  హిప్‌హాప్ త‌మిళ పాట‌లు కొన్ని బాగున్నాయి. ప‌తాక‌ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ‌లో ఛాయాగ్రాహ‌కుడి ప‌నిత‌నం క‌నిపించింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.


* ప్ల‌స్ పాయింట్స్


హాకీ
ఎమోషన్స్‌
నిర్మాణ విలువ‌లు


* మైన‌స్ పాయింట్స్‌


కథ‌నం
ల‌వ్ ట్రాక్‌
వినోదం మిస్ అవ్వ‌డం


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  ఎక్స్‌ప్రెస్ స్పీడుకు బ్రేకులు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS