నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, తదితరులు
దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు: మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి
సంగీత దర్శకుడు: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా
ఎడిటర్: మార్తాండ్. కె. వెంకటేష్
రేటింగ్: 2.5/5
ఇంద్రగంటి మోహనకృష్ణ క్లాస్ దర్శకుడు. కథకంటే వినోదం, భావోద్వేగాలకే పెద్ద పీట వేస్తారాయన. అవే హిట్లూ తెచ్చిపెట్టాయి. సాహిత్యం తెలిసిన దర్శకుడు. కాబట్టి.. మనవైన మాటలు, మనదైన వాతావరణం ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. అష్టాచమ్మా, సమ్మెహనం, అమీతుమీ... ఇలా పసందైన పేర్లు పెడతారు. ఈసారి కూడా అచ్చమైన తెలుగు టైటిల్ ని ఎంచుకొన్నారు. అదే.. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. టైటిల్ లో పదహారణాల తెలుగుదనం ఉట్టిపడుతున్న ఈ సినిమా ఎలా ఉంది? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాల్సిన విషయాలేమున్నాయి..? ఓ లుక్కేస్తే..
* కథ
నవీన్ (సుధీర్ బాబు) ఓ టాప్ డైరెక్టర్. వరుస హిట్లు కొట్టి.. టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఈసారి ఓ అందమైన అమ్మాయి చుట్టూ తిరిగే సినిమా తీయాలని అనుకుంటాడు. అందుకోసం ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలన్నది ప్లాన్. అందుకోసం అన్వేషిస్తుంటే... ఎప్పటిదో ఓ రీల్ దొరుకుతుంది. ఆరీల్ లో ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఆమె అందానికి ముగ్థుడైపోతాడు నవీన్. అప్పటి నుంచీ ఆ అమ్మాయి ఎక్కడ ఉందా? అని వెదుకుతుంటాడు. తీరా చూస్తే.. ఆమె ఓ డాక్టర్. తనకు సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండదు. పైగా నవీన్ తీసిన సినిమాలంటే మరీనూ. `నా సినిమాల్లో నటిస్తావా` అంటే తిరస్కరిస్తుంది. అయితే తను లేకుండా ఆ సినిమా చేయనని భీష్మించుకొన్న నవీన్.... ఆ అమ్మాయితో సినిమా ఎలా తీశాడు? అందుకోసం ఎంత కష్టపడ్డాడు? ఆ సినిమా తీసే ప్రోసెస్‌లో ఎలాంటి నిజాలు తెలిశాయి? ఇదీ కథ.
* విశ్లేషణ
సినిమా ఇండస్ట్రీ చుట్టూ సాగే కథ ఇది. సమ్మెహనం కూడా ఈ జోనరే. కాకపోతే.. ఆ సినిమా ఓ హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఓ దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే కథ. ఇంద్ర గంటి సినిమాలన్నీ స్లో ఫేజ్‌లో సాగుతాయి. ఇదీ అంతే. టేకాఫ్ నెమ్మదిగా ఉంటుంది. నవీన్ ని ఓ సూపర్ డైరెక్టర్ గా పరిచయం చేస్తూ సాగిన తొలి సన్నివేశాలు పరిశ్రమలో జరిగే అనేక విషయాలకు అద్దం పడతాయి. సినిమా ఇండస్ట్రీపై కొన్ని సెటైర్లు పడ్డాయి. కొంతమంది దర్శకులు కథేం లేకుండా సినిమా మొదలెట్టేస్తారని, సినిమా తీస్తూ, తీస్తూ కథ గురించి ఆలోచిస్తారంటూ ఓ పాత్రతో సెటైర్ వేయించాడు దర్శకుడు. అవసరం ఉన్నా, లేకున్నా ఐటెమ్ సాంగ్ పెడతారని కూడా అన్నాడు. అయితే ఈ సినిమాలో కూడా అనవసరంగా ఓ ఐటెమ్ సాంగ్ వస్తుంది. బహుశా... దాన్ని కూడా సినిమాలపై సెటైర్ గా తీసుకోవాలేమో...? అలేఖ్యని ఒప్పించడానికి హీరో, అతని మిత్రబృందం చేసే ప్రయత్నాలు... బోరింగ్‌గా అనిపిస్తాయి. పాటలు ఉన్నా- అవేం గుర్తుండవు. ఫస్టాఫ్ అయిపోతోంది అనగా ఓ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ తో ఫ్లాట్ గా వెళ్లిపోతున్న సినిమాకి పట్టు దొరికినట్టు అనిపించినా - ఆ ట్విస్టు కూడా చాలా మంది ఊహించే అవకాశం ఉంది.
ద్వితీయార్థం మొత్తం ఎమోషనల్ డ్రామానే. ఇక్కడ ఫన్ కి చోట దొరకలేదు. తొలి సగంలో అక్కడక్కడ కొన్ని నవ్వులు చూసే అవకాశం దక్కింది కానీ, సెకండాఫ్‌లో ఆ ఛాన్స్ లేకపోయే సరికి రిలీఫ్‌లేకుండా పోయింది. అలేఖ్య ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ గా సాగినా, అది కూడా రొటీన్ అనిపిస్తుంది. సినిమా వాళ్ల కష్టాలు చూడ్డానికి ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. పైగా అవన్నీ వినీ వినీ విసిగిపోయిన విషయాలే. ఇక నవీన్ కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ లాంటిది చెబుతాడు. అందులోనూ డెప్త్ ఉండదు. నవీన్, అలేఖ్యలు కలిసి సినిమా ఎలా పూర్తి చేశారన్నది మిగిలిన కథ. అందులోనూ సరైన విషయం ఉండదు. పైగా.. అలేఖ్య, నవీన్‌ల ప్రేమకథపై దర్శకుడు ఫోకస్ పెట్టలేదు. పతాక సన్నివేశాల్లోనూ సెంటిమెంట్ పండలేదు. సన్నివేశాల సాగదీత, రొటీన్ విషయాలూ ప్రేక్షకుల్ని బాగా విసిగిస్తాయి. సినిమా పరిశ్రమపై కొన్ని సెటైర్లు పడినా అవి కూడా ఇది వరకు వినీ వినీ ఉన్నవే.
* నటీనటులు
సుధీర్ బాబు డీసెంట్ యాక్టర్. ఈ సినిమాలోనూ అదే కనిపిస్తుంది. నటుడిగా తప్పేం చేయలేదు. కాకపోతే.. కథల విషయంలోనే అప్రమత్తంగా ఉండాలి. ఈ సినిమా వరకూ పూర్తిగా ఇంద్రగంటి మ్యాజిక్‌పైనే ఆధారపడిపోయాడు. కానీ అది ఫలించలేదు.
కృతికి పెర్‌ఫార్మెన్స్ ఉన్న పాత్ర పడింది. తను చాలా సందర్భాల్లో సైలెంట్ గా ఉంటుంది. ఆమెకు అందంగా చూపించారు కూడా. శ్రీకాంత్ అయ్యంగార్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. వెన్నెల కిషోర్ కాసేపు అదరగొట్టాడు. అవసరాలది గెస్ట్ పాత్ర. మిగిలినపాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు.
* సాంకేతిక వర్గం
పీజీ విందా ఫ్రేములు కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కానీ ట్యూన్లు మాత్రం క్యాచీగా లేవు. ఇంద్రగంటి చాలా వీక్ స్క్రిప్టు రాసుకున్నాడు. తన బలమైన ఫన్, రొమాన్స్ ఇందులో కుదర్లేదు. అక్కడక్కడ కొన్ని పంచ్‌లు పడినా సరిపోలేదు. ఇంద్రగంటి సినిమాలంటే స్లో నేరేషన్‌కి ప్రిపేర్ అయిపోతారు ప్రేక్షకులు. కానీ వాళ్ల సహనాన్ని కూడా ఈ అమ్మాయి గట్టిగా పరీక్షించింది.
* ప్లస్ పాయింట్స్
సినిమా నేపథ్యం
కృతిశెట్టి
* మైనస్ పాయింట్స్
కథ, కథనం
స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్ : అమ్మాయి ముంచేసింది.