యంగ్ హీరో ఆది డబుల్ రోల్‌లో వస్తున్న చిత్రం 'బుర్రకథ'. ఈ సినిమాలో 'అభి', 'రామ్' అనే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్నాడు ఆది. లేటెస్ట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఉండాల్సిన అన్ని కమర్షియల్ అంశాల్నీ చక్కగా మిక్స్ చేశారీ టీజర్‌లో. అభి పాత్ర ట్రెండీగా ఉంది. రామ్ కొంచెం సాంప్రదాయాలకు విలువిచ్చే కుర్రాడిలా కనిపిస్తున్నాడు. రెండు పాత్రల్లోనూ ఆది చక్కగా ఇమిడిపోయాడు.
నటుడిగా ఆదిలో పరిణీతి బాగా కనిపిస్తోంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకుడు. 'చిన్నదానా నీ కోసం' ఫేం మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. చక్కని వినోదంతో పాటు, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే కట్ చేశారు. అయితే చిన్న సినిమాల సక్సెస్ ఫార్ములా అయిన ఘాటు రొమాంటిక్ సీన్సేమీ టీజర్‌లో చూపించలేదు. క్లీన్ ఎంటర్‌టైనర్‌గా 'బుర్రకథ' తెరకెక్కినట్లు అర్ధమవుతోంది టీజర్‌ని బట్టి.
టోటల్‌గా హండ్రెడ్ పర్సంట్ ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్‌టైనర్ మూవీగానే 'బుర్రకథ'ను చెప్పుకోవచ్చేమో. రిలీజ్ డేట్ ఇంకా తెలీదు కానీ, టీజర్ అయితే ఆదికి కలిసొచ్చేలానే అనిపిస్తోంది. మరోవైపు ఆది హీరోగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' అనే ఇంకో మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆది పవర్‌ఫుల్ అండ్ సీరియస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. మొత్తానికి డిఫరెంట్ జోనర్స్‌లో తెరకెక్కుతోన్న ఈ రెండు సినిమాలూ ఆది కెరీర్‌కి కలిసొచ్చేలానే కనిపిస్తున్నాయి. చూడాలి మరి.