తేజ దర్శకత్వంలో వచ్చిన 'ఒక విచిత్రం' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆది పినిశెట్టి, ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు. తండ్రి బాటలో దర్శకత్వం వైపు మళ్ళకుండా, నటనను కెరీర్‌గా ఎంచుకున్నాడు ఆది పినిశెట్టి. తొలి సినిమా నిరాశపర్చినా కుంగిపోలేదు, తమిళ సినిమాల్లోకి వెళ్ళి సత్తా చాటాడు. హీరోగానే సినిమాలు చెయ్యాలనీ అనుకోలేదు - ఎలాంటి అవకాశమొచ్చినా తన టాలెంట్ చూపించాలనుకున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే విలన్‌గానూ రాణిస్తున్న ఈ యువ నటుడు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో వెండితెరపై సత్తా చాటుతున్నాడు. 'సరైనోడు' సినిమా కోసం విలనిజం పండించి, 'నిన్నుకోరి' సినిమాలో మరో డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. అలాగే పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ కొట్టేశాడు. నటన అంటే అన్నీ చేయాల్సి ఉంటుందనీ హీరో, విలన్ అనేవి పాత్రలు మాత్రమేననీ ఆయా పాత్రల్లో ఎంత గొప్పగా రాణించాం అన్నదానిబట్టే నటనా ప్రతిభను గుర్తించాల్సి ఉంటుందని చెప్పాడీ యువ నటుడు. తమిళ సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమ తనను అక్కున చేర్చుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు ఆది పినిశెట్టి. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా, తన ప్రతిభతో అవకాశాలు దక్కించుకుంటున్న ఈ యువనటుడు విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిద్దాం.