బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్, 'సీక్రెట్ సూపర్ స్టార్' అనే సినిమాని నిర్మిస్తున్నాడు. ఆయన స్వీయ నిర్మాణంలో నటిస్తున్న చిత్రమిది. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్‌గా నటిస్తున్నాడు అమీర్ ఖాన్. మ్యూజిక్ డైరెక్టర్‌గా రాకింగ్ గెటప్‌లో కనిపిస్తున్నాడు అమీర్ ఖాన్. ఇటీవలే సంచలనాలు సృష్టించిన 'దంగల్' సినిమా కోసం అమీర్ ఖాన్ కొంచెం బరువు పెరిగాడు. ఈ సినిమా కోసం మళ్లీ బరువు తగ్గి, స్లిమ్‌గా మరింత హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. 'దంగల్' ఫేం జైరా వాసిం ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది ఈ సినిమా. సింగర్ అవ్వాలనే కోరిక ఉన్నా, ఇంట్లో తన అభిరుచిని మన్నించని పెద్దలు, అయినా వారిని అధిగమించి, వారి ఆంక్షల నడుమ ఆ అమ్మాయి తన కోరికను ఎలా నెరవేర్చుకుంది? అనే కథాంశంతో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఆమెకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అమీర్‌ఖాన్ పాత్ర చాలా కీలకం ఈ సినిమాలో. లేటెస్టుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. సోషల్ మీడియాలో తన పాటలతో ఉర్రూతలూగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. చాలా ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్ ఉంది. స్టార్ హీరో అయినా, చిన్న సినిమాల్ని నిర్మించడం, వాటితో ఘనవిజయాల్ని అందుకోవడం అమీర్‌ఖాన్‌కి వెన్నతో పెట్టిన విద్య. అలాగే ఈ సినిమా నిర్మాణంతోనూ అమీర్‌ఖాన్ తన సత్తా చాటబోతున్నాడు. 'తారే జమీన్ పర్' ఆ కోవలోనే ఘనవిజయం సాధించింది. ఈ 'సీక్రెట్ సూపర్ స్టార్' కూడా అలాగే పెద్ద విజయం సాధిస్తుందేమో చూడాలిక.