విలక్షణ నటుడు, విలక్షణ దర్శకుడు, నిర్మాతగా రవిబాబుకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. కామెడీ, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలా నటుడిగా పలు రకాల పాత్రలు పోషించిన ఆయన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలోనూ అభిరుచి గల సినిమాలను రూపొందించారు. రెగ్యులర్ కమర్షియల్ కాన్సెప్ట్‌లకు భిన్నంగా ఉంటాయి ఆయన తెరకెక్కించే చిత్రాలు. 'అల్లరి', 'అవును', 'అనసూయ', 'అదుగో' తదితర చిత్రాలు అలాగే వచ్చాయి. తాజాగా ఆయన 'ఆవిరి' అనే చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓ ఇల్లు, ఆ ఇంట్లో ఆవిరికీ, ఆత్మకీ సంబంధం ఏంటీ.? అనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. నేహా చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీముక్త, భరణీ శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అయితే, 'ఆవిరి' హారర్ చిత్రం కాదంటున్నారు రవిబాబు. ఓ స్పెషల్ థ్రిల్లర్ మూవీ. అన్ని వర్గాల వారూ ఎంజాయ్ చేస్తూ చూడొచ్చని చెబుతున్నారు. భయపెట్టేసే హారర్ ఎలిమెంట్స్‌ని చొప్పించి, ప్రేక్షకుల్ని విపరీతంగా భయపెట్టడం తనకు నచ్చదని, థ్రిల్‌తో కిక్ ఇవ్వడమే తనకిష్టమని రవిబాబు అంటున్నారు.
అంతేకాదు, దర్శకుడిగా విలక్షణ ఆలోచనలు చేయడంతో, నటుడిగా చాలా అవకాశాలు కోల్పోతున్నారట రవిబాబు. అందుకే ఇకపై కొన్నాళ్లు పూర్తిగా నటనపై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నారట. ఇప్పటికే ఆయన వద్ద నాలుగైదు విలక్షణ స్టోరీలున్నాయట. కానీ, వాటిని తెరపై ఆవిష్కరించేందుకు చాలానే టైమ్ పడుతుందట. ఈ లోగా కొన్నాళ్లు యాక్టింగ్‌లో బిజీ అవుతానని చెబుతున్నారాయన.