సల్మాన్ ఖాన్... అతని సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు అభినవ్ కశ్యప్. ఈ ముగ్గురూ తన జీవితాన్ని, కెరీర్‌ని సర్వనాశనం చేశారని కశ్యప్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సల్మాన్ సూపర్ హిట్ చిత్రం దబాంగ్‌కి అభినవ్ దర్శకుడు. దబాంగ్ 2 చిత్రానికీ అభినవ్‌నే ఎంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అభినన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచీ సల్మాన్‌కీ, అభినవ్‌కీ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.
అభినవ్ చేయాల్సిన కొన్ని ప్రాజెక్టుల్ని, కొన్ని సినిమాల్ని సల్మాన్ ఖాన్, అతని సోదరులు పరోక్షంగా అడ్డుకున్నారని, తనకి అవకాశాలు రాకుండా చేశారని అప్పట్లో చెప్పుకున్నారు. అవన్నీ నిజాలే అని.. అభినవ్ చెబుతున్నాడిప్పుడు. తనకు అవకాశాలిచ్చిన నిర్మాతల్ని సల్మాన్ బెదిరించాడని, దాంతో తన చేతికి వచ్చిన సినిమాలన్నీ చేజారిపోయాయని ఆవేదన వక్తం చేశాడు.
ప్రస్తుతం అభినవ్ వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. బంధుప్రీతి, పక్షపాతం లాంటి విషయాలు బాలీవుడ్ లో సర్వసాధారణమని ఈ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. వీటిపై సమాధానం ఇవ్వడానికి సల్మాన్ ఖాన్ నిరాకరిస్తున్నాడు. తాను ఇలాంటి మాటల్ని పట్టించుకోనని, ఇదంతా టైమ్ వేస్ట్ వ్యవహారం అని తేల్చేశాడు.