ఈమధ్య మన సినిమాలపై `కాపీ` మరకలు పడడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం ఇండ్రస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు కాపీ అనే భారాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ రెండూ.. మెగా సినిమాలే కావడం విశేషం. చిరంజీవి 152వ చిత్రం `ఆచార్య` కథ నాదంటూ రాజేష్ మండూరి అనే ఓ రచయిత ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మాతలకు తాను వినిపించిన కథే ఇప్పుడు కొరటాల చిరంజీవితో `ఆచార్య`గా తీస్తున్నారన్నది ఆరోపణ. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని ఆయన గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడు. టీవీ ఛానళ్లు, ఇండ్రస్ట్రీ పెద్దల చుట్టూ తిరుగుతూ.... న్యాయం కోసం పారాడుతున్నాడు.
మరో వైపు `పుష్ష`పైనా కాపీ ముద్ర పడింది. ప్రముఖ రచయిత వేంపల్లి గంగాధర్.. `పుష్ష` కథ నాదే అంటూ సోషల్ మీడియా ద్వారా గళం విప్పుతున్నారు. తాను 2018లో రాసిన `తమిళ కూలీ` అనే కథని కాపీ కొట్టి సుకుమార్ `పుష్ష`ని తెరకెక్కిస్తున్నారన్నది గంగాధర్ ఆరోపణ. `తమిళ కూలీ` రాయలసీమ నేపథ్యంలో సాగే కథ. అక్కడ అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ఓ లారీ డ్రైవర్ పాత్ర నేపథ్యంలో నడుస్తుంది.
`పుష్ఫ`లో బన్నీ కూడా లారీ డ్రైవరే. కాబట్టి గంగాధర్ వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఆరోపణలు ఎంత వరకూ నిలబడతాయో, ఈ పోరాటంలో ఈ రచయితలు ఎంత వరకూ విజయం సాధిస్తారో చెప్పలేం గానీ, రెండు పెద్ద సినిమాలు ఇప్పుడు కాపీ అవపాదు ఎదుర్కోవడం - ఇండ్రస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంపై అటు సుకుమార్ గానీ, ఇటు కొరటాల గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.