యువహీరో సత్య దేవ్ మధ్య రిలీజ్ అయిన 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సత్యదేవ్ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ సినిమా మాత్రం తనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత సత్య దేవ్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈమధ్య సత్యదేవ్, తమన్నా హీరోహీరోయిన్లుగా 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ తో ఓ కొత్త సినిమాను లాంచ్ చేశారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాకు టైటిల్ ప్రకటించిన తర్వాత నిర్మాతలకు ఈ టైటిల్ ఆల్రెడీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రిజిస్టర్ చేయించుకున్నారని సమాచారం తెలిసింది. దీంతో టైటిల్ విషయంపై నిర్మాతలు త్రివిక్రమ్ ను సంప్రదించారట. టైటిల్ ఉపయోగించుకునేందుకు అనుమతి కావాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించి సరే అన్నారట. దీంతో నిర్మాతలకు టైటిల్ మార్చాల్సిన పరిస్థితి మాత్రం కలగలేదు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో 'శీతాకాలం సూర్యుడి లాగా కొంచెం కొంచెం చూస్తావే' అనే సూపర్ హిట్ పాట ఉంది. ఈ పాటలో శీతాకాలం అనే పదం త్రివిక్రమ్ కు నచ్చడంతో ఆ పదం ఉండేలా రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించారట. అందులో 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ఒకటి. ఏదేమైనా టైటిల్ మాత్రం అందంగా ఉండడమే కాకుండా వినగానే ప్రేక్షకులకు నచ్చేలా ఉంది. ఈ సంగతి ఇలా ఉంటే ఈ 'గుర్తుందా శీతాకాలం' చిత్రం కన్నడ సూపర్ హిట్ సినిమా 'లవ్ మాక్టెయిల్' కు రీమేక్ గా తెరకెక్కుతోంది.