చిరంజీవి పుట్టిన రోజు హడావుడి అయిపోయింది. `ఆచార్య` టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ చూసి అభిమానులు ఫుల్ హ్యాపీ. ఆ రోజంతా ట్విట్టర్ హోరెత్తిపోయింది. మోహన్ బాబు ఓ గిఫ్టు పంపి, చిరునే కాదు, ఆయన అభిమానుల్నీ షాక్ కి గురి చేశారు. అయితే ఎక్కడో ఓ చిన్న అసంతృప్తి. చిరు నుంచి కొత్త సినిమా కబుర్లు వస్తాయని ఆశించిన వాళ్లకు నిరాశ మిగిలింది. చిరు చేతిలో కొత్త ప్రాజెక్టులు చాలా ఉన్నాయి.
లూసీఫర్ రీమేక్ ని ఇది వరకే ప్రకటించారు. దానికి వినాయక్ దర్శకత్వం వహిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు బాబి, మెహర్ రమేష్ కథలు రెడీ చేస్తున్నారు. ఈ కొత్త సినిమాలకు సంబంధించిన కబురు చిరు పుట్టిన రోజున వినిపిస్తుందని ఆశించారు. కానీ.. ఒక్క సినిమాకి సంబంధించిన అప్ డేట్ కూడా రాలేదు. కరోనా కారణంగా అన్ని సినిమాల్లానే `ఆచార్య` కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండా కొత్త సినిమాలు ప్రకటించి, అందులో ఏది ముందు, ఏది వెనుక అనే కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేయడం చిరుకి ఇష్టం లేదు. పైగా లూసీఫర్, బాబీ సినిమా, మెహర్ రమేష్ కథ.. ఇవన్నీ చిరు ముందున్న ప్రత్యామ్నాయాలు. వీటిలో ఏది ముందు.. ఏది తరవాత అనే విషయంలో చిరు ఇంకా క్లారిటీకి రాలేదు.
`ఆచార్య` రిజల్ట్ పైనే చిరు నెక్ట్స్ సినిమా ఏమిటన్నది ఆధారపడి ఉంటుంది. ఈలోగా ఏమైనా జరగొచ్చు. మరో పెద్ద దర్శకుడు చెప్పిన కథ నచ్చితే.. ఈ మూడు ప్రాజెక్టులూ పెండింగ్ లో పడిపోతాయి. అందుకే చిరు కూడా ఏమాత్రం తొందర పడడం లేదని టాక్.