ఏంటో.. ఈయేడాది ముహూర్తం బాలేదు. జనవరి 1నే... `ఆర్.ఆర్.ఆర్` వాయిదా పడుతుందన్న వార్త బయటకు వచ్చింది. ఈ సంక్రాంతి సంబరాలు చప్పగా సాగుతాయని అర్థమైంది. ఏపీలో టికెట్ల గొడవ ఓ కొలిక్కి రాలేదు. మున్ముందు సినిమాలు సవ్యంగా విడుదల అవుతాయన్న గ్యారెంటీ లేదు. పరిస్థితి చూస్తుంటే ఆచార్య కూడా వాయిదా పడడం ఖాయంగా అనిపిస్తోంది.
ఎందుకంటే... ఏపీలో టికెట్ రేట్ల గొడవ టీవీ సీరియల్ లా సాగుతూనే ఉంది. ఈ విషయం ఇప్పుడు హై కోర్టులో ఉంది. ఈ వారంలోనే తీర్పు వచ్చేస్తుందని, సంక్రాంతి సినిమాలకు కాస్త ఊరట లభిస్తుందని ఆశపడింది టాలీవుడ్. అయితే ఈ కేసులో తదుపరి విచారణని ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. అంటే ఫిబ్రవరి 10 వరకూ ఇప్పుడున్న టికెట్ రేట్లే కొనసాగుతాయి. ఆచార్యని ఫిబ్రవరి 4న విడుదల చేద్దామనుకుంటున్నారు. ఇప్పుడున్న ఈ టికెట్ రేట్లకు పెట్టుబడి తిరిగి రాబట్టడం అసాధ్యం. అందుకే ఆచార్య ఫిబ్రవరి 4న వచ్చే అవకాశం దాదాపుగా లేనట్టే. కోర్టు తీర్పు వచ్చాక పరిస్థితిని బట్టి, ఆచార్య కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారు. ఇన్నాళ్లు ఆగారు. మరో వారం ఆగితే పెద్ద నష్టం ఏమీ ఉండదు. కాబట్టి.. ఆచార్య వాయిదా పడడం.. ఖాయం.