సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ఇటీవలే విడుదలైంది. కాన్సెప్ట్ మంచిదే అయినా అదెందుకో ప్రేక్షకులకు ఎక్కలేదు. చివరికి ఫ్లాప్ గా మిగిలింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం పవన్‌కల్యాణ్ అట. ఈ మాట అన్నదెవరో కాదు.. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా. ఆ లాజిక్కేంటా..? అంటే..
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి పవన్ కల్యాణ్ అతిథిగా వచ్చాడు. ఆరోజు.. సభలో జగన్ సర్కారుపై పవన్ కల్యణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఆ తరవాత.. జరిగిన హంగామా తెలియంది కాదు. అయితే ఈ ప్రభావం రిపబ్లిక్ సినిమాపై పడిందట. జగన్ అభిమానులు, వైకాపా వాళ్లు ఈ సినిమా చూడలేదని, వాళ్లంతా కావాలని ఈ సినిమా ఫ్లాప్ చేశారని. అదంతా... పవన్ స్పీచు మహిమే అని అంటున్నారు తమ్మారెడ్డి. ఓ పార్టీ లీడర్ గా పవన్ కి ఏ విషయంపైనైనా మాట్లాడే హక్కు ఉందని, ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయొచ్చని, అయితే... దానికి ఓ సినిమా ఫంక్షన్ ని వేదిక చేసుకోకూడదని, ఆ ప్రభావం.. రిపబ్లిక్ సినిమాపై పడిందని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ స్పీచు వల్లే.. టికెట్ రేట్ల గొడవ ఇంత వరకూ వచ్చిందని విమర్శించారు తమ్మారెడ్డి.
తమ్మారెడ్డి మాటల్లో లాజిక్ ఎక్కడ మిస్ అయ్యిందంటే... ఓ సినిమా జయాపజయాలకు కథ, కథనాలే కారణం. ఎవరో ఏదో మాట్లాడరని, మంచి సినిమాని చూడకుండా పోరు. చెడ్డ సినిమాని ఆదరించరు. సినిమా నచ్చలేదు కాబట్టే జనం చూడలేదు. అది ఫ్లాపయ్యింది. అంతే తప్ప.. దానికి పవన్ ఎలా కారణం అవుతాడు. చాలా సినిమాల ఫంక్షన్లకు పవన్ వెళ్లాడు. కేవలం సినిమా గురించే పాజిటీవ్ గా మాట్లాడి వచ్చాడు. మరి ఆ సినిమాలన్నీ ఎందుకు హిట్టవ్వలేదు...? ఈ లాజిక్ ని పెద్దాయన ఎలా మిస్ అయ్యాడో?