కరోనా భయాలతో టాలీవుడ్ వణుకుతోంది. ఈమధ్య సినీ తారలు కరోనా బారీన పడడం మామూలైపోయింది. సోనూసూద్ కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన `ఆచార్య` షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో `ఆచార్య` టీమ్ అంతా అలెర్ట్ అయ్యిందని, టీమ్ లో చాలామంది సభ్యులకు ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించారని, అందుకోసం షూటింగ్ ని తాత్కాలికంగా ఆపేశారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు పవన్ కల్యాణ్ కి కరోనా సోకడంతో.. చిరంజీవి, చరణలు పవన్ పై ఫోకస్ పెట్టారని, పవన్ ఆరోగ్య విషయాలు పర్యవేక్షించడం కోసం `ఆచార్య` షూటింగ్ నిలిపి వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే.. అవేం నిజాలుకావట. ఆచార్య షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోందని సమాచారం. సోనూసూద్ కి సంబంధించిన షూటింగ్ ముగిసిందని, షూటింగ్ ముగిసిన వెంటనే ఆయన ముంబై వెళ్లిపోయారని, అక్కడకు వెళ్లిన తరవాతే... సోనూకి కరోనా అనే విషయం తేలిందని సమాచారం. ఆచార్య టీమ్ సభ్యులంతా ఆరోగ్య పరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, షూటింగ్ కూడా ఆగలేదని... ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.