గతవారం `ఆచార్య` హడావుడి నడిచింది. ఈ కథ నాదే అంటూ బి.గోపాల్ శిష్యుడు రాజేష్ మీడియా ముందుకు రావడం సంచలనం సృష్టించింది. సినిమా ఇండ్రస్ట్రీలో ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. రెండు మూడు రోజులు టీవీ ఛానళ్లు హోరెత్తిపోయాయి. ఆఖరికి మైత్రీ మూవీస్, మాట్నీ ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థలు ఈ వివాదంపై స్పందించాల్సి వచ్చింది. కొరటాల శివ కూడా మీడియా ముందుకు వచ్చి.. `ఈ కథ నాదే` అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారుతుందని భావించారంతా. చిరంజీవి కూడా కలుగు జేసుకుంటారని, ఆయన రాజేష్ ని పిలిచి మాట్లాడతారని అనుకున్నారు. కానీ సడన్ గా ఈ వివాదం సద్దుమణిగిపోయింది. రాజేష్ ఎక్కడా అలికిడి చేయడం లేదు. తెర వెనుక.. సెటిల్మెంట్ జరిగిపోయిందని, ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. `పెద్దవాళ్లతో వ్యవహారం.. నీకెందుకు` అని సినిమా పెద్దలు కొంతమంది రాజేష్‌ని శాంతింపజేసే ప్రయత్నాలు చేసినట్టు టాక్. దాంతో పాటు.. రాజేష్ కథే `ఆచార్య`గా తీస్తున్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. సినిమా విడుదల అయితే గానీ, ఈ విషయం తేలదు. కనీసం సినిమా రిలీజ్ కి ముందు గొడవ చేసినా... ఎంతో కొంత ఫలితం ఉంటుంది. అందుకే రాజేష్ కూడా సైలెంట్ అయిపోయాడని సమాచారం. మరో విషయం ఏమిటంటే. కొరటాల శివనే మీడియా ముందుకొచ్చి.. `ఈ కథ నాదే. కాపీ కొట్టలేదు. విడుదలయ్యాక మీకే తెలుస్తుంది కదా` అని స్ట్రాంగ్ గా చెప్పడంతో ఛానళ్లు కూడా రాజేష్ ని లైట్ తీసుకున్నాయి. దాంతో చప్పున ఈ వివాదం సద్దుమణిగిపోయింది.