చిరంజీవితో ఓసినిమా అయినా చేయాలని ప్రతీ దర్శకుడూ కలలు కంటుంటాడు. ఆ కల కొరటాల శివకు `ఆచార్య`తో తీరిపోయింది. అంతేనా..? చిరంజీవి, రామ్ చరణ్‌లను ఒకేసారి డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ఈనెల 29న `ఆచార్య` విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా `ఆచార్య` టైటిల్ గురించి, కథ గురించీ కొరటాల శివ ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు.
ఆచార్య టైటిల్ ఎలా పుట్టింది? అని కొరటాలని అడిగితే.... ``చిరంజీవిగారిని చూస్తుంటే `ఆచార్య` అని పిలవాలనిపిస్తుంటుంది. ఆయన్ని చూడగానే... `ఆచార్య` అనే టైటిల్ పుట్టేసింది. కథ కూడా చిరంజీవి గారిని దృష్టిలో ఉంచుకునే రాశా. అయితే.. ఆయన ఇమేజ్ ప్రభావం కథపై పడకుండా జాగ్రత్త పడ్డాను. కథనీ, ఆయన ఇమేజ్‌ని బాలెన్స్ చేయడం కత్తి మీద సాములాంటి వ్యవహారమే.. కానీ `ఆచార్య`తో ఆ రెండింటినీ బాలెన్స్ చేశాననే అనుకుంటున్నా...`` అని చెప్పుకొచ్చారు కొరటాల. అంతేకాదు.. చరణ్ నిడివి ఎంత? అనే ప్రశ్నకీ క్లారిటీగానే సమాధానం చెప్పారు. ``చరణ్ కథలో కీలకమైన భాగం. ఆయన అతిథి పాత్ర కాదు. ఆయన నిడివి ఎంత? అనే కొలతలు వేసుకోలేదు. కానీ... చరణ్ పాత్ర కథని మలుపు తిప్పుతుంది. చిరు, చరణ్‌లను ఒకేసారి ఒకే తెరపై చూడడం అభిమానులకు పండుగలా ఉంటుంద``న్నారు కొరటాల. కాజల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో సోనూసూద్ విలన్ గా కనిపించనున్నారు.